వాసాలమర్రికి నేనే అండగా ఉంటా: సీఎం కేసీఆర్

CM KCR Speech With Vasalamarri Village People - Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో గ్రామస్తులందరితో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. వాసాలమర్రికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానని కేసీఆర్‌ పేర్కొన్నారు. గ్రామ రూపరేఖలు మారాలని, అభివృద్ధి పనులు జరగాలన్నారు. అందరం కలిసి ఏడాది కల్లా బంగారు వాసాలమర్రి కావాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కావొద్దని, ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి పరిష్కారం చేసుకోవాలని సూచించారు.

గ్రామాభివృద్ధి కమిటే సుప్రీంకోర్టు
‘చుట్టపక్కల గ్రామాలన్నీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.  అందరూ కలిసి శ్రమిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. అంకాపూర్‌కు వెళ్లొచ్చి చూశారు కదా.. అక్కడ బంగారు భూమి లేదు. అంకాపూర్‌లో బిల్డింగ్‌లు ఎలా ఉన్నాయ్‌. అక్కడ ఉన్నది రైతులే.. అంకాపూర్‌లో గ్రామాభివృద్ధి కమిటే సుప్రీంకోర్టు. సర్పంచ్ తప్పు చేసినా ఆ గ్రామ కమిటే ఫైన్ వేస్తుంది. 45 ఏళ్లుగా అంకాపూర్‌కు పోలీసులు వెళ్లాల్సిన అవసరం రాలేదు.

రాష్ట్ర ప్రభుత్వమే అండగా ఉంటే మీకు అన్నీ జరుగుతాయి. అభివృద్ధి జరగాలంటే మహిళలే ముఖ్యం. మీరు పట్టుబడితే, ఆలోచన చేస్తే ఊరు బాగుంటుంది. 1500 మంది వారానికి రెండు గంటలు ఊరి కోసం పనిచేస్తే మారదా. ఆరోజు నుంచి వాసాలమర్రి నా ఊరే. గ్రామంలో ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి. వాసాలమర్రిలో కమ్యూనిటీ హాల్‌ కట్టుకుందాం.  వాసాలమర్రి గ్రామస్తులు ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవాలి. కులాలు, పార్టీలకతీతంగా అభివృద్ధి చేద్ధాం.’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

వాసాలమర్రికి అదృష్టం పట్టింది
‘మళ్లీ 20 రోజుల్లో వస్తా. ఈసారి చెట్టుకింద కూసుందాం. దళిత వాడల్లోకి వచ్చి వారి మంచి చెడులు తెలుసుకుంటా. 10వ తరగతి చదివిన సుప్రజ ఆర్థిక స్థోమతతో పై చదువుల కోసం వెళ్లలేని పరిస్థితి నా దృష్టికి వచ్చింది. నేను తరచూ వెళ్ళేటప్పుడు వాసాలమర్రి వద్ద దేవుడు నాకు ఎందుకో బుద్ధి పుట్టించాడు. వాసాలమర్రికే ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారని మిగిలిన ఎమ్మెల్యేలు ఆలోచించొద్దు. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు సీఎం ప్రత్యేక నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు.

ఆరు మున్సిపాలిటీల్లో భువనగిరికి రూ.కోటి మిగిలిన అయిదు మున్సిపాలిటీలకు రూ.50లక్షల చొప్పున నిధుల మంజూరు. వాసాలమర్రికి అదృష్టం పట్టింది. వంద గ్రామాల వారు వచ్చి వాసాలమర్రిని చూసి నేర్చుకునేలా అభివృద్ధి చేయాలి. మనదంతా ఒకటే కులం అభివృద్ధి కులం. వాసాలమర్రిలో గ్రామఅభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో రాని నీళ్లు ఎర్రవల్లిలో 24 గంటలు నల్లా తిప్పితే నీళ్లు వస్తాయి’. అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

చదవండి:
 సీఎం కేసీఆర్‌ భోజనం: 23 రకాల వెరైటీలతో మెనూ! 

Huzurabad: గులాబీ గూటికి ముద్దసాని కశ్యప్‌ రెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top