ఆస్పత్రుల్లో చేర్పిస్తాం..  మందులు అందిస్తాం!  

Congress Plans Steps To Support COVID Victims - Sakshi

టీపీసీసీ కోర్‌ కమిటీ నిర్ణయం 

మాస్కుల పంపిణీ, రోగుల బంధువులకు ఆహారం అందజేత 

మే 21న ఊరూరా కరోనా సాయం  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బాధితులకు కాంగ్రెస్‌ అభయ‘హస్తం’అందించనుంది. అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా రోగులకు అండగా ఉండాలని టీపీసీసీ కోర్‌ కమిటీ నిర్ణయించింది. కరోనా సోకినవారిని ఆసుపత్రుల్లో చేర్పించడం, మందులు, ఇం జక్షన్లు అందించడంతోపాటు అవసరమైనవారికి ఆక్సిజన్‌ సమకూర్చేలా చర్యలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ అధ్యక్షతన జూమ్‌ యాప్‌ ద్వారా కోర్‌ కమిటీ సమావేశమైంది.

సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్‌ కృష్ణన్, మధుయాష్కీ, సంపత్‌ కుమార్, ఎమ్యెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు పాల్గొ న్నారు. అనంతరం కోర్‌ కమిటీ సభ్యులు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, ముఖ్యనేతలతో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై చర్చిం చారు. కరోనా బాధితుల బంధువులకు ఉచితంగా భోజనాలు అందించాలని కోర్‌ కమిటీ కోరింది. ఈ నెల 21న మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రతిగ్రామంలో కరోనా సేవ చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో 50 మందికి మాస్కులు అందజేయాలని సూచించింది.  

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అంబులెన్సులు 
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అంబులెన్సులు ఏర్పాటు చేయాలని శ్రేణులకు కోర్‌ కమిటీ సూచించింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సహకారంతో గాంధీభవన్‌లో ఏర్పాటు చేస్తున్న రెండు అంబులెన్సులను హైదరాబాద్‌కు 50 కి.మీ. పరిధిలో ఉండేవారు ఉపయోగించుకోవాలని కోరింది. జగ్గారెడ్డి తన నియోజకవర్గంలో ఆక్సిజన్, అంబులెన్స్‌ సౌకర్యాలను రోగులకు సమకూర్చిన తీరును వివరించారు. 

పక్క రాష్ట్రాల్లో ఉచితం, ఇక్కడేమో..: ఉత్తమ్‌  
సీఎం కేసీఆర్‌ అనాలోచిత వైఖరితోనే రాష్ట్రంలో కరోనా ఉపద్రవం ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు ఉచితంగా కరోనా వైద్యం అందిస్తుంటే తెలంగాణలో మాత్రం లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, పేదరోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌లో కానీ, ఆరోగ్యశ్రీలోకానీ ఉచిత వైద్యం అందించాలని కోరారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలు భయాందోళనకు గురవుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షపార్టీగా ప్రజలకు భరోసా కల్పిం చాలని కోరారు. ఏఐసీసీ ఆదేశాలను పాటిస్తూ కరోనా నివారణకు కృషి చేయాలని కోరారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top