సిరిసిల్ల ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్‌ను కోరిన సీఎం రేవంత్‌రెడ్డి
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కలెక్టర్ తెలుగు సంభాషణ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అనర్గళంగా తెలుగులో మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో గురువారం వైరల్‌గా మారింది. ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీపై సీఎం రేవంత్‌రెడ్డి బుధ వారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలను ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా ఇంగ్లిష్ లో వివరిస్తుండగా.. సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని ‘కలెక్టర్ గారూ.. తెలుగులో మాట్లాడండి.. తెలుగు వచ్చుకదా.. అన్ని జిల్లాల మహిళా సంఘాల మహిళలు ఉన్నారు.
వీలైనంత మేరకు తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి’అని నవ్వుతూ అన్నారు. దీంతో కలెక్టర్ వెంటనే తెలుగు వస్తుంది సార్.. కచ్చితంగా మాట్లాడుతా అంటూ జిల్లాలో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ విధానం, ఇతర వివరాలను తెలుగులో అనర్గళంగా వివరించారు. అన్ని జిల్లాల సమాఖ్యల మహిళలు సిరిసిల్ల జిల్లాకు వచ్చి చీరల ఉత్పత్తిని చూసి, నాణ్యతను చూసి సంతోషపడ్డారని చెప్పారు. సిరిసిల్లలో మరో వారంలో చీరల ఉత్పత్తి పూర్తవుతుందన్నారు. బుధవారం సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ తెలుగు ప్రసంగం గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


