ఉప్పల్‌: టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గపోరు.. బొంతు వర్సెస్‌ బేతి.. శ్రీదేవి కంటతడి

Controversy with Beti Subhash Reddy made Bonthu Sridevi cry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో మరో వర్గపోరు బయటపడింది. ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్‌ నడుమ వివాదం చోటు చేసుకుంది. చర్లపల్లిలో సోమవారం ఓ ప్రారంభోత్సవం సందర్భంగా వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా ఎదుట.. కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు. 

తన డివిజనల్‌లో తనకు తెలియకుండానే.. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆమె ఆరోపిస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ‘‘నేను మాత్రం ఊరుకునేది లేదు. మూడేళ్లు ఊరుకున్నా. ఇక ఊరుకోను. ఈసారి సాక్ష్యాలు ఉన్నాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పదివేలు పడేస్తే.. చంపేస్తారంటూ బెదిరిస్తున్నారు. నా సత్తా ఏంటో కూడా చూపిస్తా’’ అంటూ ఆమె సవాల్‌ విసిరారు.

కులం పేరుతో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆమె ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డిపై ఆరోపిస్తూనే.. బీసీ సంఘాలు ఈ వ్యవహారంపై స్పందించాలని ఆమె కోరారు. ఈ వ్యవహారంపై అధిష్టానానికి కలిసి ఫిర్యాదు చేస్తానని బొంతు శ్రీదేవి చెప్పారు. 

ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి సీరియస్‌
ఇదిలా ఉంటే.. నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భార్య బొంతు శ్రీదేవి. ఉప్పల్‌లో గత కొంతకాలంగా బొంతు, బేతి వర్గాల నడుమ విభేదాలు నడుస్తున్నాయి. తాజాగా.. చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి చేసిన ఆరోపణలపై ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి స్పందించారు. ఆమె వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. శ్రీదేవి చేసిన అసత్య ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని సుభాష్‌రెడ్డి ప్రకటించారు.

ఇదీ చదవండి: ‘దొంగ–పోలీసు–దోస్తీ’  వ్యవహారాలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top