CM KCR: రైతులే పాలకులు కావాలి

CM KCR Comments On BJP Govt at Nanded Public Meeting - Sakshi

అందుకే భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది

అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌ నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది

నాందేడ్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

తన కుటుంబాన్ని వదిలి రైతన్న ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు?

దేశంలో ఈ అగత్యం ఎందుకు ఏర్పడింది? దీని వెనకున్న మతలబేంటి?

ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది

దేశం స్పష్టమైన మార్పును కోరుకుంటోంది

తన మాటలపై మహారాష్ట్ర ప్రజలు చర్చించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

తాను చెప్పింది నిజమైతేనే బీఆర్‌ఎస్‌ను ఆదరించాలని విజ్ఞప్తి

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని ప్రకటన

నిర్మల్‌/భైంసా: ‘ఒక రైతు.. తన కుటుంబాన్ని, భార్యాపిల్లలను వదిలి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు? ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టి, జీవితాన్ని ప్రసాదించే రైతన్న ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం ఈ దేశంలో ఎందుకు ఏర్పడింది? దీని వెనకున్న మతలబేంటి? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? దేశం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఓవైపు మన రైతులు చనిపోతుంటే, రంగు రంగుల జెండాలు, గంటలకు గంటలు ఎక్కడపడితే అక్కడ, అసెంబ్లీల్లో, పార్లమెంటులో ప్రసంగాలతో ఊదరగొడుతున్నారు. ఫలితం మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారు.

అందుకే భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఏ పార్టీ ఇవ్వని విధంగా ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌‘ అనే నినాదంతో రైతులనే పాలకులను చేసేందుకు ప్రజల ముందుకు వచ్చింది..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మహారాష్ట్ర నాందేడ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని గురుద్వారా సచ్‌ఖండ్‌ బోర్డు మైదానంలో ఆదివారం భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇది రాష్ట్రం బయట బీఆర్‌ఎస్‌ తొలి సభ కావడం గమనార్హం. కాగా సభలో సీఎం కేసీఆర్‌ రైతన్నల గోస వినిపిస్తూ, మరాఠా ప్రజల మనసులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్, బీఆర్‌ అంబేడ్కర్, అన్నాబావ్‌ సాఠే, మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీ బాయిఫూలే వంటి మహామహులకు జన్మనిచ్చిన పవిత్ర భూమికి ప్రణమిల్లుతున్నాను..’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

దేశ భావజాలాన్ని మార్చేందుకే..
‘బీఆర్‌ఎస్‌ కొంతకాలం క్రితమే ఆవిర్భవించింది. ఇంతకుముందు టీఆర్‌ఎస్‌ పేరుతో తెలంగాణకు మాత్రమే పరిమితమై ఉండేది. దేశ పరిస్థితులను అర్థం చేసుకున్నాక, దేశ భావజాలాన్ని మార్చాల్సిన అవసరాన్ని గుర్తించిన తర్వాత జాతీయ స్థాయిలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బయట తొలిసారిగా మహారాష్ట్ర గడ్డపై బీఆర్‌ఎస్‌ మీ ముందుకు వచ్చింది. మహారాష్ట్ర ప్రజలు, మీడియా సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. నా మాటలను ఇక్కడే మర్చిపోవద్దు. మీ ఇండ్లకు, గ్రామాలకు, పట్టణాలకు వెళ్లిన తర్వాత తప్పకుండా చర్చించాలి..’ అని కేసీఆర్‌ కోరారు.

నాందేడ్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగసభకు హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌  

ఒక్కసారి మనం అంతా ఏకం కావాలి..
‘దేశ గమనంలో, భావజాలంలో, దేశాన్ని నడపడంలో గొప్ప మార్పు అనివార్యం. అలాంటి మార్పునకు సమయం ఆసన్నమైంది. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఎందరో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు మారారు. మనమే వాళ్లందరినీ పదవుల్లో కూర్చోబెట్టాం. నేను చెప్పేది రాకెట్‌ సైన్స్‌ కాదు. చాలా సింపుల్‌గా అర్థం అవుతుంది. 75 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ తాగడానికి, సాగుకు నీళ్ళుండవు. కరెంటు కూడా లభించదు. ఎందుకు? దేశంలో వనరుల లభ్యత లేదా? ప్రజలకు సౌకర్యాలను సమకూర్చలేమా? మరేంటి మతలబు? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమయ్యాక కూడా అర్థం కానట్టు ఉండకూడదు. ఒక్కసారి మనం అంతా ఏకం కావాలి..’ అని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, బీజేపీల వల్లే ఈ దుస్థితి
‘మన దేశం అమెరికా కంటే ధనిక దేశం. మన నాయకులు సమర్థవంతంగా పనిచేస్తే అంతకంటే గొప్పగా ఎదుగుతుంది. నీరు, భూమి, బొగ్గు, కష్టించి పనిచేసే 140 కోట్ల ప్రజలు దేశానికి ప్రకృతి, దేవుడు ఇచ్చిన వరాలు. భారతదేశంలో మాత్రమే 50 శాతం వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలుంటే, ఇందులో 41 కోట్ల ఎకరాలు వ్యవసాయ యోగ్యంగా ఉంది. దేశంలో 1.40 లక్షల టీఎంసీల వర్షం కురుస్తుంది. కానీ కేవలం 20–21 వేల టీఎంసీల నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. కాంగ్రెస్, బీజేపీ పార్టీలే దేశ దుస్థితికి కారణం. మహారాష్ట్ర పరిస్థితి మరీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచే గోదావరి, కృష్ణా ప్రవహిస్తున్నా.. ప్రవర, పూర్ణ, పెన్‌గంగ, వార్గా, ఘటప్రభ, మంజీర, భీమా, ప్రాణహిత, ఇంద్రావతి వంటి ఎన్నో నదులున్నా నీటికి కటకట ఎందుకు? ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి బీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలి..’ అని విజ్ఞప్తి చేశారు.

జోకిన్‌ ఇండియాగా మేకిన్‌ ఇండియా
‘ప్రధానమంత్రి మోదీ తెచ్చిన మేకిన్‌ ఇండియా.. జోకిన్‌ ఇండియాగా మారింది. దేశంలోని ప్రతి చిన్నచిన్న పట్టణాల్లోనూ చైనా బజార్లు ఉన్నాయి. పతంగుల మాంజా, దీపావళి పటాకులు, హోళీ రంగులు, దీపావళి దీపాలు, మనం పూజించే వినాయకుని ప్రతిమలు, చివరకు మన జాతీయ జెండా కూడా చైనా నుంచే వస్తాయి. మేకిన్‌ ఇండియా అమలైతే చైనా బజార్లున్న చోట భారత్‌ బజార్లు పెట్టేవారు కదా?..’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 

 బాత్, ఓ బాత్‌..ఇంకా ఎన్నాళ్లు?
‘నేను మీ అన్నను, మీ కొడుకును. బాధాతప్త హృదయంతో మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా. ఈ విషయాలపై బాగా ఆలోచించాలి. దేశ ప్రజలకు తాగు, సాగు నీరు, విద్యుత్‌ సమస్యలున్నా.. మన్‌ కీ బాత్, ఏ బాత్, ఓ బాత్‌ అంటూ ఇంకా ఎన్నాళ్లు ప్రజల్ని మభ్య పెడతారు. మన దేశం కంటే చాలా చిన్న దేశమైన జింబాంబ్వేలో ప్రపంచంలోనే అతి పెద్దదైన రిజర్వాయర్‌ ఉంది. దీని సామర్థ్యం 6,533 టీఎంసీలు. కానీ సువిశాల భౌగోళిక స్వరూపం, పెద్దసంఖ్యలో జనాభా ఉన్న మన దేశంలో కనీసం మూడు, నాలుగు రిజర్వాయర్లు ఇలాంటివి ఉండకూడదా? ప్రభుత్వం తలచుకుంటే దేశంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని సమకూర్చవచ్చు. కిసాన్‌ సర్కార్‌ వస్తేనే దేశం పురోగమిస్తుంది..’ అని స్పష్టం చేశారు. 

గులాబీ జెండా పట్టుకోండి..
‘తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రోటీ–బేటీ సంబంధం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగుతుంటాయి. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న సంక్షేమాన్ని మీరు అనుభవించాలనుకుంటే గులాబీ జెండా పట్టుకొని మీరే నాయకులుగా ముందుకు రండి..’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. జనం నుండే నాయకులు ఉద్భవిస్తారంటూ బాల్క సుమన్‌ను ఉదాహరణగా చెప్పారు. 

దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు
బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే రైతుబంధు, దళితబంధుతోపాటు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో బీఆర్‌ఎస్‌ అన్ని కమిటీలు వేస్తామని, కేవలం 8 నుంచి 10 రోజుల్లో ప్రతి గ్రామానికి పార్టీ వాహనం చేరుకుంటుందని తెలిపారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజవర్గాలలో పోటీ చేస్తామని ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జన్మస్థలమైన శివనేరి వేదికగా ప్రతిన బూని, మహారాష్ట్ర వ్యాప్తంగా రైతు కమిటీలు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు.

‘‘ధర్మస్య విజయోస్తు
అధర్మస్య నాశోస్తు
ప్రాణిషు సద్భావనాస్తు
విశ్వస్య కళ్యాణమస్తు..
జై మహారాష్ట్ర
జై భారత్‌      
జై హింద్‌..’’
అంటూ కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

రైతులు, కార్మికులు కలిస్తే చాలు..
‘దేశంలో ఎక్కడా లేనివిధంగా మహారాష్ట్రలోనే రైతు ఆత్మహత్యలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? రైతులు ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడతారో ఆలోచించాలి. దేశంలో రైతుల సంఖ్య జనాభాలో 42 శాతం కంటే అధికంగా ఉంది. వ్యవసాయ కార్మికులను కూడా కలిపితే ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇంతకన్నా బలం అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్లాక కేసీఆర్‌ చెప్పిన మాటలు నిజమా? అబద్ధమా? అని ఆలోచించండి. ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించినట్టుగా ఈ విషయాన్ని వ్యాప్తి చేయాలి. ఇక రైతులు కేవలం నాగలిని పట్టడమే కాదు.. కలాన్ని పట్టి చట్టం చేసే అవకాశాలను కూడా పొందాలి. రైతులను కేవలం మాటలు, నినాదాలకే పరమితం చేయకుండా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసేందుకే బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది..’ అని సీఎం తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top