
కమ్యూనిస్టుల సహకారం వల్లే మేం అధికారంలోకి వచ్చాం
మరోసారి మేము గెలిచేందుకు సహకారం అందించండి
నేడు ఆవారాగాళ్లు కూడా జర్నలిస్టు ముసుగేసుకుంటున్నారు
ప్రెస్‌మీట్లలో అలాంటివాళ్లను కొట్టాలన్నంత కోపం వస్తది
నవ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి
హాజరైన మంత్రి పొంగులేటి, సీపీఎం నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడా నికి కమ్యూనిస్టు ఉద్యమాలే కారణమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 2004, 2023లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కమ్యూనిస్టులు సహకారం అందించారని తెలిపారు. ఈ అధికారం ఇలాగే కొనసాగడానికి, మరోసారి తాము అధికారంలోకి రావడానికి కూడా కమ్యూనిస్టులు సహ కరించాలని కోరారు. కమ్యూనిస్టులు ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడంకంటే, అధికారంలో ఉన్నోడిని దించేయటంలో ముందుంటారని చురకలంటించారు.
భవిష్యత్‌లో కూడా కాంగ్రెస్– కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ‘కృషి మీది.. అధికారం మాది.. సహకారం కొన సాగాలి’అని కమ్యూనిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నవ తెలంగాణ దినపత్రిక దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం సమాజంలో పత్రికల పాత్ర, జర్నలిస్టులుగా కొందరు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ నేతల్లాగే జర్నలిస్టుల విశ్వసనీయత తగ్గుతోంది
ప్రస్తుతం సమాజంలో మీడియా సంస్థలు విశ్వసనీయతని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతోంది. అక్షరాలు రానివారు కూడా జర్నలిస్టు ముసుగు వేసుకుని సోషల్ మీడియా పేరుతో తిరుగుతున్నారు. ఒకప్పుడు జర్నలిస్టు అంటే నిబద్ధత ఉండేది. ఇప్పుడు ఆవారాగాళ్లు, తిట్లు వచ్చేవాళ్లు జర్నలిస్టు అనే ముసుగు తొడుక్కొని వస్తున్నారు. ప్రెస్‌మీట్లలో మూడు గంటల ముందే వచ్చి ముందు కూర్చుంటారు.
ఇంకా నమస్కారం పెట్టడం లేదేంటని గుడ్లురుమి చూస్తారు. అలాంటి వాళ్లను కిందకు దిగి కొట్టాలనిపిస్తుంది. జర్నలిజంలో ఇవాళ వింత పోకడలు వచ్చాయి. వాటికి రాజకీయ పార్టీలు తోడయ్యాయి. రాజకీయ నాయకుల తరహాలోనే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతోంది. నిజమైన జర్నలిస్టులను, జర్నలిస్టుల ముసుగు తొడుక్కున్న వారిని వేరు చేయాల్సిన అవసరం ఉంది’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
కమ్యూనిస్టులు ఉప్పులాంటివారు
‘కమ్యూనిస్టులు ఉప్పు లాంటివారు.. ఉప్పు లేని వంట రుచి ఉండదుం. అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కని పించినప్పుడే ఆ సమస్యల పరిష్కారం జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అబద్ధాల ప్రాతిపదికన జరిగే నిర్మాణం కూలిపోతుందని నమ్మే వ్యక్తిని నేను. నిజం చెప్పకపోయినా, అబద్ధం మాత్రం చెప్పను.
కమ్యూనిస్టులను నమ్మించి మోసం చేశారు ఇప్పటి వరకు. నాకు కమ్యూనిస్టుల పట్ల అపార గౌరవం ఉంది. ఎంపీగా గెలిచినప్పుడు పార్టీ కార్యాలయాన్ని మల్లు స్వరాజ్యంను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రారంభించాను. ప్రభుత్వ ప్రకటనల్లో నవ తెలంగాణ పత్రికకు ఇతర ప్రధాన పత్రికలతో సమానంగా ప్రాధాన్యతనిస్తాం. నవ తెలంగాణలో ప్రజా సమస్యలపై వచ్చే వార్తల పరిష్కారానికి కృషి చేస్తాం’అని సీఎం తెలిపారు.
కమ్యూనిస్టుల ఆశయాలను కాంగ్రెస్ సాకారం చేస్తోంది: మంత్రి పొంగులేటి
కమ్యూనిస్టులు పేదల పక్షాన నిలిచి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తుంటారని, నిత్యం పేదలకు అండగా ఉంటారని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాలలో నిజాయితీని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించేందుకు పని చేస్తోందని తెలిపారు. తాము పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తున్నామని చెప్పారు. గులాబీ రంగు వేసుకున్న కొన్ని పత్రికలు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై అసంబద్ధంగా వార్తలను ప్రచురించినా సానుకూల దృక్పథంతోనే ముందుకు పోతున్నట్లు పేర్కొన్నారు.
సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. అమెరికాకు భయపడి ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడడానికి భయపడుతున్న మోదీని వెనుకేసు కొచ్చే స్థితిలో దేశంలోని మీడియా ఉందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్. ప్రియాంక, పార్టీ నేతలు బి.వి. రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.