పంట నష్టం జిల్లాలకు నేడు సీఎం కేసీఆర్‌

CM KCR Visit for crop loss districts Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షానికి పంట నష్టం అధికంగా వాటిల్లిన 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ గురువారం పర్యటించి, రైతులతో మాట్లాడి భరోసా కల్పించనున్నారు. అకాల వర్షాలకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో వరి, మిర్చి, మామిడి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

రైతులు భారీగా నష్టపోయారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, అధికారులు ఇప్పటికే విస్తృతంగా పర్యటించారు. వారి నివేదికల ఆధారంగా సీఎం కేసీఆర్‌ గురువారం ఆ నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. 

సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. 
ముఖ్యమంత్రి ఉదయం 10:15కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని రామపురానికి వెళతారు. అక్కడ  పంట నష్టం వివరాలు పరిశీలించి, రైతులతో సమావేశమవుతారు. 

– రామపురం నుంచి మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండా చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలిస్తారు. రైతులకు భరోసా కల్పిస్తారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తారు. 

– రెడ్డికుంట నుంచి వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురానికి, అక్కడి నుంచి కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం వెళ్లి పంటల నష్టం వివరాలు తెలుకుంటారు. రైతులతో మాట్లాడతారు. ఈ పర్యటనలో మంత్రులు, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం పాల్గొంటారు.   

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top