ఆధిపత్య పోరు: సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ ఢీ అంటే ఢీ

Clashes Between Sarpanch And Deputy Sarpanch In Warangal - Sakshi

ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు

జిల్లా మొత్తంలో 100కు పైగానే.. 

రచ్చకు ఎక్కుతున్న వివాదాలు

అభివృద్ధికి అటంకంగా ఆదిపత్య పోరు

సాక్షి, వరంగల్‌ రూరల్‌: నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామ సర్పంచ్‌ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉప సర్పంచ్‌ బండారి సమ్మయ్య కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సంపేట మండలం ఆకులతండా సర్పంచ్‌ బానోత్‌ రాము తీర్మానాలు లేకుండా పనులు చేస్తున్నాడని ఉప సర్పంచ్‌ లక్ష్మి, వార్డు సభ్యులు రమ, శ్రీకాంత్, సమ్మాలు, అరుణ కలెక్టర్, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే సమన్వయంతో ముందుకు సాగాల్సిన ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పంచాయతీల పరువు రచ్చకెక్కుతోంది. ఏదో ఒక సాకుతో విమర్శలు చేసుకుంటూ వాగ్వాదాలకు దిగుతున్నారు. కొన్ని చోట్ల దాడులు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. అయితే క్షేత్రస్థాయిలో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య జాయింట్‌ చెక్‌పవర్‌ విభేదాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.

కొత్త చట్టంతో నేరుగా నిధులు.. 
గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త పంచాయతీరాజ్‌ చట్టం–2018 అమలులోకి రావడంతో పంచాయతీలకు నేరుగా నిధుల మంజూరు, ప్రతి జీపీకి కార్యదర్శి నియామకం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌పవర్‌ ఉండడంతో ఇద్దరి సమ్మతి లేనిదే నిధులు డ్రా చేసేందుకు వీలు లేకుండా పోయింది. పలు గ్రామాల్లో సర్పంచ్‌లు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుండగా.. కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్‌లకు చెప్పకుండానే అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. దీంతో ఉప సర్పంచ్‌లు చెక్కులపై సంతకాలు పెట్టకుండా మొండికేస్తున్నారని సమాచారం.

ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆదిపత్యం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకుంటుండగా.. మెజార్టీ గ్రామాల్లో నిధుల వినియోగంపై సమన్వయం లేక ఆ “పంచాయితీ’లను అధికారుల వద్దకు తెస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఒకరిమీద ఒకరు చేసుకున్న ఫిర్యాదులు 100కు పైగా వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇందులో 50 వరకు పరిష్కరించినట్లు సమాచారం. 

ముందుకు సాగని పనులు
మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య ఆదిపత్య పోరు.. సమన్వయ లోపం.. విభేదాల కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు అధికారుల ఒత్తిళ్లు పెరిగిపోవడంతో సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలుపొందిన సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేయకపోవడంతో ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

సమన్వయంతో ముందుకు సాగాలి..
సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సమన్వయంతో ముందుకు సాగి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి. ఈ మేరకు వారందరికీ అవగాహన కల్పిస్తున్నాం. చెక్కులపై సంతకాలు పెట్టడం లేదని, సర్పంచ్‌లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ పలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు వారిని పలిపించి మాట్లాడడంతో పాటు ఫిర్యాదులపై విచారణ చేపడుతున్నాం.  – చంద్రమౌళి, డీపీఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top