శ్రీనివాసరావుతో సంబంధమేంటి? | Sakshi
Sakshi News home page

శ్రీనివాసరావుతో సంబంధమేంటి?

Published Fri, Dec 2 2022 1:53 AM

CBI Questions Minister Gangula Kamalakar MP Ravichandra - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కేసులో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. శ్రీనివాసరావుతో సంబంధాలేమైనా ఉన్నాయా? ఆర్థిక లావాదేవీలు జరిగాయా? అంటూ ప్రశ్నించారు. తమ ప్రాథమిక విచారణలో తేలిన అంశాలు, ఇద్దరు నేతలు తెలిపిన విషయాలను బేరీజు వేసుకున్నారు. బుధవారం సీబీఐ నోటీసులు అందుకున్న గంగుల, వద్దిరాజు గురువారం ఢిల్లీలో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7.40 గంటల వరకు సుమారు 8.40 గంటల పాటు జరిగింది. 

వేర్వేరుగా విచారణ 
అధికారులు గంగుల, వద్దిరాజు ఇద్దర్నీ వేర్వేరుగా ప్రశ్నించారు. శ్రీనివాసరావును కూడా వారికి ఎదురుగా కూర్చోబెట్టి వారు చెప్పిన సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. ‘శ్రీనివాసరావుతో ఎప్పటినుంచి పరిచయం ఉంది? ఎక్కడెక్కడ కలిశారు? ఏమైనా ఆఫర్లు ఇచ్చాడా? లావాదేవీలు ఏమైనా జరిగాయా? ఎవరినైనా పరిచయం చేశాడా? డబ్బు చెల్లింపులు జరిగాయా.?’లాంటి పలు ప్రశ్నలకు సమాధానాలను రాబట్టేందుకు ప్రయత్నించారని తెలిసింది. కొన్ని విషయాల్లో తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారని సమాచారం. 

పూర్తిగా సహకరించాం: మంత్రి గంగుల 
విచారణ ముగిసిన తర్వాత గంగుల, వద్దిరాజు మీడియాతో మాట్లాడారు. గంగుల మాట్లాడుతూ.. ‘ఈ వ్యవహారంలో ఎలాంటి ఆలస్యం చేయరాదన్న ఉద్దేశంతో సీబీఐ అధికారులు పిలవగానే మేం ఢిల్లీలో విచారణకు హాజరయ్యాం. ఎందుకంటే మేం చట్టాలను గౌరవిస్తాం. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి వారు చెప్పిన సమయాని కంటే ముందే వారి కార్యాలయానికి వచ్చాం.

ఒక ఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో మా విచారణ జరిగింది. వారికి పూర్తిగా సహకరించాం. వారిని గుర్తుపట్టావా? అని శ్రీనివాసరావును ప్రశ్నించారు. అతన్ని వారం క్రితం ఒక మున్నూరు కాపు సమావేశంలో కలిశామని మేం చెప్పాం. రెండుసార్లు మాత్రమే కలిశాం. మున్నూరు కాపు బిడ్డ, ఐపీఎస్‌ అధికారి అని చెప్పినందుకు గుర్తించామే కానీ, ఆయనతో లావాదేవీలు చేయాలన్న ఆలోచనలు మాకు ఎవరికీ రాలేదు. ఈ విషయాలనే సీబీఐ అధికారులకు వివరించాం. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను తెలియజేశాం.

మేం ఎక్కడా తప్పు చేయలేదు కాబట్టే వాస్తవాలు చెప్పాం. దీనిపై శ్రీనివాసరావును క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. మేం చెప్పిన ప్రతి విషయాన్నీ రికార్డు చేసుకున్నారు. మా సమాధానాలతో సీబీఐ అధికారులు పూర్తిగా సంతృప్తి చెందారు. మా సంతకాలు తీసుకొని పంపించారు. మళ్లీ విచారణకు రమ్మని చెప్పలేదు. ఇదే ఫైనల్‌ విచారణ అన్నారు..’అని తెలిపారు. బయట జరుగుతున్న వదంతులు ఏవీ వాస్తవాలు కాదని మంత్రి గంగుల కొట్టిపారేశారు.

మేం బంగారం కొనిచ్చామన్నది దుష్ప్రచారమే: ఎంపీ వద్దిరాజు 
‘కాపు వ్యక్తిగా శ్రీనివాసరావు మాకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర ఉన్న ఫోన్లు, బంగారం ఆయన కొనుక్కున్నవే. మేము కొనిచ్చామన్నది0 దుష్ప్రచారమే. అది పూర్తిగా అవాస్తవం. అన్ని అంశాలు వివరించాం. అధికారులకు సహకరించాం. శ్రీనివాసరావును మా ఎదురుగా కూర్చోపెట్టి విచారించారు.. ’అని వద్దిరాజు చెప్పారు.

Advertisement
Advertisement