దళితుల రక్షణకు చట్టాలున్నా ఫలితం సున్నా! | Congress party leaders meets add DG over attacks on Daliths | Sakshi
Sakshi News home page

దళితుల రక్షణకు చట్టాలున్నా ఫలితం సున్నా!

Aug 1 2020 4:22 AM | Updated on Aug 1 2020 4:28 AM

Congress party leaders meets add DG over attacks on Daliths - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆగని ఆగడాలతో దళితులు ఆగమవుతున్నారని, వారికి రక్షణ కరువైందని, దళితుల కోసం ప్రత్యేక చట్టాలున్నా ఫలితం లేకుండాపోయిందని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా సిద్దిపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో చోటుచేసుకున్న దళితుల ఆత్మహత్య, హత్య ఘటనలపై లోతుగా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని దళితులందరికీ సంపూర్ణ భద్రత కల్పించాలని డీజీపీని కోరింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.సంపత్‌ కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ నాగరిగారి ప్రీతమ్, పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌లు శుక్రవారం డీజీపీ కార్యాలయంలో అడిషనల్‌ డీజీ జితేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

దళితులపై ఆగని ఆగడాలు..
‘రాష్ట్రంలో దళితులకు, బడుగు, బలహీన వర్గాలకు భద్రత లేకుండా పోతుంది. దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం ఒక్కరోజే రెండు సంఘటనలు జరిగాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం వర్గల్‌ మండలం వేలూరు ఘటనలో తన చావుకు స్థానిక వీఆర్వో, సర్పంచ్, ఎమ్మార్వోలే కారణమని బాధితుడు పేర్కొన్నారు. దీన్ని మరణవాంగ్మూలంగా తీసుకొని వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలి. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజపూర్‌ మండలం తిర్మలాపూర్‌లో ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. దళిత యువరైతును లారీతో తొక్కించి హత్య చేశారు. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఇటీవలే భూపాలపల్లి జిల్లా మల్హర్‌ రావు మండలం మల్లారంలో రాజబాబు అనే దళిత యువకుడిని కొంతమంది అగ్రవర్ణాల వారు దారుణంగా హత్య చేశారు. మంథని నియోజక వర్గంలో రామగిరి గ్రామానికి చెందిన శీలం రంగయ్యను పోలీసులు లాకప్‌ డెత్‌ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.

2017లో సిరిసిల్ల ప్రాంతంలోని నెరేళ్ల గ్రామంలో ఇసుక లారీలు రాత్రిపూట తిరగడం వల్ల ప్రమాదాలు జరిగి జనం మరణిస్తున్నారని అడ్డుకున్నందుకు దళిత, బలహీన వర్గాల యువకులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. దీం తో ఆ యువకులు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. మంథని నియోజకవర్గంలోని మహాముత్తారాం మండలంలో జాడి కవిరాజ్‌ అనే దళిత యువకుడి ఆత్మహత్య, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టేకు లక్ష్మిపై అత్యాచారం లాంటి సంఘటనలు ఇటీవల కాలంలో చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని దళితులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాడులు, హత్యల విషయంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దళితులకు రాజ్యాంగపరంగా ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. ఇక నుంచైనా వారికి సంపూర్ణ భద్రత కల్పించాలని కోరుతున్నాం’అని వినతిపత్రంలో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement