రూ.2 లక్షల బీమా.. ఐడీ కార్డు 

Congress Targets 30 Lakh Membership In Telangana Extends Rs 2 Lakh Insurance Cover - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు ప్రారంభం 

గాంధీభవన్‌లో లాంఛనంగా ప్రారంభించిన మాణిక్యం ఠాగూర్‌ 

సభ్యత్వం తీసుకున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్, సీఎల్పీ నేత భట్టి 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకునే కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డు ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల ప్రమాదబీమా సౌకర్యం కల్పించనున్నారు. సభ్యత్వం తీసుకునే ప్రతి కార్యకర్తకు బీమా కల్పించాలన్న ఉద్దేశంతో ఏఐసీసీ అనుమతి తీసుకుని ఈ సౌకర్యాన్ని కల్పించాలని టీపీసీసీ నేతలు నిర్ణయించారు. సోమవారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 26 వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని కాంగ్రెస్‌ నేతలు లక్ష్యంగా పెట్టుకోగా, ఫొటో, ఇతర సమాచారంతో సభ్యత్వం ఇచ్చేలా టీపీసీసీ డేటా అనలిటికల్‌ విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది.

కార్యక్రమ అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పదవులు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ పార్టీలో సభ్యత్వం మాత్రం శాశ్వతం’అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సభ్యత్వం ఉన్నవారికి సంక్షేమ పథకాల్లో తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. సభ్యత్వ నమోదుపై ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా, మండల పార్టీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.  

కార్డు కాదు.. గౌరవం 
కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం అంటే కేవలం కార్డు మాత్రమే కాదని, అది ఒక గౌరవమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఏఐసీసీ సూచనలకు అనుగుణంగా పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించామని, కార్యకర్తలు, నేతలందరూ షెడ్యూల్‌ ప్రకారం సభ్యత్వాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top