తెలంగాణ: గుడ్‌న్యూస్‌.. ఏ టైంకి బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు ఈ యాప్‌ డౌన్‌ లోన్‌ చేస్కోండి

Bus Tracking System Started In RTC At Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొబైల్‌ ఫోన్‌లలో ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ట్రాకింగ్‌’ యాప్‌ ద్వారా బస్సుల కచ్చితమైన జాడను  తెలియజేసే  ట్రాకింగ్‌ సేవలను  మంగళవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌  ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి  శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్‌ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్‌ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, ఏలూరు, విశాఖపట్టణం, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే  దూరప్రాంత బస్సుల్లోనూ ట్రాకింగ్‌  వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా 96 డిపోల్లో  ప్రత్యేకంగా ఎంపిక చేసిన 4170 బస్సులను ట్రాకింగ్‌ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరిన ప్రయాణికుడు తాను ఎక్కవలసిన బస్సు ఎక్కడుందో  ఇట్టే తెలుసుకోవచ్చు. అలాగే ప్రయాణికుడు ఎదురు చూసే బస్టాపునకు ఆ బస్సు ఎంత సమయంలో చేరుకుంటుందనే సమాచారం కూడా మొబైల్‌ యాప్‌ ద్వారా తెలిసిపోతుంది. ప్రయాణికులు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ‘టీఎస్‌ఆర్టీసీ బస్‌ట్రాకింగ్‌’ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.  

  • తెలంగాణతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ టీఎస్‌ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌  తెలిపారు.  
  • ప్రయోగాత్మకంగా 140 బస్సులను గుర్తించారు,  వీటిలో కంటోన్మెంట్, మియాపూర్‌–2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్‌ బస్సులలో ట్రాకింగ్‌ సేవలను ప్రవేశపెట్టారు.  
  • అలాగే శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం, తదితర రూట్లలో నడిచే మరో 100 బస్సుల్లోనూ ట్రాక్‌ సేవలను ప్రవేశపెట్టారు. త్వరలో నగరంలోని అన్ని రిజర్వేషన్‌ సేవలు, ప్రత్యేక తరహా సేవలను కూడా ట్రాకింగ్‌ యాప్‌లో అందుబాటులోకి తేనున్నారు.   

అత్యవసర సేవలు సైతం... 

  • ఈ మొబైల్‌ యాప్‌లో బస్సుల  ప్రస్తుత లొకేషన్, సమీప బస్‌ స్టాప్‌ను వీక్షించడంతో పాటు మహిళా హెల్ప్‌లైన్‌ సేవలను కూడా అందజేయనున్నారు. 
  • అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికులు ఈ హెల్ప్‌లైన్‌ సహాయం కోరవచ్చునని ఎండీ  పేర్కొన్నారు. 
  • కండక్టర్, డ్రైవర్, తదితర సిబ్బంది ప్రవర్తనపైన కూడా ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.  

(చదవండి: కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top