ఫోన్‌ మాట్లాడుతూ.. రెండు డోసులు? 

Busy On Phone Call, Nurse Gives Two Doses Of Covid Vaccine In Abdullapurmet - Sakshi

కోవిడ్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌లో నర్సు నిర్వాకం

పెద్దఅంబర్‌పేటలో ఘటన

నిలకడగా బాధితురాలి ఆరోగ్యం

సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్‌: పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో ఓ యువతికి నర్సు ఫోన్‌లో మాట్లాడుతూ రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూర్‌లోని రాజీవ్‌ గృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న (21) ఈ నెల 17న పెద్దఅంబర్‌పేటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు టీకా తీసుకునేందుకు వెళ్లింది.

ఆమెకు వ్యాక్సిన్‌ వేస్తుండగానే నర్సుకు ఫోన్‌ రావడంతో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ లక్ష్మీప్రసన్నను అక్కడే కూర్చోమని చెప్పింది. ఫోన్‌ మాట్లాడిన అనంతరం తిరిగొచ్చిన నర్సు మరోసారి వ్యాక్సిన్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని లక్ష్మీప్రసన్న అక్కడున్న వారికి తెలుపడంతో కొద్దిసేపు గందరగోళం చోటుచేసుకుంది. అనంతరం ఆమెను వైద్య సిబ్బంది పరిశీలనలో ఉంచి వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వ్యాక్సిన్‌ వేస్తున్న సమయంలోనే నర్సుకు ఫోన్‌ వచ్చిందని, ఫోన్‌ మాట్లాడిన అనంతరం రెండో డోసు వేసిందని, ఆందోళన చేయడంతోనే తనను ఏరియా ఆస్పత్రికి తరలించారని బాధితురాలు ఆరోపించారు. కాగా, లక్ష్మీ ప్రసన్నకు రెండు డోసులు వేశామన్నది అవాస్తవమని, యువతి ఆందోళన చేయడం వల్లనే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి పరిశీలన కోసం పంపించామని వైద్యాధికారులు అంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top