సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో కస్టడీ విచారణ మూడో రోజుకి చేరింది. అత్యంత గోప్యంగా, ఎలాంటి లీకులు లేకుండా సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి వివరాలు రాబడుతున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నత స్థాయి అధికారులే స్వయంగా ఈ విచారణను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.
పైరసీ కేసులో నిందితుడు ఇమ్మడి రవికి సంబంధించిన ఆరు అకౌంట్ల వివరాల కోసం బ్యాంకు అధికారులకు సీసీఎస్ లేఖ రాసింది. ఇప్పటికే డబ్భుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు ఒప్పుకున్న రవి.. 1xbet యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించాడు. అలాగే.. మూవీ రూల్జ్ అనే వెబ్‌సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశానని.. అందుగానూ క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్జ్‌కి డబ్బులు చెల్లించానని రవి పోలీసులకు తెలిపాడు.
దర్యాప్తులో రవి తమిళ, హిందీ వెబ్‌సైట్ల ద్వారా సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కి గేట్ వే చేసి.. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతోనే రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఫ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్‌ని పోస్ట్ చేసేవాడని.. కరేబియన్ దీవుల్లో ఆఫీస్ ఏర్పాటు చేసి ఏకంగా 20 మంది యువకుల్ని రవి నియమించినట్లు తెలుస్తోంది.
అయితే రెండ్రోజులపాటు జరిగిన విచారణలో రవి నుంచి కొద్దిపాటి సమాచారాన్నే మాత్రమే సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో రవి నెట్ వర్క్ పై లోతైన విచారణ జరుపుతున్నారు. రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు.


