రాష్ట్రం 'పంట' పండాలి | CM Revanth Reddy Says Farmers should cultivate all types of crops | Sakshi
Sakshi News home page

రాష్ట్రం 'పంట' పండాలి

Jun 3 2026 2:16 AM | Updated on Jun 3 2026 2:16 AM

CM Revanth Reddy Says Farmers should cultivate all types of crops

మంగళవారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రైతులు కొన్నింటికే పరిమితం కావద్దు.. అన్ని రకాల పంటలు సాగుచేయాలి

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు

యాసంగి ధాన్యం సేకరణలో రాష్ట్ర వాటా 60% కావడం గర్వకారణం  

త్వరలో వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటు పనులు 

ఉద్యోగాల భర్తీకి ఈ నెలలోనే టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ 

సెప్టెంబర్‌ 17 నాటికి మిగతా 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి 

త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం  

రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న సీఎం 

పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకం ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూల క్షేత్రం. రైతులు కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలు, కూరగాయలు, పండ్లు పండించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పాలి..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోనే కాదు.. ప్రపంచానికే తెలంగాణను గేట్‌వేగా నిలబెట్టాలన్నది తన స్వప్నమని చెప్పారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘2025–26లో 236.87 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోళ్లకు రూ.82,840 కోట్లు ఖర్చు చేశాం. యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 63.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.11,903 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 10 వేల మెట్రిక్‌ టన్నుల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దేశంలో యాసంగిలో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60% కావడం గర్వకారణం. యాసంగిలో 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగుతో రైతులు చరిత్ర సృష్టించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..’అని సీఎం చెప్పారు.  

రూ.60 వేల కోట్ల భూములు స్వాధీనం 
‘రాష్ట్రంలో ప్రజలు రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం ఆదరాభిమానాలు చూపడం మాకు ఎనలేని శక్తిని ఇచ్చింది. మేం పాలకులుగా కాకుండా సేవకులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. క్యూర్‌ ఏరియాలో ప్రభుత్వ భూములు, చెరువుల్లో కబ్జాలను తొలగించడం ద్వారా రూ.60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా భూములను హైడ్రా స్వాదీనం చేసుకుంది. మెట్రో రైలు కొనుగోలు చేసి ప్రజల ఆస్తిగా మార్చాం. ఫేజ్‌–1 కింద మూసీ ప్రక్షాళన ప్రారంభించాం. 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. శంషాబాద్‌ను బుల్లెట్‌ రైలు కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. త్వరలో వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటు పనులు ప్రారంభిస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడానికి రూ.లక్ష కోట్ల జీరో వడ్డీ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రూ.60 వేల కోట్ల రుణాలను పంపిణీ చేశాం. రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. కొత్తగా ఇందిరా మహిళా శక్తి సూపర్‌ బజార్లు, లాజిస్టిక్‌ హబ్‌లు, గోదాములు, రైస్‌ మిల్లులు ఏర్పాటుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు 8 వేల స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. 

మహారాష్ట్ర సీఎంకు ఏడాదిగా లేఖలు.. 
‘జలయజ్ఞం ప్రాజెక్టులు, 2014–15 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను పునరుద్ధరణ మొదలు పెట్టాం. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి తుమ్మిడిహెట్టి బరాజ్‌ నిర్మించడానికి మహారాష్ట్ర సమ్మతి కోరేందుకు ఆ రాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం గతేడాదిగా లేఖలు రాస్తున్నా. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్‌ శాఖలు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్, అటవీ, విద్యా శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వస్తుంది. నోటిఫికేషన్ల జారీ నిరంతరం జరుగుతుంది. 

విద్యా రంగంలో సంస్కరణలు    
సర్కారీ విద్యలో సంస్కరణలతో కేంద్రం విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌లో తెలంగాణ మంచి స్థానాన్ని పొందింది. తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు 65 ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కళాశాలలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా పునర్‌ వ్యవస్థీకరించాం. స్కిల్స్‌ యూనివర్సిటీలో 1,190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేయగా, 838 మంది మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్‌ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఈ ఏడాది మరో 2,769 బడుల్లో ప్రీ ప్రైమరీ విద్య ప్రవేశపెట్టబోతున్నాం. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ బడులు, కళాశాలల్లో బ్రేక్‌ ఫాస్ట్‌ పథకాన్ని ప్రవేశపెట్టడడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్‌ కాలేజీలకు విస్తరిస్తున్నాం..’అని రేవంత్‌ వెల్లడించారు.  

