Conspiracy to Eliminate Telangana Minister Srinivas Goud! - Sakshi
Sakshi News home page

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర

Mar 2 2022 8:06 PM | Updated on Mar 3 2022 9:24 AM

Conspiracy to Eliminate Telangana Minister Srinivas Goud - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర జరిగిందని, దీనికి సంబంధించి ఎనిమిది మందిని అరెస్టు చేశామని సైబరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నిందితులు హత్యకు ప్రణాళిక వేశారని.. రూ.15 కోట్లకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. కానీ కుట్ర బయటపడుతుందన్న అనుమానంతో.. సుపారీ గ్యాంగ్‌లోని వారిని హత్య చేసేందుకు నిందితులు ప్రయత్నించారని, దీనితో అసలు విషయం బయటపడిందని వివరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన రాఘవేందర్‌రాజు, చాలువాగ్‌ నాగరాజు, వర్ద యాదయ్య, భండేకర్‌ విశ్వనాథ్, మున్నూరు రవి, మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్‌ థాపాలను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర బుధవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. 

పాత నేరస్తులు కలిసి.. 
మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్‌రాజు, శంషాబాద్‌కు చెందిన ఫరూక్‌ అహ్మద్‌ పాత నేరస్తులు. గత ఏడాది నవంబర్‌ 18న వారిద్దరూ.. మహబూబ్‌నగర్‌ కోర్టులో కలిశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసే ఉద్దేశంతో ఉన్న రాఘవేందర్‌రాజు.. కోర్టు ఆవరణలోనే ఈ విషయాన్ని ఫరూక్‌కు వివరించాడు. ఆ హత్యను ఫరూక్, అతడి గ్యాంగ్‌ చేసినా సరేనని.. లేదా ఆ పని చేయగలిగే వేరే వాళ్లనైనా తమకు పరిచయం చేయాలని కోరాడు. మంత్రిని హత్య చేసేందుకు రూ.15 కోట్లు ఇస్తామని డీల్‌ కుదుర్చుకున్నాడు. కానీ తర్వాత భయపడిన ఫరూక్‌.. ఈ విషయాన్ని తన స్నేహితుడు మహబూబ్‌నగర్‌కు చెందిన హైదర్‌ అలీకి చెప్పాడు. దీనితో విషయం బయటపడుతుందేమోనని భావించిన రాఘవేందర్‌రాజు.. ఫరూక్, హైదర్‌అలీ ఇద్దరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు.  

ఎలా బయటపడింది? 
ఫరూక్, హైదర్‌ అలీ ఇద్దరూ గత నెల 23న సుచిత్ర దగ్గర ఓ లాడ్జిలో దిగారు. 25న మధ్యాహ్నం 2 గంటలకు వారు టీ తాగేందుకు బయటికి వచ్చారు. ఆ సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మరికొందరు కలిసి వారిని చంపేందుకు కత్తులతో వెంబడించారు. వారి నుంచి తప్పించుకున్న ఫరూక్, హైదర్‌అలీ.. సాయంత్రం 5 గంటల సమయంలో పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 26న యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్‌లను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. 27న నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారించగా.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు జరిగిన కుట్ర బయటపడింది. మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్‌రాజు మరికొందరితో కలిసి మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని నాగరాజు వాంగ్మూలంలో వివరించాడు. ఈ వివరాలతోపాటు నిందితుల ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా.. రాఘవేందర్‌రాజు, మున్నూరు రవి, మధుసూదన్‌రాజు ముగ్గురూ ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి వారిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వారిని విచారించగా కుట్ర పూర్తి వివరాలు బయటపడ్డాయి. 

మహబూబ్‌నగర్‌ టు ఢిల్లీ.. వయా వైజాగ్‌.. 
రాఘవేందర్‌రాజు, మున్నూరు రవి, మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు అంతా కలిసి ముందుగా మహబూబ్‌నగర్‌ నుంచి విశాఖపట్నానికి.. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లినట్టు ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వారికి బీజేపీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పీఏ రాజు, డ్రైవర్‌ థాపా కలిసి.. ఢిల్లీ సౌత్‌ అవెన్యూలోని సర్వర్‌ క్వార్టర్స్‌లో షెల్టర్‌ ఏర్పాటు చేశారని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. నిందితులకు షెల్టర్‌ ఇచ్చిన వారికి నోటీసులు ఇచ్చామని.. అందులో థాపాను అరెస్టు చేయగా, పీఏ రాజు పరారీలో ఉన్నాడని తెలిపారు. మంత్రి హత్య డీల్‌కు సంబంధించిన రూ.15 కోట్లను మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజు సమకూరుస్తామని చెప్పినట్టుగా తేలిందని సీపీ వివరించారు. రాఘవేందర్‌రాజు నుంచి 9 ఎంఎం పిస్టల్, రెండు తూటాలను.. మున్నూరు రవి నుంచి ఒక రివాల్వర్, 6 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితులు ఈ ఆయుధాలను దుండిగల్‌ అటవీ ప్రాంతంలో దాచిపెట్టారని, వారు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఆయుధాలను ఉత్తరప్రదేశ్‌ నుంచి కొనుగోలు చేసినట్టు నిందితులు చెప్పారని, ఎవరి వద్ద కొన్నారనేది ఇంకా తేలాల్సి ఉందని సీపీ వివరించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుచరులకు కూడా ఈ వ్యవహారంలో హస్తమున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. నిందితులను క్షుణ్నంగా విచారించి, పూర్తి వివరాలను రాబడతామని ప్రకటించారు. 

తప్పుల్ని బయటపెట్టిన వారిపైనే..
పోలీసులు పెట్టిన తప్పుడు కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తాం. సామాజిక బాధ్యతగా ఆర్టీఐ ద్వారా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తప్పుల్ని బయటపెట్టిన యువకులపైనే మంత్రి హత్యకు కుట్ర అంటూ కేసులు పెట్టారు.     – బీజేపీ నేత ఏపీ జితేందర్‌రెడ్డి 


సీబీఐతో విచారణ జరిపించాలి.. 
రాష్ట్ర మంత్రిపై హత్యకు కుట్ర అనేది చాలా పెద్ద విషయం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో నిజానిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి. లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. అన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలతో కథ అల్లి నాపై కుట్ర ఆరోపణలు మోపడం సరికాదు. సీపీ స్టీఫెన్‌ రవీంద్రకు ఉమ్మడి ఏపీ నాటి నుంచి మంచి పేరు ఉంది. ఆయన లాంటి వ్యక్తి అబద్ధాలు మాట్లాడడం తగదు.  
– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు  డీకే అరుణ 

Advertisement
 
Advertisement
Advertisement