వివేకా లేఖకు నిన్‌హైడ్రేట్ పరీక్ష.. వేలిముద్రలు గుర్తించేందుకేనంటూ పిటిషన్‌

CBI petition for ninhydrin test in Viveka case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో.. సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు అవసరమైన నిన్‌హైడ్రేట్‌ (Ninhydrin Test) పరీక్ష నిర్వహించాలని నిర్ణయించుకుంది.  అయితే.. ఈ పరీక్ష ద్వారా లేఖ పాడైపోయే అవకాశం ఉన్నందున.. పరీక్షకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది దర్యాప్తు సంస్థ. 

వివేకా హత్య జరిగిన ఘటనాస్థలంలో దొరికిన లేఖను 2021 ఫిబ్రవరి 11వ తేదీన ఢిల్లీ సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపింది సీబీఐ. అయితే తీవ్ర ఒత్తిడిలోనే వివేకా ఆ లేఖ రాసినట్లుగా సీఎఫ్‌ఎస్‌ఎల్‌ తేల్చి చెప్పింది. ఇక ఇప్పుడు.. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను కోరింది సీబీఐ. అయితే.. లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్ పరీక్ష నిర్వహించాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ చెప్పింది. 

నిన్‌హైడ్రేట్ పరీక్ష చేస్తే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని సీఎఫ్‌ఎస్‌ఎల్‌, సీబీఐకి స్పష్టం చేసింది. దీంతో.. ఒరిజినల్ లేఖపై చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉన్నందున ఆ టెస్ట్‌ నిర్వహణ కోసం కోర్టును ఆశ్రయించించింది సీబీఐ. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని, అలాగే రికార్డుల్లో ఒరిజినల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని కోర్టును కోరింది సీబీఐ.

దీంతో సీబీఐ పిటిషన్‌పై నిందితుల స్పందన కోరింది సీబీఐ న్యాయస్థానం. ఈ పిటిషన్‌పై జూన్‌ 2వ తేదీన విచారణ జరపనుంది నాంపల్లి సీబీఐ కోర్టు. 

ఇదీ చదవండి: వివేకా పీఏ కృష్ణా­రెడ్డి సంచలన స్టేట్‌మెంట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top