
చర్చ లేకుండా బిల్లు ఆమోదం పొందడంలో కీలక పాత్ర
దేశంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నేత
‘జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు’ ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన నాయకుడు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చూపిన చొరవే కారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిన జైపాల్‌రెడ్డి దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఐసీఎఫ్‌ఏఐ ఫౌండేషన్ ఫర్ హైయ్యర్ ఎడ్యుకేషన్, కేపిటల్ ఫౌండేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో.. రచయిత, ఆర్థిక నిపుణులు మోహన్ గురుస్వామికి ‘ఎస్.జైపాల్‌రెడ్డి డెమోక్రసీ అవార్డు’ను ప్రదానం చేసిన అనంతరం సీఎం ప్రసంగించారు.
తెలంగాణలో పీవీ తర్వాత జైపాల్‌రెడ్డే..
జైపాల్‌రెడ్డి పాత్ర లేకపోతే ఇవాళ ప్రత్యేక రాష్ట్రం వచ్చేదే కాదని రేవంత్‌రెడ్డి చెప్పారు. చర్చ లేకుండానే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా ఆయన ప్రత్యేక పాత్ర పోషించారని, జైపాల్‌రెడ్డి చొరవతోనే తెలంగాణ ఏర్పాటు చేశామని సోనియాగాంధీ కూడా ఒక సందర్భంలో తనతో చెప్పారని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడినా, తిరిగి కాంగ్రెస్‌లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్ప.. పదవుల కోసం ఆయన ఎన్నడూ పారీ్టలు మారలేదని చెప్పారు. పెట్రోలియం శాఖ మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని, సమాచార శాఖ మంత్రిగా ప్రసార భారతి చట్టాన్ని దేశానికి అందించారని గుర్తు చేశారు.
పార్లమెంటులో రాణించిన వాజ్‌పేయి మొదలుకుని అనేకమంది మేధావుల్లో ఎవరితోనూ జైపాల్‌రెడ్డికి వ్యక్తిగత వైరం లేదని, చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో పీవీ నరసింహారావు తర్వాత అంత పేరు తెచ్చుకున్న నాయకుడు జైపాల్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక నిలువెత్తు శిఖరం అని, పీవీ, జైపాల్‌రెడ్డి లాంటి వారి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాల్లో ఉండాలని చెప్పారు.
ఇప్పుడంతా స్విగ్గీ పాలిటిక్స్
పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపైనే జైపాల్‌రెడ్డి ఎక్కువ ఆలోచించేవారని, రాజకీయాలలో ధన ప్రవాహం తగ్గించాలని ప్రయత్నించారని రేవంత్ చెప్పారు. అయితే నాటి ఐడియాలజికల్ పాలిటిక్స్ పోయి ఇవాళ స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయని, దేశ రాజకీయాల్లో సైద్ధాంతిక రాజకీయాలు పోయి మేనేజ్‌మెంట్ పాలిటిక్స్ వచ్చాయని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని, యూనివర్సిటీల్లో విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ‘భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముందున్న సవాళ్లు’అనే అంశంపై రాజ్యసభ సభ్యుడు శస్మిత్ పాత్రా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎఫ్‌ఏఐ ఫౌండేషన్ వీసీ ప్రొఫెసర్ ఎల్.ఎస్.గణేశ్, కేపిటల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులను ప్రదానం చేశారు.