వడ్లే కాదు అన్ని పంటలూ పండించండి.. కొనుగోలు చేయిస్తా: సీఎం రేవంత్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది
60 శాతం ఆదాయం ఆ జిల్లా నుంచే..
నేను అల్లాటప్పాగా రాలేదు..
కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా..
ఈ నెల 15 తర్వాత కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా..
అడ్డం పడినా..అభివృద్ధి ఆగదు
2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని వెల్లడి
కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్, రిజిస్ట్రేషన్ ఆఫీసు భవనాలకు శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘వడ్లు ఒక్కటే కాదు.. కొత్తిమీర, పాలకూర, కూరగాయలు, పండ్లు పండించండి. కొనుగోలు చేయిస్తా. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేస్తా.. రైతును రాజు చేస్తా’అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నుంచే ఈ మార్కెట్లో క్రయవిక్రయాలు మొదలు పెడతామని, రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి, స్థానిక శాసన సభ్యుడిదేనని చెప్పారు. రేవంత్ ఇంకా ఏమన్నారంటే..
పండుగ అని నిరూపిస్తా..
‘గతంలో నగరానికి ఎవరొచ్చినా.. వారికి అవసరమైన పాలు, పండ్లు, కూరగాయలు రంగారెడ్డి జిల్లా రైతాంగమే అందించేది. ఎటు చూసినా ద్రాక్ష తోటలే దర్శనమిచ్చేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు వచ్చింది. భూముల విలువ పెరిగింది. ఎకరాలు, గజాల్లోకి మారాయి. కాయగూరలు, పండ్ల తోటలు కనుమరుగయ్యాయి. మోదీ ప్రభుత్వంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. గ్రేటర్ జిల్లాల్లో 1.30 కోట్ల మంది జనాభా నివసిస్తోంది. నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. అంతే వేగంగా పండ్లు, కూరగాయల పంటలు తగ్గిపోయాయి. రైతాంగం మళ్లీ పంటలు పండించాలి. పాలు, పండ్లు అందించాలి. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాల్సిన అవసరం వచ్చింది. పంట ఉత్పత్తులు మార్కెట్‌కు తీసుకొచ్చి విదేశాలకు అమ్ముకోవాలి.
అక్కడికి వెళ్తే శ్మశానానికి వెళ్లినట్లే ఉంటుంది
రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వానికి 60 శాతం ఆదాయం ఈ జిల్లా నుంచే సమకూరుతోంది. నిత్యం రూ.కోట్ల విలువ చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. అక్కడికి వెళ్తే.. శ్మశానానికి పోయినట్లుగా ఉంటుంది. ప్రభుత్వానికి ఏటా రూ.17 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆఫీసుల్లో కనీసం కూర్చోడానికి కుర్చీ, తాగేందుకు నీళ్లు లేవు. ‘కస్టమర్ ఈజ్ అవర్ గాడ్’అన్నారు.. అలాంటి వారిని ఇలా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం. ఓఆర్‌ఆర్‌కు ఆనుకుని 12 క్లస్టర్లుగా విభజించి, అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించుకుంటున్నాం.
ఎవరి మెడలైనా వంచుతా...
‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. అవసరమైతే ఫాంహౌస్‌లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్‌గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్‌రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా.
దిక్కుమాలిన సలహాలు మాకొద్దు
ప్రాజెక్టులు ఎలా కట్టాలో, లిఫ్ట్‌లో ఎలా కట్టాలో? మాకు హరీశ్‌రావు సలహా ఇస్తున్నాడు. తాటి చెట్టులా పెరిగాడు. మీ వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దిక్కుమాలిన సలహాలు మాకొద్దు. కేసీఆర్ కుర్చీ వేసుకుని పాలమూరు ఎత్తిపోతల కడతానని చెప్పి.. మందేసుకుని ఫాం హౌసులో కూర్చున్నాడు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. అభివృద్ధే కాదు.. సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇళ్లు ఇచ్చాం. కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండున్నర లక్షల ఇళ్లు, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మించుకోబోతున్నాం. ఆడబిడ్డలకు రూ.60 వేల కోట్లు బ్యాంకు రుణాలు ఇచ్చాం. త్వరలోనే ఖాళీలను భర్తీ చేసుకోబోతున్నాం. ఆనాడు మీరు వి«ధ్వంసం చేస్తే.. మేను వికాసం వైపు నడిపిస్తున్నాం. మీ అసూయ, పగ, ద్వేషం మాపై చూపండి కానీ తెలంగాణ ప్రజలపై కాదు. కష్టాలు, నిధుల కొరత ఉంది. రూ. 8.11 లక్షల కోట్ల అప్పు ఉంది. అయినా ధైర్యం కోల్పోలేదు. వయసు చిన్నదైనా బాధ్యత పెద్దది. రోజుకు 18 గం టలు కష్టపడి ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. సమస్యలను చూసి పారిపోయే వాడిని కాదు.
వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు..
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకున్నప్పుడే గుర్తింపు వస్తుంది. అడ్డం పడినా.. ఏడుపు వినేది లేదు. చేపట్టిన ఫ్యూచర్‌సిటీ, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, మార్కెట్‌ను నిర్మించుకునేదే. కడుపులో మంట ఉన్నవాళ్లకు అజీర్తి ఉంటుంది. వాళ్లను పట్టించుకోవాల్సి అవసరం లేదు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లకు 1.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి రైతుల సత్తా చూపాం. ఏ ఊరిలో వడ్లు పండించినా కాళేశ్వరం నీళ్లే అని చెప్పారు. కానీ ఇప్పుడు లేదు. రూ.లక్ష కోట్లు కోట్లు గోదావరిలో కలిపినోళ్లను..అదే గోదావరిలో కలపాల్సిన అవసరం ఉంది.
అడ్డుకుంటే..అడ్రస్ లేకుండా చేస్తా..
అంతర్జాతీయ విమానాశ్రయం లాగే.. పండ్ల మార్కెట్ కూడా జిల్లాకు గుర్తింపు తెస్తుంది. కందుకూరులో పండే టమాటా ఎంతో రుచిగా ఉంటుంది. రైతుల పంటకు గిట్టుబాటు కోసం అక్కడ ఓ సాస్ కంపెనీ పెట్టబోతున్నాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో కాలుష్య కారక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తే.. మేము దాన్ని గ్రీన్ ఫార్మా ఫ్యూచర్‌సిటీగా మార్చుతున్నాం. మేము రైతు సంక్షేమం కోసం మార్కెట్లు, అనేక పరిశ్రమలు, ప్రాజెక్టులు, తెస్తుంటే ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అడ్డుకుంటోంది. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తాం. షెడ్డుకు పోయిన కారును అడ్రస్ లేకుండా చేస్తాం’అని సీఎం హెచ్చరించారు. చివరగా ‘ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్’నినాదంతో సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. కాగా, రైతులు, వారికి మద్దతుగా నిలిచిన స్థానిక బీజేæపీ, బీఆర్‌ఎస్ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో అలజడి సృష్టించే ప్రమాదం ఉందని అనుమానించిన పోలీసులు వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకే శంకుస్థాపనకు హాజరు కావాల్సి ఉండగా, స్థానికంగా ఉన్న ఉద్రిక్తపరిస్థితులు, అకస్మాత్తు వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.


