TS High Court: ఎన్ని ప్రాణాలు పోవాలి?

Corona Third Wave: Telangana High Court Outraged Centres Attitude - Sakshi

మూడో వేవ్‌ వస్తున్నా కరోనా మందులను అత్యవసర జాబితాలో చేర్చరా?.. కేంద్రం తీరుపై హైకోర్టు ఆగ్రహం 

వచ్చే నెల చివరికల్లా తగిన చర్యలు తీసుకోవాలని సూచన 

కోవిడ్‌ కట్టడి ప్రణాళికల రూపకల్పనలో జాప్యమేమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీత 

కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదా అని ఆగ్రహం 

విచారణ వచ్చే నెల 4కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాలను ప్రాణాధారమైనవిగా గుర్తిస్తూ.. అత్యవసర మందుల జాబితాలో చేర్చాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోవిడ్‌ మొదటి, రెండో దశలతో ఎన్నో ప్రాణాలు పోయాయని, ఇంకా ఎన్ని ప్రాణాలు పోయిన తర్వాత మేల్కొం టారని నిలదీసింది. కరోనా చికిత్సలో వినియోగిం చిన రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు అత్యవసర మందుల జాబితాలో లేకపోవడంతో.. వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో భారీ రేట్లకు అమ్ముకున్నారని గుర్తు చేసింది. ఆయా ఔషధాలను అత్యవసర జాబితాలో చేరిస్తే.. తయారీ సంస్థలు అవసరమైన మేర వాటిని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటా యని స్పష్టం చేసింది.

కరోనా చికిత్సలో ఉపయోగించే మందులను అక్టోబర్‌ 31 నాటికల్లా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మా సనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇక కలర్‌ కోడెడ్‌ రెస్పాన్స్‌ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని గతంలో రెండు పర్యాయా లు ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. తాము దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని, ప్రభుత్వం విధానపరమైన (పాలసీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వివరణ ఇవ్వగా.. ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాలసీ తెస్తే తప్ప హైకోర్టు ఇచ్చి న ఆదేశాలను అమలు చేయరా అని ప్రశ్నిం చింది. తమ ఆదేశాలు అమలు చేయకుంటే కోర్టుధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 

పాజిటివిటీ శాతం తగ్గింది 
రాష్ట్రంలో గత రెండు నెలల్లో కరోనా కేసుల పాజిటివిటీ శాతం 0.51 శాతానికి తగ్గిందని డాక్టర్‌ శ్రీనివాసరావు ధర్మాసనానికి నివేదించారు. ఈ మేరకు ఆయన బుధవారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ‘‘ఇప్పటివరకు 2.58 కోట్ల కరోనా టెస్టులు చేశాం. ఈనెల 19 నాటికి మొత్తంగా రాష్ట్రంలో 6,63,450 కరోనా కేసులు నమోదయ్యాయి. 2.20 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాం. ఇందులో 60% మందికి మొదటి డోస్, 38% మందికి రెండు డోసులు ఇచ్చాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 97% ప్రజ లకు వ్యాక్సిన్లు ఇచ్చాం. 180 మొబైల్‌ వ్యాన్ల ద్వారా 10.07 లక్షల మందికి టీకాలు వేశాం. ఈ నెల 16 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా 25.10 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చాం. ఈ నెల 1వ తేదీ నుంచి 
ఇప్పటివరకు విద్యాసంస్థల్లో 71 మందికి కరోనా వచ్చింది’’ అని వివరించారు.  

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు పెంచండి 
రాష్ట్రంలో కరోనా ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సం ఖ్యను పెంచాలని హైకోర్టు సూచించింది. ‘‘ఈ నెల 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరిచా రు. గణేశ్‌ నిమజ్జనంలో భారీగా ప్రజలు పాలొ ్గన్నారు. త్వరలో దసరా, దీపావళి, క్రిస్మస్‌ పం డుగలు రానున్నాయి. గత 2 నెలల్లో ర్యాపిడ్‌ యాంటీ జెన్‌ పరీక్షలు దాదాపు 50లక్షలు చేయగా.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు ఇందులో 10 శాతం లేవు. కచ్చితంగా ఫలితం వచ్చే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్యను భారీగా పెంచండి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ మూడు నెలల్లో.. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందికి రెండు నెలల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి. ఈ నెల 30లోగా మూడో దశ కరోనా కట్టడికి కలర్‌ కోడెడ్‌ రెస్పాన్స్‌ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి..’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top