14వ సారి.. 6 గంటలు కలియదిరిగిన సీఎం కేసీఆర్‌

CM KCR: Inspects Yadadri Temple Renovation Works - Sakshi

 మేలో దర్శనం యాదాద్రిలో సీఎం కేసీఆర్‌

చినజీయర్‌ ఆశీర్వచనం తీసుకున్నాక స్వయంభూ దర్శనాలకు ముహూర్తం

తుది దశకు చేరుకున్న ఆలయ నగరం నిర్మాణ పనులు

6 గంటలపాటు కలియదిరిగిన సీఎం

నిర్మాణాల్లో మార్పుచేర్పులపై పలు సూచనలు

దేశంలో ఆలయాలకు ఆదర్శంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలి

గుట్ట కింద ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి సాయం చేస్తా్తమని హామీ

సాక్షి, యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని.. వచ్చే మే నెల నుంచే స్వయంభూ నరసింహుడి దర్శనం కల్పించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. త్రిదండి చినజీయర్‌స్వామి ఆశీర్వచనం తీసుకుని, శుభ ముహూర్తంలో భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభిస్తామని తెలిపారు. పనుల్లో వేగం పెంచి, ఈ నెలాఖరుకే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. సుమారు ఆరు గంటల పాటు యాదాద్రిలో గడిపారు. ఆర్కిటెక్ట్, అధికారులకు పలు సూచనలు చేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి  హోదాలో యాదాద్రికి రావడం ఇది 14వ సారి కావడం గమనార్హం.

పనుల పూర్తిపై సంతృప్తి
గురువారం ఉదయం 12.08 గంటలకు హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. తర్వాత కాన్వాయ్‌తో కొండపైకి చేరుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. తర్వాత బాలాలయంలో ప్రతిష్టామూర్తులకు ప్రత్యేక పూజలు, సువర్ణ పుష్పార్చన జరిపించారు. ఆలయ ఆచార్యులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు 90 శాతం పూర్తి కావడం పట్ల సీఎం కేసీఆర? సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఏయే పనులు అసంపూర్తిగా ఉన్నాయి, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్న అంశాలను ఆర్కిటెక్ట్, అధికారులతో సమీక్షించారు. నర్సింహుడి దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలో ఉన్న అనుభూతి కలిగించాలని, దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండేలా చూడాలని సూచించారు. విద్యుత్‌ దీపాల కాంతిలో దేదీప్యమానంగా వెలగాలని సూచించారు. ఆలయ ప్రాంగణంలో క్యూ కాంప్లెక్సులపై ఆధ్యాత్మిక భావన కల్పించేలా శంకుచక్రనామాలు, నారసింహ రూపాల ఏర్పాటు బాగుందని మెచ్చుకున్నారు. మాడవీధులు, అష్టభుజి ప్రాకారాలు, సాలహారాలు, వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్, శివాలయ నిర్మాణం పురోగతి, స్వామి పుష్కరిణి, భక్తుల స్నాన గుండం, మెట్లదారి నిర్మాణాలను పరిశీలించారు. ప్రహరీకి మరింత శోభ వచ్చేలా ప్రాచీన చిత్ర కళా అలంకృత రూపం (అర్నమెంటల్‌ లుక్‌)తో సుందరంగా తయారు చేయాలని సూచించారు.

హడావుడి పడకూడదు 
అద్భుతమైన కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నప్పుడు హడావుడి పడకూడదని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాల్లోని శిల్పసంపద ఎలా ఉందో చూసి రావాలని అధికారులకు చెప్పారు. ప్రహ్లాద చరిత్ర సహ నృసింహుడు, పురాణ దేవతల చరిత్రలు అర్థమయ్యేలా శిల్పాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించాలన్నారు. మూల విరాట్టుకు అభిషేకం జరిగే సమయంలో భక్తులకు స్పష్టంగా కనిపించేలా ప్రధాన ద్వారం వద్ద అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. గర్భగుడి ముందు ధ్వజ స్తంభాన్ని, తంజావూర్‌ పెయింటింగ్‌లను.. బంగారు తాపడం చేసిన దేవతామూర్తులను పరిశీలించారు. ఉప ఆలయాలతోపాటు ఆండాళ్‌ అమ్మవారి గుడిని, పరకామణిని పరిశీలించారు. తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా యాదాద్రికి వస్తారని, వారికి అన్ని వసతులు అందేలా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని కేసీఆర్‌ చెప్పారు. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో దేశంలోని ఇతర ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలని, అవసరమైన ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు.

చైనాలో పరిశీలించి రండి..
అద్దాల మండపం అద్భుతంగా ప్రత్యేకత చాటుకునేలా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు. అవసరమైతే చైనాలో ఏడు కిలోమీటర్ల దూరం లైట్లతో నిర్మించిన మాల్‌ను సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించి రావాలని చెప్పారు. హుండీలను, ప్రసాద కౌంటర్లను భక్తులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక యాదాద్రి గెస్ట్‌హౌజ్‌లో లిఫ్టులు పూర్తి కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒడిశా పూరీ జగన్నాథ్‌ ఆలయం మాదిరిగా.. రిటైర్డ్‌ పూజారులు, వేద బ్రాహ్మణ పెద్దలు తమ భుక్తిని వెళ్లదీసుకునేలా భక్తుల నుంచి కానుకలు స్వీకరించేలా మండపం నిర్మించాలన్నారు. ఇందుకోసం పూరీ ఆలయాన్ని సందర్శించాలని సూచించారు.

శ్రావ్యమైన సౌండ్‌సిస్టం ఉండాలి 
గుట్టపై శివాలయాన్ని సందర్శించిన సీఎం.. రుత్విక్కుల కోసం నిర్మించిన మండపం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూ కాంప్లెక్స్‌లో భక్తుల ఆహ్లాదంకోసం భక్తి గీతాలు, శ్లోకాలు శ్రావ్యంగా వినిపించేలా సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కరిణి వద్ద అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో పూజారులు, ఆలయ సిబ్బంది నివసించేందుకు అనువైన ఇళ్లు నిర్మించాలని ఆదేశించారు. శిల్పులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. తర్వాత ఏసీ ప్లాంట్, గ్యాస్‌ గోదాం, కొండ దిగువన పచ్చదనం పెంచేందుకు చేపట్టిన పనులను పరిశీలించారు.

గుట్ట కింద నిర్మాణాల జాప్యాన్ని నివారించాలి
యాదాద్రి చుట్టూ, టెంపుల్‌ సిటీలో చేపట్టిన రోడ్లు, బస్టాండ్‌లు, ప్రెసిడెన్సియల్‌ కాటేజీలు, కల్యాణకట్ట, లక్ష్మి (గండిచెరువు) పుష్కరిణి పనులను కేసీఆర్‌ పరిశీలించారు. ఇక్కడి పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్న ప్రసాద వితరణ సత్రం పనులపై పలు సూచనలు చేశారు. రింగ్‌రోడ్డు లోపలి ప్రాంతాలను పచ్చదనంతో నింపాలన్నారు.

అన్ని రకాల సాయం చేస్తం
రింగ్‌రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న వ్యాపారులు, ప్రజలతో గుట్ట కింద సీఎం ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. కోల్పోయిన దానికన్న గొప్పగా వారికి అన్ని వసతులతో షోరూంల తరహాలో విశాలమైన దుకాణాలు కట్టిస్తామని, ఉచితంగా ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో గుట్ట మీద వ్యాపారం చేసుకున్న వారికి టెంపుల్‌ టౌన్‌లో పాత పద్ధతిలో దుకాణాలు ఇస్తామని చెప్పారు. స్థానికులకు ఉద్యోగాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. పర్యటనలో సీఎం వెంట ఎంపీ సంతోష్, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునిత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, అధికారులు ఉన్నారు. కాగా.. హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి వస్తుండగా సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ నుంచే నృసింహ (బస్వాపురం) రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. బస్వాపురం శివారులో ఉన్న మెత్తగుట్ట, తేలవాలుగు గుట్ట, ఉంగరాల గుట్ట మీదుగా హెలికాప్టర్‌ ప్రయాణించింది. తక్కువ ఎత్తులో వెళుతుండటంతో సీఎం బస్వాపురం కట్టపై దిగుతారేమోనని సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు ఆసక్తిగా చూశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top