ఎంతకాలం గుజరాత్‌కు గులాంలుగా ఉంటారు? | CM Revanth Reddy Slams Union Minister Kishan Reddy Over Central Funds | Sakshi
Sakshi News home page

ఎంతకాలం గుజరాత్‌కు గులాంలుగా ఉంటారు?

Jun 9 2026 3:54 AM | Updated on Jun 9 2026 6:06 AM

CM Revanth Reddy Slams Union Minister Kishan Reddy Over Central Funds

మియాపూర్‌ సభలో ప్రసంగిస్తున్నముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రాష్ట్రానికి అవసరమైన అనుమతులు, నిధుల కోసం ఎందుకు పాటుపడరు?

మియాపూర్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, ఇతర ఎంపీలకు లేదా? 

నేను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా పాలల్లో ఉప్పు వేసినట్లు.. పనులు చేస్తే ఆయనకే పేరొస్తదంటూ కిషన్‌రెడ్డి చెడగొడతారు.. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు పుట్టగతుల్లేకుండా తీర్పిస్తారు 

సీఎంసీ భవనం సహా రూ.1,675 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు  

సాక్షి, హైదరాబాద్‌:  ‘రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు కూడా గెలిస్తేనే కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యారు. ఆయన సబర్మతీ రివర్‌ఫ్రంట్‌ కడితే ఆహా.. ఓహో.. అబ్బా అని పొగుడుతారు. కానీ మనకు అవసరమైన మూసీ రివర్‌ ఫ్రంట్‌ను మాత్రం అడ్డుకుంటారు.

 కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు ఎంపీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కారా? మన అభివృద్ధికి, మన ప్రజల అవసరాలు తీర్చేందుకు ఎందుకు ప్రయత్నించరు?  ఎంతకాలం గుజరాత్‌కు గులాంలుగా ఉంటారు? ఈ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడి ఎంపీలకు లేదా? నగర తాగునీటి అవసరాలకు గోదావరి, సింగూరు జలాలు, మెట్రో విస్తరణ, రీజినల్‌ రింగ్‌రోడ్, మూసీ  ప్రక్షాళనలకు అనుమతులు, నిధుల కోసం ఎందుకు పాటుపడరు?..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

‘మున్సిపల్‌ వార్డు ఎన్నికలకు సైతం మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. ఇక్కడి మన మోరీలో మురికి తీయాలంటే మోదీ వస్తారా? అందుబాటులో ఉండి పనులు చేసేవారిని, ఇక్కడి సమస్యలు తెలిపిన వారిని గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి..’ అని అన్నారు. ‘పదేపదే నేనేం చేశానని

అడుగుతున్న వాళ్లు.. ప్రస్తుతం ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ పదేళ్లలో, ప్రధాని మోదీ పన్నెండేళ్లలో ఏం చేశారో చెబితే.. గత రెండేళ్లలో నేనేం చేశానో చెబుతా. ఈ అంశంపై అసెంబ్లీలో నాలుగు రోజులు చర్చ పెడతాం. నేనేం చేశానో, ఏం ప్రణాళికలున్నాయో పీఏసీ చైర్మన్‌ గాంధీతోనే చెప్పిస్తా..’ అని చెప్పారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మియాపూర్‌లో దాదాపు రూ.1,675 కోట్ల విలువైన..సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) కార్యాలయ భవనం సహా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు  చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.  

వివక్ష, వితండవాదం వద్దు 
    ‘రాజకీయాలు, జెండాలు, అజెండాలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వివక్ష, వితండవాదం లేకుండా ప్రతిపక్ష పారీ్టలు ముందుకు రావాలి. 2009 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు రాజకీయం చేద్దాం.. అప్పటిదాకా అభివృద్ధికి సహకరించాలి. చేతనైతే కేసీఆర్, కిషన్‌రెడ్డి విలువైన సూచనలివ్వాలే కానీ, అబద్ధాలు, అవినీతి, అహంకారంతో  అడ్డుపడొద్దు. మీ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు.

నేను ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్రమంత్రుల్ని కలిసిన ప్రతిసారీ మూడు రోజుల తర్వాత వారిని కలిసి.. పాలల్లో ఉప్పు వేసినట్లు.. పనులు చేస్తే ఆయనకే పేరొస్తదని కిషన్‌రెడ్డి చెడగొడతారు. ఇలాగే అభివృద్ధికి అడ్డం పడితే రాబోయే రోజుల్లో ప్రజలు పుట్టగతుల్లేకుండా తీర్పు ఇస్తారు. మీరు మళ్లీ ఢిల్లీ వెళ్లకుండా చేస్తారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు.  

ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దనే.. 
    ‘ప్ర«దాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివసించే ఢిల్లీలో కాలుష్యం సమస్య. ముంబైలో వరదనీరు, ట్రాఫిక్, మురికివాడల సమస్యలు. ఐటీకి పేరెన్నికగన్న బెంగళూరులో ట్రాఫిక్‌ సమస్య. ఇంటినుంచి వెళ్తే ఎయిర్‌పోర్టుకు చేరేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. చెన్నైలో అపార్ట్‌మెంట్లు, కాలనీలు వర్షమొస్తే నీళ్లలోనే. కోల్‌కతాలో బయటకు వెళ్లినవారు ఇంటికి ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో తెలియని శాంతిభద్రతల సమస్య. వాటి తీవ్రతను అర్థం చేసుకునే హైదరాబాద్‌కు ఆ దుస్థితి  రాకుండా నిపుణుల సూచన మేరకు మూడు కార్పొరేషన్లు చేశాం. ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా సరిహద్దులు నిర్ణయించాం..’ అని రేవంత్‌ తెలిపారు. 

పేదల కోసం లక్ష ఇళ్లు 
    ‘కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఆడబిడ్డలు.. ఆదానీ, అంబానీలతో, కార్పొరేట్‌ దిగ్గజాలతో పోటీ పడుతున్నారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో పాటు పెట్రోలు బంకుల నిర్వహిస్తున్నారు. అమెజాన్‌లో ఇందిరా మహిళాశక్తి స్టాల్స్‌ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఆడబిడ్డలకు ప్రథమ ప్రాధాన్యం, నిరుద్యోగ యువతకు ద్వితీయ ప్రాధాన్యం ఇస్తున్నాం. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు, స్పోర్ట్స్‌ స్కూళ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నాం. మహానగరంలో పేదల కోసం లక్ష ఎల్‌ఐజీ, ఎంఐఈ ఇళ్లు కడతాం. 

గాజుల రామారంలో అంతర్జాతీయ స్థాయిలో బస్‌ టెరి్మనల్‌  
    ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి గాజుల రామారంలో వెయ్యి ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బస్‌ టెరి్మనల్‌ పనులు త్వరలో ప్రారంభించనున్నాం. సీఎంసీ కార్యాలయాన్ని సైతం ఐటీ కార్పొరేట్‌ కంపెనీల కార్యాలయాలను తలపించేలా నెట్‌జీరోగా నిర్మిస్తాం..’ అని సీఎం చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ..రాబోయే కాలంలో విశ్వనగరంగా ఎదిగేందుకు పనులు చేపడతామని  చెప్పారు. శేరిలింగంపల్లిలో 1,500 ఐటీ సంస్థలు ఉండగా, 10 లక్షల మంది పనిచేస్తున్నారని, వారికి రవాణా, మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుదని అన్నారు.  

ఒకేచోట 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన 
    గచ్చిబౌలి: సీఎంసీ, విద్యాశాఖ, హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ శాఖల నిధులతో ఒకేచోట 11 ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. మియాపూర్‌లోని లక్ష్మీనగర్‌లో వేదిక వద్ద ఈ మేరకు 11 శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. సీఎంసీ ప్రధాన కార్యాలయం, మియాపూర్‌ చౌరస్తాలో ఫ్లై ఓవర్, శేరిలింగంపల్లి ఆర్‌ఓబీ నిర్మాణం, ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఉన్న సర్వీస్‌ రోడ్డు కోసం ప్రధాన వంతెన, పలు రోడ్లు, ఆర్వోబీలు, యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ  కార్యక్రమానంతరం పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

కాగా ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌తో తయారు చేసిన  శాలువ, బొకెతో సీఎం రేవంత్‌రెడ్డిని సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన సన్మానించారు. వాటర్‌ పెట్‌ బాటిల్స్‌ వ్యర్థాలతో శాలువ తయారు చేయగా, బొకెను షాంపు బాటిల్స్‌ వ్యర్థాలతో రూపొందించారు. ప్లాస్టక్‌ వ్యర్థాలతో తయారు చేసిన కుర్చిలలో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు కూర్చున్నారు. దుండిగల్‌లో ఏర్పాటు చేయనున్న చెత్త ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ నమూనాను సీఎం పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement