బయటకు రాలేని పరిస్థితులొస్తాయి! | CM Revanth Reddy Comments On El Nino Effect | Sakshi
Sakshi News home page

బయటకు రాలేని పరిస్థితులొస్తాయి!

Oct 24 2026 2:14 AM | Updated on Oct 24 2026 2:14 AM

CM Revanth Reddy Comments On El Nino Effect

ప్రజాభవన్‌లో మంత్రులు, పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌

అక్టోబర్‌ నుంచి జూలై వరకు కరువు ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి

సాగునీటి కంటే తాగునీటికే కష్టాలు వస్తాయి  

ఎల్‌నినోను ప్రభుత్వం, పార్టీ పరిష్కరించలేవు 

చేతినిండా పని.. కడుపునిండా భోజనం కల్పించడమే మన లక్ష్యం కావాలి 

యాసంగిలో పంటలకు నీళ్లివ్వలేం.. 

అన్ని విషయాలు ప్రజలకు చెప్పండి... నిజాలు దాచిపెట్టొద్దు 

నాడు కరోనా సమయంలో కేసీఆర్‌ మాటలు నమ్మిన వాళ్లు శ్మశానాలకు వెళ్లారు 

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సంక్రాంతి తర్వాత కొత్త పథకం 

వేల కోట్లు ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది 

నవంబర్‌ 1న ఢిల్లీలో తెలంగాణ సత్తా చూపెట్టాలని సూచన

ప్రజాభవన్‌ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు

సాక్షి, హైదరాబాద్‌: ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఇంత తీవ్రమైన ప్రభావం చూపే విపత్కర పరిస్థితి రాలేదు. ఇదే మొదటిసారి. ఇప్పుడు వచ్చిన ఎల్‌నినో చిన్నగా మొదలై వెళ్లే కొద్దీ జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీన్ని ప్రభుత్వం, పార్టీ, కార్యకర్తలు పరిష్కరించడం కుదరదు. అందుకే ప్రజలను అప్రమత్తం చేయాలి. క్షుద్రపూజలు చేసేవాళ్లు కూడా నీతులు చెబితే తెలంగాణ సమాజం సహించదు. మన మంత్రులు, అధికారులు, ప్రభుత్వ వ్యవస్థను సమన్వయం చేసుకుని వెళ్లేందుకు ఉపసంఘం వేశాం. చేతి నిండా పని, కడుపు నిండా భోజనం పెట్టడమే లక్ష్యంగా మనం పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి    ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

ప్రజలను అప్రమత్తం చేయాలి 
ఎల్‌నినో అంటే ఏదో భూతం కాదు.. కరువు. రానురాను ఎండ వేడి విపరీతంగా పెరుగుతుంది.. నీళ్లు అందుబాటులో ఉండవు. ఎండ వేడి, నీటి కొరత వల్ల విద్యుత్‌ వినియోగం బాగా పెరుగుతుంది. కరువు, వర దలు, భూకంపాలను మనం నివారించలేం. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అని, కాంగ్రెస్‌ వల్లే కరువు వచ్చిందని కొందరు మాట్లాడుతున్నారు. రాజకీయ దురుద్దేశంతో కొందరు ప్రకటనలు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడుతోపాటు ప్రపంచంలోని 100 దేశాలపై ఎల్‌నినో ప్రభావం ఉంది. మామ, అల్లుళ్లు మాత్రమే మేధావులా? మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మంచినీటిని రేషన్‌Œలా ఇస్తున్నారు. అక్టోబర్‌లో మొదలైన కరువు జూలై వరకు ఉంటుంది. ఎండ వేడి పెరుగుతుంది.. నీటి ఆవిరి పెరుగుతుంది.. నీటి సమస్య వస్తుంది. సాగునీటి కంటే తాగునీటికే కష్టాలు వస్తాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలను అప్రమత్తం చేయకుండా, వారిని భాగస్వాములను చేయకుండా ఈ కరువును ఎదుర్కోలేం. 

కేసీఆర్‌ మాటలు నమ్మితే శ్మశానాలకు వెళ్లారు 
2019లో కరోనా వచ్చింది. కరోనా గురించి అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు, ఎండ కొడితే, క్రోసిన్‌ వేసుకుంటే పోతుందని కేసీఆర్‌ దబాయించి మాట్లాడారు. కరోనాను సీసాలో వేసి బంధిస్తానన్నట్లుగా మాట్లాడారు. లక్షలాది మంది కరోనాతో చనిపోయారు. శ్మశానాల్లో స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలు నమ్మారు. బాధ్యత లేకుండా కరోనాపై మాట్లాడటం వల్ల చాలామంది శ్మశానాలకు వెళ్లారు. కేసీఆర్‌ మాటలు నమ్మనివాళ్లు ఈ రోజు బతికి ఉన్నారు. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటున్న హరీశ్‌ రావును నమ్ముకుని పంటలు వేసుకుంటే, మట్టి పోసి అంబలి తాగాల్సి వస్తుంది.   

భూమిలో నీళ్లు లేవు 
వానాకాలం పంటలను ఏదో రకంగా రక్షిస్తాం. కొనుగోలు చేస్తాం. సన్న వడ్లను ఏడు రకాలకే పరిమితం చేయడం బోనస్‌ ఎగ్గొట్టడానికేనని హరీశ్‌ రావు ఆరోపించారు. మన మాటలు ప్రజలు నమ్మినందుకు రూ.3,500 నుంచి రూ.4,500 వరకు క్వింటాల్‌ అమ్ముతున్నారు. బియ్యం ధరలు పెరగడానికి మనమే కారణమంటున్నారు. తాటిచెట్టంత పెరిగినా, ఆవగింజ అంత అవగాహన లేదంటే ఆయన పేరు హరీశ్‌రావు. ఫాంహౌజ్‌లో కేసీఆర్‌ ప్రణాళికలు వేస్తే బావ బామ్మర్దులు ఊరు మీద తిరిగి ప్రచారం చేస్తారు. తాగునీరే లేనప్పుడు సాగునీరు ఇవ్వడం అసాధ్యం. నీళ్లు లేనప్పుడు కరెంటు ఇవ్వడం అసాధ్యం. బోర్లు ఎండిపోతున్నాయి. యాసంగిలో చుక్క నీరు దొరకదని చెబుతున్నా. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీరు డెడ్‌స్టోరేజిలో ఉంది. ప్రతి చుక్కను ఒడిసిపట్టుకుని తాగునీరు సమకూర్చుకోవడం తప్ప వేరే అవకాశమే లేదు. ఈ కరువు సమస్యను 8–10 నెలలు ఎదుర్కోవాలి. ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు వెళ్లాలే తప్ప రైతులు వేరే ఆలోచన చేయొద్దు. 

పశువులు జాగ్రత్త 
ఈ కరువులో పశువుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి గడ్డి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే ప్రణాళికలు, గాడీలు కట్టి ట్యాంకర్లతో నీటిని తెచ్చి పోసే ఏర్పాట్లు చేసుకోవాలి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి తీసుకోవడంతోపాటు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పశుసంపదను కాపాడుకోవాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, హైదరాబాద్‌ మహానగరానికి నీటి సరఫరాపై ప్రణాళికలుండాలి. కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలతో సమావేశపర్చి వార్డు స్థాయి వరకు టోల్‌ఫ్రీ నంబర్లు పెట్టి అప్రమత్తం చేయాలి. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌కాంగ్రెస్‌ భాగస్వామ్యం కావాలి. ఎంత ఖర్చు పెట్టయినా విద్యుత్‌ కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. రూ.15 పెట్టి కొనాలన్నా కూడా మార్కెట్‌లో విద్యుత్‌ అందుబాటులో లేదు. స్వీయ నియంత్రణనే ఇందుకు మార్గం.   

అసెంబ్లీలో అన్నీ చెబుతా.. 
యాదాద్రి ఓ అద్భుతమని, దాంతోనే కరెంటు వచ్చిందని ఆ సన్నాసులు మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను, ఆ కుటుంబాన్ని, జగదీశ్వర్‌రెడ్డిని ఏ చెట్టుకో, గుంజకో కట్టేసి కొట్టినా తప్పులేదు. లక్ష కోట్లు దోచుకోవడానికి వేసిన ప్రణాళికనే యాదాద్రి పవర్‌ ప్లాంటు. గోదావరి దగ్గర బొగ్గు ఉంటే.. ప్రాజెక్టు కృష్ణా పరీవాహక ప్రాంతంలో కట్టారు. 40 ఏళ్లలో రూ.లక్ష కోట్లు బొగ్గు రవాణా కోసమే ప్రజలపై అదనపు భారం పడుతోంది. నోరు తెరిస్తే అబద్ధాలు... నిజం మాట్లాడితే తలపగిలి చస్తారనే శాపం వారికి ఉండొచ్చు. వారు పదేళ్లలో ఏదీ వదల్లేదు. గాలి (విండ్‌ పవర్‌), ఎండ (సోలార్‌పవర్‌)ను కూడా వదల్లేదు. కొండపోచమ్మ నుంచి నీళ్లు కూడా ఫామ్‌హౌజ్‌కే తీసుకెళ్లారు. నేను, నా కుటుంబం అనే రీతిలోనే వ్యవహరించి రూ.1,500 కోట్ల ఎఫ్‌డీలు వాళ్ల పార్టీ పేరు మీద నగదు పెట్టుకున్నారు. అసెంబ్లీలో ఎదురుగా కూర్చోబెట్టి ఒక్కో కాగితం చూపించి చెప్తా. సహజ వనరులను దోచుకున్న దాని గురించి అసెంబ్లీలో అన్ని విషయాలు చెబుతా. 

మీరే పేరు పెట్టండి 
ఈ కరువులో భూమి లేని వారు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వారికి ఉపాధి కల్పించాలి. ఇందు కోసం సంక్రాంతి తర్వాత నాలుగు నెలలు ప్రత్యేక ప్రణాళిక తీసుకోవాలి. ఉపాధి హామీ నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంటు కలిపి మంచి పథకాన్ని రూపొందించాలి. దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో చెప్పండి. సంక్రాంతి తర్వాత అందరూ గ్రామాల బాట పట్టాలి. పట్టణాలు వదలాల్సిందే. మీ లొకేషన్‌ కోసం యాప్‌ తయారు చేస్తాం. మీరు ఎక్కడున్నారో మీ గన్‌మెన్‌ల దగ్గర డేటా తెప్పిస్తా. పర్యవేక్షణ బాధ్యతలు తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగిస్తా. లొకేషన్‌ తుమ్మల ఇస్తే.. శిక్ష ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వేస్తాడు. ఎండాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు నోడల్‌ ఆఫీసర్‌గా ప్రతి రోజూ బులెటిన్‌ విడుదల చేస్తారు. గాం«దీభవన్‌లో డెస్క్‌ పెట్టి సమాచారం క్షేత్రస్థాయికి పంపాలి. 

కష్టపడితే మనదే గెలుపు 
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘2021లో మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 5,31,268 ఓట్లుంటే ఇప్పుడు 1,91,360 ఓట్లు నమోదయ్యాయి. అంటే 36 శాతం నమోదయ్యాయి. అలాగే, నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం నియోజకవర్గంలో గతంలో 5,05,565 ఓట్లు ఉంటే ఇప్పుడు 2,44,349 (48 శాతం) ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ కూడా 7 లక్షల ఓట్లు నమోదు లక్ష్యంగా పెట్టుకోవాలి. అర్హత ఉన్న ప్రతి ఓటరును నమోదు చేయించాలి. కష్టపడితే మనదే గెలుపు. ఒక్కసారి హైకమాండ్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత వాద ప్రతివాదనలకు అవకాశం లేదు. 

బీజేపీ, బీఆర్‌ఎస్‌లు దొంగదెబ్బలు తీయాలని కుట్ర చేస్తున్నాయి. చీకటి ఒప్పుందాలు చేసుకుంటున్నారు. అలయ్‌బలయ్‌ చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పార్టీ భుజాల మీద మోసి సామా రామ్మోహన్‌రెడ్డి, సర్వోత్తమ్‌రెడ్డిలను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. సైమన్‌ గోబ్యాక్‌ తరహాలోనే జ్ఞానేశ్‌ గోబ్యాక్‌ నినాదంతో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ రాజీలేని పోరాటం చేస్తోందని, ఏఐసీసీ పిలుపు మేరకు నవంబర్‌ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగే ఆందోళనకు రాష్ట్రం నుంచి 10–15 వేల మంది వెళ్లాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. మంత్రులతో సహా అందరూ బాధ్యత తీసుకుని ఢిల్లీలో తెలంగాణ సత్తా చూపెట్టాలని కోరారు.  

భట్టికి ప్రత్యేక అభినందనలు 
విద్యుత్‌శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను సీఎం రేవంత్‌ ప్రత్యేకంగా అభినందించారు. తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దసరా పండుగ భట్టి పేరుమీదనే జరిగిందని ప్రశంసించారు. ‘ఇలాంటి సమయంలో కూడా ఆయన అవసరమైన కరెంటును అందిస్తున్నారు. ఇక, నా స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో దావత్‌ మొత్తం భట్టి పేరు మీదనే జరిగింది. మా ఊర్లో ప్రతి కుటుంబానికి సోలార్‌ విద్యుత్‌ పేరు మీద రూ.20–25 వేలు పడ్డాయి. జోరుగా దావత్‌ చేశారు. మా ఊరిని చూపించి రాష్ట్రవ్యాప్తంగా ఎవరింటికి వాళ్ల ఇంటి మీద సోలార్‌ పలకలు ఏర్పాటు చేయించండి. మహిళా సంఘాలను ఇందులో భాగస్వాములను చేయండి’ అని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement