మరోసారి సమన్వయ లోపం.. కాంగ్రెస్‌లో ‘ఎంపీలాట’! నల్లగొండ సభ వాయిదా

Congress Party Priyanka Gandhi Sabha at Sarurnagar Stadium - Sakshi

నల్లగొండ నిరుద్యోగ సభపై సమన్వయ లోపం 

21న చేపడతామని తొలుత ప్రకటన.. దానిపై నేతల్లో జగడం 

అధిష్టానం నేతల జోక్యం.. 28న నిర్వహించేందుకు నిర్ణయం 

ఈ నెల 24 నుంచి వరుసగా పలు జిల్లాల్లో సభలు  

మే 4న లేదా 5న సరూర్‌నగర్‌ స్టేడియంలో ప్రియాంకా గాంధీ సభ 

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగ సభల నిర్వహణ విషయంలో కాంగ్రెస్‌లో సమన్వయ లోపం మరోసారి కనిపించింది. నల్లగొండ సభ విషయంలో ముఖ్యనేతల మధ్య వివాదం తలెత్తడంతో.. అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి శుక్రవారమే జరగాల్సిన ఈ సభ 28వ తేదీకి వాయిదా పడింది. టీఎస్‌పీఎస్సీ పరీక్షల లీకేజీ, నిరుద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై నిరసనలు చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా పలు జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ సభలతోపాటు వచ్చేనెల మొదటి వారంలో పార్టీ ముఖ్యనేత ప్రియాంకా గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. నల్లగొండలో శుక్రవారం నిరుద్యోగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండలో నిర్వహించే సభ గురించి తనకు సమాచారం లేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఇక రేవంత్‌ తీసుకునే నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉంటాయని కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానానికి ఇన్‌చార్జిగా ఉండి కూడా.. నల్లగొండ సభ విషయంలో సైలెంట్‌ అయిపోయారు. ఇలా ముగ్గురు కీలక నేతల మధ్య నల్లగొండ సభ జగడం పార్టీలో గందరగోళానికి దారితీసింది. దీనితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

వారు ఎంపీలతో చర్చించి 21న జరగాల్సిన నల్లగొండ సభను 28కి వాయిదా వేయించారు. మిగతా జిల్లా కేంద్రాల్లో ప్రకటించిన నిరుద్యోగ సభలు యథాతథంగా జరగనున్నాయి. 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, 28న నల్లగొండ, 30న పాలమూరు, మే 1న రంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగ సభలు జరుగుతాయి. 

మే 4న లేదా 5న తేదీల్లో ప్రియాంక సభ 
నిరుద్యోగ సభల అనంతరం మే 4న లేదా 5న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో సభ నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఆ సభకు పార్టీ కీలకనేత ప్రియాంకా గాంధీ హాజరుకానున్నారు. అయితే ఏ రోజున ప్రియాంక పర్యటన ఉంటుందన్నది ఒకట్రెండు రోజుల్లో ఖరారు అవుతుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ప్రియాంక సభతో రాష్ట్రపార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top