
కాంగ్రెస్ నేత వేణుగోపాల్ స్వామి
పంజగుట్ట: త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు ఆసక్తి లేదని సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ నాయకుడు సి.ఎ.వేణుగోపాల్ స్వామి పేర్కొన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 2024 ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టిక్కెట్ అడిగిన విషయం వాస్తవమే అని కాని అధిష్టానం తనకు ఇవ్వలేదని దానం నాగేందర్‌కు ఇచ్చిందన్నారు.
ఆయన కోసం తాను పనిచేశానని కాని ఓడిపోయామని గుర్తుచేశారు. ఇటీవల కొంతమంది తన అభిమానులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ టిక్కెట్ తనకు ఇవ్వాలని బ్యానర్‌లు ఏర్పాటు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని సదరు బ్యానర్లు ఎవరు ఏర్పాటు చేశారో కూడా తనకు తెలియదన్నారు. జూబ్లీహిల్స్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ నుంచి ఇప్పటికే 10 మంది వరకు ఆశిస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఈ విషయమై ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.