సిరిసిల్ల: జిల్లా కలెక్టర్‌గా విధుల్లో చేరిన ఎం.హరిత నెల రోజుల్లోపే దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లారు. జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా హరిత సెప్టెంబరు 29న బాధ్యతలు స్వీకరించగా.. అక్టోబరు 22న లాంగ్‌లీవ్‌పై వెళ్లారు. జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల)గా విధుల్లో చేరిన 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గరీమా అగ్రవాల్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ హరిత దీర్ఘకాలిక సెలవుల గడువు శనివారంతో ముగియనుండగా.. సోమవారం విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. మేడం కారు పంపమంటే.. పంపడం తప్ప.. అంతకుమించి సమాచారం లేదని కలెక్టరేట్‌లోని ఓ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
కొత్త కలెక్టర్‌కు కోర్టు వివాదాల చికాకు..
కలెక్టర్‌గా విధుల్లో చేరిన హరితకు పలు అంశాలు చికాకుగా తెప్పించినట్లు సమాచారం. గతంలో వరంగల్‌రూరల్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న హరితకు రాజన్నసిరిసిల్ల జిల్లా కొత్తగా ఉంది. చిన్న జిల్లా.. సమస్యలు అనేకం ఉన్నాయనే భావన కలిగింది. వచ్చీ రాగానే మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురైన నిర్వాసితుల కేసులో కోర్టు ధిక్కరణ అంశం పెండింగ్‌లో ఉంది. ఆ కేసులో కలెక్టర్‌గా హరిత కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. ఈకేసుతో తనకు సంబంధం లేకున్నా కలెక్టర్ హోదాలో కోర్టుకు సంజాయిషీ ఇవ్వకతప్పని పరిస్థి తి ఎదురైనట్లు సమాచారం. ఇక్కడ ఏడాదికిపైగా కలెక్టర్‌గా పనిచేసిన సందీప్‌కుమార్ ఝా తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాలంతో పోటీపడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్
ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న గరీమా అగ్రవాల్ కాలంతో పోటీపడుతున్నారు. సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న గరీమా అగ్రవాల్‌ను రాజన్నసిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా అక్టోబరు 22న నియమించారు. జిల్లాలో అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరుతూనే.. ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన తొలిరోజు నుంచే క్షేత్రస్థాయిలో విద్యాలయాలను, ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు పరిశీలిస్తున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్తగా నిర్మించే అంగన్‌వాడీ కేంద్రాల్లో మిషన్‌భగీరథ నీటి పైపులైన్, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సిరిసిల్లలోనే నేతన్నలకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను అమలు చేయాలని ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. డీఆర్‌డీఏ సిబ్బందికి నిబంధనల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించి గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు.. సమీక్షలతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. దీంతో గరీమా అగ్రవాల్‌నే కలెక్టర్‌గా కొనసాగిస్తారని కొందరు భావిస్తుండగా.. హరిత మేడమే మళ్లీ వస్తారని మరికొందరు పేర్కొంటున్నారు.


