వరి సాగు ఖర్చు రూ. 1,360...  మద్దతు ధర రూ. 2,060 

Central Agriculture Department Latest Report Of Support Prices For Farmers - Sakshi

ఖర్చుకు తగినట్లు మద్దతు ధరలు.. కేంద్ర వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడి 

పత్తి ఖర్చు రూ. 4,050... మద్దతు ధర రూ. 6,080 

రైతులకు 50% ఆదాయం వస్తుందన్న కేంద్రం.. 23 రకాల పంటలపై విశ్లేషణ 

ఆ ధరలు సరిపోవంటున్న రాష్ట్ర ప్రభుత్వం... మద్దతు ధర పెంచాలని స్పష్టీకరణ 

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు వరికి మద్దతు ధర రూ. 2,499 ఇవ్వాలని డిమాండ్‌ 

పత్తికి రూ. 8,574, మొక్కజొన్నకి రూ.3,199 ఇవ్వాలంటున్న తెలంగాణ సర్కారు 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో సాగు ఖర్చుకు మించి మద్దతు ధరలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 23 రకాల పంటల సాగుకు అయ్యే ఖర్చు ఎంత? వాటికి అందుతున్న మద్దతు ధర ఎంత అనే దానిపై తాజాగా ఒక అధ్యయన నివేదిక విడుదల చేసింది. వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ (సీఏసీపీ) మేరకు సాగు ఖర్చులను దేశ వ్యాప్తంగా లెక్కలోకి తీసుకొని వీటి సరాసరిని నివేదికలో పొందుపరిచింది. 2022–23లో వరి ఉత్పత్తి ఖర్చు క్వింటాల్‌కు రూ. 1,360 ఉండగా, కనీస మద్దతు ధర రూ. 2,060గా కేంద్రం నిర్ధారించిన సంగతి తెలిసిందే.

పత్తి ఉత్పత్తి ఖర్చు రూ. 4,053 ఉండగా, దాని మద్దతు ధర రూ. 6,080గా ఉంది. అలాగే మొక్కజొన్న సాగు, ఉత్పత్తి ఖర్చు రూ. 1,308 ఉండగా, దాని మద్దతు ధర రూ. 1,962గా ఉంది. కంది ఉత్పత్తి ఖర్చు రూ. 4,131 కాగా, మద్దతు ధర రూ. 6,600 ఉంది. ఇక సోయాబీన్‌ ఉత్పత్తి ఖర్చు ధర రూ. 2,805 కాగా, మద్దతు ధర రూ. 4,300 ఉంది. వేరుశనగ సాగు ఖర్చు రూ. 3,873 కాగా, 5,850గా ఉంది. ఉత్పత్తి వ్యయంపై కనీసం 50% లాభం కలిగించేలా కనీస మద్దతు ధరలు నిర్ధారించినట్లు కేంద్రం తన నివేదికలో స్పష్టం చేసింది. ఇలా మూడేళ్ల సాగు ఖర్చు, వాటికిచ్చిన మద్దతు ధరల వివరాలను పొందుపరిచింది.  

కేంద్రం వర్సెస్‌ రాష్ట్రం... 
అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాగు ఖర్చు వివరాలు, మద్దతు ధరలు శాస్త్రీయంగా లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌కు పలుమార్లు రాష్ట్రంలోని పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. స్వామినాథన్‌ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధరలు ఉండాలని కేంద్రాన్ని కోరింది. సాగు ఖర్చుకు మరో 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్‌పీ ఇవ్వాలని సీఏసీపీకి ప్రతిపాదించింది.

అందులో వివిధ పంటలకు ఎంతెంత ఖర్చు అవుతుందో వివరించింది. పంటల వారీగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంటకోత, రవాణా, కూలీ, రైతు కుటుంబ శ్రమకు ప్రతిఫలం అన్నీ కలిపి ఎంత ఖర్చు అవుతుందో సవివరంగా కేంద్రానికి నివేదించింది. ఒక వ్యాపారి తన వస్తువును అమ్ముకునేప్పుడు ధర ఎలా నిర్ణయిస్తారో, ఆ ప్రకారమే పెట్టిన పెట్టుబడి, దానికి అయ్యే వడ్డీలను లెక్కలోకి తీసుకొని సాగు ఖర్చును నిర్ధారించారు. ప్రతీ ఏడాది ఇలాగే శాస్త్రీయంగా సాగు ఖర్చు, ఎంఎస్‌పీ ఎలా ఉండాలో తెలంగాణ వ్యవసాయశాఖ ఇస్తూనే ఉంది. కానీ కేంద్రం తన పద్ధతిలో తాను ఎంఎస్‌పీని నిర్ధారిస్తూ పోతోందని వ్యవసాయ అధికారులు అంటున్నారు.  

వరి సాగు ఖర్చు ఎకరానికి రూ. 40 వేలు... 
సాధారణ వరి రకం పండించేందుకు నారుమడి సిద్ధం చేయడం మొదలు విత్తనాలు, నాట్లు, ఎరువులు, కలుపుతీత, చివరకు పంట కోత, కూలీల ఖర్చు, కుటుంబ సభ్యుల శ్రమ మొత్తం కలుపుకుంటే ఎకరానికి రూ. 40 వేలు ఖర్చు (24 క్వింటాళ్లు) అవుతున్నట్లు లెక్కగట్టింది. ఆ ప్రకారమే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఖరారు చేసింది. ఎకరా ఖర్చు ప్రకారం క్వింటా వరి పండించాలంటే రూ. 1,666 ఖర్చు అవుతుందని నిర్ధారణ చేసింది.

స్వామినాథన్‌ కమిటీ సిఫా ర్సుల ప్రకారం సాగు ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి ఎంఎస్‌పీ రూ. 2,499 ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వరి ఎంఎస్‌పీ రూ. 2,060గా ఉండగా, అధికంగా పెంచాలని కోరుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తికి కూడా ఎకరాకు రూ.40 వేలు ఖర్చుకానుంది. ఎకరాకు పత్తి ఏడు క్వింటాళ్లు పండుతాయి. కాబట్టి క్వింటాకు రూ. 5,714 ఖర్చు కానుంది.

ఆ లెక్కన స్వామినాధన్‌ సిఫార్సుల ప్రకారం రూ. 8,574 పెంచాలని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం పత్తి మద్దతు ధర రూ. 6,080 మాత్రమే ఉండగా, మరో రూ. 2,491 వరకు పెంచాల్సి ఉంటుంది. జిల్లా.. జిల్లాకు సాగు ఖర్చులో తేడా ఉంటున్నందున దేశీయంగా ఒకే విధమైన ఉత్పత్తి ఖర్చును అంచనా వేయలేమని, కాబట్టి సరాసరిని లెక్కలోకి తీసుకోవడం తగదని పలువురు అంటున్నారు.

మొక్కజొన్నకు ఎకరాకు రూ. 32 వేల వరకు ఖర్చుకానుంది. ఎకరాకు 15 క్వింటాళ్లు పండిస్తారు. క్వింటాకు రూ. 2,133 ఖర్చు కానుంది. ఆ ప్రకారం మద్దతు ధర రూ. 3,199 ఇవ్వాలని అంటున్నారు. కందికి రూ. 21 వేల వరకు ఖర్చుకానుంది. ఎకరాకు 4 క్వింటాళ్లు పండుతుంది. క్వింటాలుకు రూ. 5,250 ఖర్చు వస్తుంది. ఆ ప్రకారం మద్దతు ధర రూ. 7,875 పెంచాల్సి ఉంటుందని అధికారులు అంటున్నా రు. ప్రస్తుతం దీనికి రూ. 6,600 మద్దతు ధర ఉంది. సోయాబీన్‌కు రూ. 32 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఎకరాకు 5 క్వింటాళ్లు పండుతుంది. దీనికి క్వింటాలుకు రూ. 6,400 ఖర్చు కానుంది. ఆ ప్రకారం మద్దతు ధర రూ. 9,600 చేయాల్సి ఉంటుందని అంటున్నారు.  

సాగు ఖర్చు నిర్ధారణలో శాస్త్రీయత లేదు
సాగు ఖర్చును అంచనా వేయడంలో కేంద్రానికి శాస్త్రీయమైన పద్ధతి లేదు. దేశంలో జిల్లాకో రకంగా సాగు ఖర్చు ఉంటుంది. దీంతో ఒకచోట ఎక్కువ ఒకచోట తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వేసిన సాగు ఖర్చు, దాని ప్రకారం మద్దతు ధర నిర్ధారణ సరిగా లేదు. దీంతో రాష్ట్రంలో ఉన్న రైతులు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీఏసీపీకి పంపే నివేదికలకు  విలువ ఉండటం లేదు.       
– డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top