యాసంగిలో ఏ ఏ పంటలేయాలి?

CM KCR Will Finalize Cultivation Policy In Telangana - Sakshi

నేడు నియంత్రిత సాగు విధానాన్ని ఖరారు చేయనున్న సీఎం కేసీఆర్‌ 

విదేశాల నుంచి మక్కల దిగుమతికి కేంద్రం అనుమతి 

ఈ నేపథ్యంలో మక్కలు సాగు చేయాలా? వద్దా? అనేదానిపై సూచనలు

ఉన్నతాధికారులతో సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి పంటల సాగు విధానం, గ్రామాల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శనివారం ప్రగతిభవన్‌లో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి ఓ విధానాన్ని ఖరారు చేయనున్నారు. ‘కేంద్రం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటుండటంతో దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శనివారం జరిగే సమావేశంలో ఈ విషయంపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది’అని ముఖ్యమంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

గ్రామాల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు 
కరోనా ముప్పు ఇంకా తొలగనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను కోనుగోలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లపై కేసీఆర్‌ సమీక్షిస్తారు. ‘కరోనా నేపథ్యంలో గత యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు చేశారు. ఇంకా కరోనా ముప్పు తొలగలేదు అందుకే వానాకాలం పంటలను కూడా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలి. 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. దీనికి అనుగుణంగా ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. పంటల కొనుగోలు తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలి. దీని కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను ముందుగానే చేయాలి’అని సీఎం అధికారులను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top