అన్నీ ఇక్కట్లే.. పెంపు తప్పట్లే.. తెలంగాణలో భారీగా ఆర్టీసీ చార్జీల మోత

Bus Charges Hike In Telangana Soon - Sakshi

ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 25 పైసలు, మిగతా కేటగిరీల్లో 30 పైసల చొప్పున పెంపు 

ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు 

త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక.. 

కేసీఆర్‌ నిర్ణయాన్ని బట్టి అమల్లోకి.. 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు పెం చేందుకు రంగం సిద్ధమైంది. భారీగా పెరిగిన డీజిల్‌ ధరలు, కరోనా కష్టాలు, భారీ నష్టాల నేపథ్యంలో భారీ మొత్తంలో చార్జీలు పెంచాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 25 పైసల చొప్పున, మిగతా కేటగిరీ బస్సుల్లో 30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్వయంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ ఈ వివరాలను ప్రకటించడం గమనార్హం. 

అన్ని అంశాలపై కసరత్తు చేసి.. 
కొద్దిరోజుల కింద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ దుస్థితిపై చర్చించారు. చార్జీల పెంపు అనివార్య మన్న అభిప్రాయానికి వచ్చారు. సమావేశంలో సీఎం చేసిన సూచనల మేరకు మేరకు చార్జీలపై ఆర్టీసీ కసరత్తు మొదలుపెట్టింది. కేబినెట్‌ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సీఎం ప్రకటించారు. మూడు రోజుల కింద కేబినెట్‌ భేటీ జరిగినా.. ఈ అంశంలో స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కసరత్తు పూర్తిచేసిన ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనలను సమర్పించింది. సీఎం కేసీఆర్‌ వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రతిపాదనలకు ఆమోదం వస్తే.. కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. 

వరుసగా నష్టాలు, సమస్యలతో.. 
సీఎం కేసీఆర్‌ 2015లో ఆర్టీసీ కార్మికులకు భారీగా 44 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. దానితో సంస్థపై వార్షికంగా ఏకంగా రూ.850 కోట్ల భారం పడింది. దానితో ఆ తర్వాతి ఏడాది 2016 జూన్‌లో ఆర్టీసీ చార్జీలను స్వల్పంగా సవరించింది. పల్లెవెలుగులో 30 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి, ఆ తర్వాత స్టేజీకి రూ.2 చొప్పున చార్జీలు పెంచారు. సుమారు 5 శాతం ధరలు పెరిగాయి.

మిగతా కేటగిరీ బస్సుల్లో 10 శాతం పెంచారు. దానితో సుమారు ఏటా రూ.350 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరింది. తర్వాత 2019 అక్టోబర్‌లో 53 రోజుల సుదీర్ఘ సమ్మె, ఆర్టీసీకి తీవ్ర నష్టాల నేపథ్యంలో చార్జీలు సవరించారు. ఆ ఏడాది డిసెంబర్‌లో సగటున కిలోమీటర్‌కు 20పైసల చొప్పున పెంచారు. దానితో ఆర్టీసీకి సాలీనా రూ.550 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరింది. 

వ్యతిరేకత లేదంటూ.. 
ఇటీవల ఆర్టీసీ అధికారులు సంస్థ పనితీరు, ఇతర అంశాలపై ప్రజల నుంచి ఆన్‌లైన్‌లో అభిప్రా యాలు సేకరించారు. అందులో బస్సు చార్జీల పెంపు అంశాన్ని కూడా ప్రస్తావించారు. మెరుగైన వసతులు కల్పించాలని, మరిన్ని బస్సులు తిప్పాలని, సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెంచాలని కోరిన ప్రజలు.. చార్జీల పెంపు అంశంపై పెద్దగా అభ్యంతరాలు తెలపలేదని అధికారులు చెప్తున్నారు. సర్వేలో అభిప్రాయాలు వెల్లడించిన వారిలో.. కేవలం 4.3 శాతం మంది మాత్రమే చార్జీల పెంపును వ్యతిరేకించారని అంటున్నారు. 

భారం ఎక్కువే.. 
రెండేళ్ల కింద కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినప్పుడు ప్రజలపై రూ.550 కోట్ల భారం పడింది. ప్రస్తుత ప్రతిపాదనల మేరకు రూ.685 కోట్లు భారం పడుతుందని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ భారం రూ.850 కోట్లకుపైనే ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2019లో 100 శాతం ఆక్యుపెన్సీ లెక్కన అంచనా వేశారని.. అందువల్ల వాస్తవంగా పడిన భారం రూ.450 కోట్లలోపేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈసారి కేవలం 65 శాతం ఆక్యుపెన్సీ లెక్కనే అంచనా వేశారని వివరిస్తున్నాయి. ఇక గత రెండేళ్లలో 2 వేల వరకు బస్సులు తగ్గిపోవటంతో.. ఆ మేర అదనపు ఆదాయం తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.  

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్టీసీ చార్జీలు పెంచలేదు. ఆయన మరణం తర్వాత 2010 నుంచి 2014 వరకు వరుసగా నాలుగు సార్లు చార్జీలు పెంచారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏడేళ్లలో చార్జీలు పెంచుతుండటం మూడోసారి కానుంది.  

డీజిల్‌ భారం.. కోవిడ్‌ నష్టాలతో.. 
కరోనా లాక్‌డౌన్‌లు, ప్రయాణాలు తగ్గిపోవడంతో ఆర్టీసీకి భారీగా నష్టాలు వచ్చాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,600 కోట్ల వరకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1,440 కోట్ల మేర నష్టం వచ్చినట్టు ఆర్టీసీ చెప్తోంది. మరోవైపు డీజిల్‌ ధరలు పెరగటంతో.. సంస్థపై రోజుకు రూ.1.8 కోట్ల అదనపు భారం పడింది. ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకు చార్జీలు పెంచా లని ఆర్టీసీ కొద్దినెలలుగా ప్రభుత్వాన్ని కోరుతోంది. దీనిపై ప్రతిపాదనలు ఇవ్వాలని కొద్దిరోజుల సీఎం  సూచించడంతో.. కసరత్తు పూర్తిచేసి తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌కు అందజేసింది.  

ఆర్టీసీని గాడిన పెట్టేందుకే.. చార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
టికెట్‌ ఆదాయంపై ఆర్టీసీ మనుగడ ఉంది. కేంద్రం డీజిల్‌ ధరలు పెంచడంతో ఆర్టీసీపై తీవ్ర భారం పడింది. కరోనా కారణంగా నష్టాలు వస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందాలంటే ఆర్టీసీ మెరుగుపడాలి. సంస్థ మనుగడ కోసం చార్జీలు పెంచక తప్పని పరిస్థితి. ఇటీవల ఆర్టీసీ నిర్వహించిన సర్వేలో కూడా చార్జీల పెంపుపై ప్రయాణికులు పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించి ఆయన అనుమతితో తర్వాతి చర్యలు తీసుకుంటాం. – మంత్రి పువ్వాడ

భారీగానే మోత 
రవాణా మంత్రి చెప్పిన మేరకు చార్జీలు పెంచితే.. సగటున ఏటా రూ.685 కోట్ల ఆదాయం అదనంగా సమకూరనుంది. కానీ చార్జీల సవరణ, సమీప ధరలకు సర్దుబాటు వంటివాటితో రూ.850 కోట్లకుపైనే భారం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఏడేళ్లలో మూడోసారి 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆర్టీసీ చార్జీలు పెంచనుండటం ఇది మూడోసారి. మొదట 2016 జూన్‌లో స్వల్పంగా చార్జీలను సవరించారు. సగటున ఆర్డినరీ పల్లెవెలుగు బస్సుల్లో 5 శాతం, మిగతా కేటగిరీల్లో 10 శాతం చార్జీలు పెరిగాయి. తర్వాత 2019 డిసెంబర్‌లో అన్ని బస్సుల్లో సగటున కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచారు. ఈసారి పెంపు కాస్త ఎక్కువగా ఉండనుంది. 

సీఎం అనుమతి వచ్చాకే..! 
సాధారణంగా ఎప్పుడైనా సీఎం అనుమతి వచ్చాకే ఆర్టీసీ చార్జీల పెంపు వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. కానీ ఈసారి సీఎంకు ప్రతిపాదనలు పంపాల్సి ఉందని చెప్తూనే.. మంత్రి అధికారికంగా వివరాలు వెల్లడించారు. చార్జీల పెంపుపై ప్రజలు ఎలా స్పందిస్తారు, వివిధ వర్గాల అభిప్రాయం ఏమిటన్నది తెలుసుకునేందుకే ఇలా చేశారన్న భావన వ్యక్తమవుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top