కేంద్రం కబురు.. అదనంగా కొంటాం

Central Sends Letter To Telangana Over Paddy Procurement - Sakshi

అదనపు బియ్యం సేకరణపై దిగొచ్చిన వైనం

ఈ వానాకాలం 46 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌.. కేంద్ర ప్రభుత్వం లేఖ

బియ్యం ఎక్కువ తీసుకోవాలని ఢిల్లీ వెళ్లి ఒత్తిడి చేసిన మంత్రులు, ఎంపీలు 

రాష్ట్రం నుంచి మరో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకుంటామన్న కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో అదనపు బియ్యం సేకరణపై కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. కొన్ని నెలలుగా రాష్ట్ర సర్కారు తెచ్చిన ఒత్తిడితో ఈ సీజన్‌లో అదనంగా మరో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రానికి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ అండర్‌ సెక్రటరీ జై ప్రకాశ్‌ సమాచారం పంపారు.

‘సెప్టెంబర్‌ 20న తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖకు అనుగుణంగా ప్రస్తుత ఖరీఫ్‌లో నిర్ణీత లక్ష్యానికి అదనంగా మరో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకునేందుకు కేంద్రం అనుమతిస్తోంది. ఈ మేరకు తెలంగాణ నుంచి సెంట్రల్‌ పూల్‌ కింద తీసుకోవాల్సిన ముడి బియ్యం సవరించిన లక్ష్యం 46 లక్షల మెట్రిక్‌ టన్నులుగా పరిగణిస్తున్నాం’అని లేఖలో పేర్కొన్నారు. 

మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో వారం ఉండి..
నిజానికి రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌లో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం (40 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం) తీసుకునేందుకే కేంద్రం ఇదివరకు అంగీకరించింది. అయితే లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ పూర్తవడం, అదనంగా మరో 15 నుంచి 20 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర సేకరించాల్సి ఉండటంతో దానికి అనుమతించాలని నెల రోజులుగా కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తెస్తోంది. రాష్ట్ర మంత్రులతో పాటు పార్టీ ఎంపీలు ఈ విషయమై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలవడంతో పాటు వారం పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ఆ సమయంలోనే అదనంగా వచ్చే ధాన్యాన్ని సేకరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

అయితే అది ఎంత మేరో స్పష్టతనివ్వలేదు. లిఖిత పూర్వక హామీ ఇస్తే తప్ప కేంద్రాన్ని నమ్మలేమని రాష్ట్ర నేతలు బలంగా చెప్పడంతో మంగళవారం కేంద్రం అదనంగా 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం (సుమారు 9 లక్షల టన్నుల ధాన్యం) తీసుకునేందుకు సమ్మతిస్తూ లేఖ పంపింది. కాగా, ప్రస్తుత సీజన్‌లో ఈ నెల 27 నాటికి రాష్ట్రం నుంచి 52.88 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తి చేసినట్లు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తంగా 7.84 లక్షల మంది రైతుల నుంచి రూ.10,364.88 కోట్ల విలువైన ధాన్యం కొన్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

అయినా మిగులుతాయ్‌
వానాకాలం సీజన్‌లో బియ్యం సేకరణపై టీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన పోరుకు కేంద్రం నుంచి అంతంతే స్పందన వచ్చింది. అదనంగా ఇంకో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యమే.. అంటే 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యమే సేకరిస్తామని కేంద్రం ప్రకటించింది. 100 కిలోల ధాన్యాన్ని సేకరించి మిల్లింగ్‌ చేస్తే 67 కిలోల బియ్యం వస్తుంటుంది. ఈ లెక్కన కేంద్రం వానాకాలంలో సేకరిస్తామన్న 46 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం కోసం 68.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈసారి దాదాపు 90 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని రాష్ట్ర సర్కారు అంచనా వేస్తోంది.

61.51 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్రం సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6,668 కొనుగోలు కేంద్రాల్లో 3,767 కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయి మూతబడగా ఇంకో 2,901 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. రోజూ 75 వేల నుంచి లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు సేకరిస్తున్నారు. ఈ లెక్కన సంక్రాంతికి మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాల్సి వస్తుందని అంచనా. దీన్ని బట్టి కేంద్రానికి ఇచ్చే ధాన్యం పోనూ మిగిలే 10 నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నులను ఏం చేయాలో కేంద్రం నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం. అదనపు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమో లేక మిల్లర్లో విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
 

   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top