గ్రేహౌండ్స్‌కు గ్యాలెంటరీ అవార్డులు 
విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్యాలెంటరీ అవార్డులు ప్రదానం చేశారు. విద్యారంగంలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకూ పురస్కారాలు అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో గ్రేహౌండ్స్‌ విభాగం ఆర్‌ఐ టి.మహేశ్, ఎస్‌ఐ షేక్‌ నాగుల్‌ మీరా, హెచ్‌సీ కె.ఆదినారాయణ, ఏఆర్‌ఎస్‌ఐ కె.అశోక్, పీసీలు ఆర్‌.సునీల్‌కుమార్, ఎం.కళ్యాణ్‌కుమార్, జి.శ్రీధర్, సీహెచ్‌ రవీంద్రబాబు, రాథోడ్‌ రమేశ్, కె.సందీప్‌కుమార్, ఎం.కార్తీక్, వి.మధు, సీహెచ్‌ సంపత్, ఎస్‌ఐబీ ఏఆర్‌ఎస్‌ టి.మహేందర్‌ రావు, ఇంటిలిజెన్స్‌ హెచ్‌సీ బి.శివకుమార్, పంజాగుట్ట ట్రాఫిక్‌ పీసీ బండికింది శ్రవణ్‌కుమార్‌ ఉన్నారు. 2018 మార్చి 2న ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లోని పూజారి కాంకేర్‌లో నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన బి.సుశీల్‌కుమార్‌ తరఫున అతడి సతీమణి బి.సుష్మకుగ్యాలెంటరీ పురస్కారాన్ని సీఎం అందజేశారు. కాగా కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.విజయ్‌కుమార్, సిద్దిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.గోవర్ధన్, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కౌసర్‌ జహాన్, హనుమకొండలోని గట్ల నార్సింగాపూర్‌ మాధ్యమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్‌.వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా మణికొండ జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.నిరంజన్‌ ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు.  

సీఎం ప్రసంగానికి ఎండ దెబ్బ! 
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలుత గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్ద సీఎం నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఎండ తీవ్రతను ప్రస్తావించిన సీఎం.. తన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండా ముగిస్తున్నట్టు ప్రకటించారు. రాతపూర్వకంగా ఇచి్చన పూర్తి ప్రసంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మీడియాకు సూచించారు.  

13 నెలల్లోనే 1.2 లక్షల ఇళ్లు
‘రూ. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభించి 13 నెలల్లోనే లక్షా 20 వేల ఇళ్లను పూర్తి చేశాం. సెప్టెంబర్‌ 17 నాటికి మిగతా 2 లక్షల ఇళ్లూ పూర్తి చేస్తాం. రెండో విడతగా క్యూర్‌ పరిధిలో లక్ష, మిగిలిన ప్రాంతాల్లో 2.5 లక్షలు కలిపి మొత్తం 3.5 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లనూ రెండో విడతలో పూర్తి చేయాలని నిర్ణయించాం. 15.12 లక్షల కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసి 3.38 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. స్కిల్డ్‌ వర్కర్లకు 25.9 శాతం, అన్‌ స్కిల్డ్‌ వర్కర్లకు 34.95 శాతం కనీస వేతనాలు పెంచాం. తెలంగాణ పోరాట యోధులను గుర్తించడానికి కమిటీని నియమించాం. త్వరలో ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమలు చేయనున్నాం. రాష్ట్రాన్ని 2034 నాటికి ట్రిలియన్‌ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తెలంగాణ రైజింగ్‌ – 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ప్రకటించాం. మీ అందరి సహకారం, ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ ఆర్థికాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి..’అని సీఎం పిలుపునిచ్చారు.   

Advertisement
 
Advertisement
Advertisement