ఆక్సిజన్‌ కొరత లేదు.. కరోనా కంట్రోల్‌లోనే: సీఎస్‌

Corona Wave Control In Telangana Says Chief Secretary Somesh Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కంట్రోల్‌లోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి వైద్య సిబ్బంది చాలా కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. కరోనా కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్‌ తమకు దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై బుధవారం సీఎస్‌ అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘హైదరాబాద్‌ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ క్యాపిటల్‌. ఇక్కడ ఇతర రాష్ట్రాల వారే ఎక్కువమంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఆక్సిజన్‌, మందుల కొరత లేదు. ఆక్సిజన్‌ బెడ్స్ పెంచాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రస్తుతం కోవిడ్‌ ఆస్పత్రుల్లో 62వేల బెడ్స్‌ ఉన్నాయి. తెలంగాణలో 135 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఒడిశా నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ నింపుకొని రావడానికి 6 రోజులు పడుతుంది. ఎయిర్‌లిఫ్ట్‌ చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అవుతోంది. కరోనా కట్టడికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేయమని సీఎం చెప్పారు. తెలంగాణలో 90వేల రెమిడెసివిర్‌ వయల్స్‌ అందుబాటులో ఉన్నాయి. టోసిలిజుమాబ్‌ 63 వయల్స్‌ స్టాక్‌ ఉంది. అనవసరంగా ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌ మందుల్ని వృథా చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది.. ఎవరూ భయపడొద్దు. కరోనా ట్రీట్‌మెంట్‌ కూడా చాలా సింపుల్‌గా ఉంది. సాధారణ మందులతోనే కరోనా తగ్గిపోతుంది. త్వరలోనే తెలంగాణలో సాధారణ పరిస్థితులు వస్తాయి’ అని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top