Bullet Bike: దూసుకెళ్తున్న ‘బుల్లెట్‌’.. రూ. 1.5 లక్ష నుంచి రూ. 3.5 లక్షల వరకు.. నాడు మిలిట్రీ బైక్‌, కానీ.. నేడు

Bullet Bike Price Rs 1 5 Lakh To Rs 3 5 Lakh Top Trending Vehicles In India - Sakshi

వైరారూరల్‌ (ఖమ్మం): బుల్లెట్‌.. దానిపై వెళ్తుంటే ఉండే ఆ రాజసం.. దాని నుంచి వచ్చే ఫైరింగ్‌.. జనాలు చూసే తీరూ ప్రతీది ప్రత్యేకమే.. బుల్లెట్‌ అంటేనే ఒకప్పుడు ఉన్నత వర్గాల వాహనంగా చలామణి అయ్యింది. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు కూడా బుల్లెట్‌పై రయ్‌.. రయ్‌.. మంటూ దూసుకుపోతున్నారు. ఇది వరకు గ్రామాల్లో అయితే పలుకుబడి ఉన్నవారు, రాజకీయంగా మంచి పట్టున్నవారు వీటిని ఎక్కువగా వాడేవారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ మంచి క్రేజ్‌ ఉంది.

మార్కెట్‌లోకి ఇలా..
బుల్లెట్‌ ద్విచక్ర వాహనాన్ని 1955లో ఇండియాన్‌ ఆర్మీ బోర్డర్‌ సెక్యూరిటీ కోసం ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించారు. అనంతరం 1960 నుంచి స్పేర్‌ పార్ట్స్‌ను ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించి ఇండియాలోనే బుల్లెట్‌ ద్విచక్రవాహనాన్ని ఫిటింగ్‌ చేసే వారు. ఇవన్నీ గతంలో పెట్రోల్‌తో నడిచేవి. దాని తర్వాత కొన్నేళ్ల పాటు కొంత మంది మెకానిక్‌లు పెట్రోల్‌ ఇంజన్‌ తొలగించి డీజిల్‌ ఇంజన్‌తో రీమోడలింగ్‌ చేసి మార్కెట్‌లో విక్రయించేవారు.

ఆ సమయంలో డీజిల్‌ బుల్లెట్‌లకు భారీ డిమాండ్‌ ఉండేది. అనంతరం 1994–2000 వరకు బుల్లెట్‌ కంపెనీ వారే డీజిల్‌ బుల్లెట్‌ను విడుదల చేశారు. కాలక్రమేణా పొల్యూషన్‌ కారణంగా 2000 సంవత్సరంలో డీజిల్‌ బుల్లెట్‌ వాహనాలు పూర్తిస్థాయిలో బ్యాన్‌ అయ్యాయి. దాని తర్వాత పలు రకాల బుల్లెట్‌ ద్విక్రవాహనాలు కొత్త వర్షన్‌ మోడల్స్‌తో మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఇప్పటి వరకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌లో కాస్ట్‌ఐరన్‌ స్టాండర్డ్, ఎలక్ట్రా, క్లాసిక్, థండర్‌బాడ్, ఇంటర్‌స్పెక్టర్, కాంటినంటల్‌ జీటీ, హిమాలయం, హంటర్‌ వంటి మోడల్స్‌ వాహనాలు మార్కెట్‌లోకి విడుదలై యువతతో పాటు మధ్య వయస్సు గల వ్యక్తులను సైతం ఆకర్షిస్తున్నాయి. 
(చదవండి: సర్వేలో బయటపడ్డ షాకింగ్‌ విషయాలు.. తెలంగాణలో మరీ ఇంత ఘోరమా?)

బుల్లెట్‌ వాహనాన్ని కొనుగోలు చేస్తున్న యువకులు 

సీసీలపై యువత మోజు..
ప్రస్తుతం మార్కెట్‌లో 100 నుంచి 180 సీసీ గల ద్విచక్రవాహనాలే అధిక శాతం ఉన్నాయి. ఇటువంటి ద్విచక్రవాహనాలపై మక్కువ లేని యువత బుల్లెట్‌ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. బుల్లెట్‌ వాహనం ఒక్కొక్క మోడల్‌ ఒక్కో విధంగా సీసీ కలిగి ఉంటుంది. బుల్లెట్‌ వాహనాలలో 350, 411, 500, 650 సీసీ సామర్థ్యంతో కూడినవి దొరుకుతున్న నేపథ్యంలో.. వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా బుల్లెట్‌ వాహనానికి అనుగుణంగా ఉండేందుకు షోరూంతో వచ్చిన సైలెన్సర్‌ను తొలగించి బుల్లెట్‌పై ఉన్న మోజుతో అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్‌ అమర్చుకోని ప్రయాణిస్తూ బుల్లెట్‌ బైక్‌లను ఆస్వాదిస్తున్నారు.

ధర లెక్కచేయకుండా..
బుల్లెట్‌ ధరతో కారు కొనుగోలు చేయవచ్చు. కానీ యువతతో పాటు మధ్య వయస్సు గల వ్యక్తులు సైతం కారుపై ఆసక్తి కనబర్చకుండా బుల్లెట్‌ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. బుల్లెట్‌ బండ్ల ధరలు మోడల్‌ను బట్టి వాటి ధర ఉంటుంది. రూ. 1.50 లక్ష నుంచి రూ. 3.50 లక్షల వరకు బుల్లెట్‌ బైకుల ధరలు ఉన్నాయి. ఇంతటి ధరను కూడా లెక్క చేయకుండా యువత ఈ బుల్లెట్‌ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారంటే.. వీటి క్రేజ్‌ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులోనే బుల్లెట్‌ ధర రూ. 3.50 లక్షలు వరకు ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్తులో వీటి ధర కొంత శాతం మేర పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ బుల్లెట్‌ కొనుగోలుపై యువత వెనుకడుగు వేయకపోవడం కొసమెరుపు. 

బుల్లెట్‌ రైడ్‌..
బుల్లెట్‌ ద్విచక్రవాహనాలు గంటకు 80 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న విహారయాత్రలకు ఈ బుల్లెట్‌ వాహనాలపై ప్రయాణాలు చేయడం పరిపాటిగా మార్చుకున్నారు. రవాణా సౌకర్యార్థం బుల్లెట్‌ బండ్లు అనుకూలంగా ఉండడం వలన అధికశాతం మంది బుల్లెట్‌ను కొనుగోలు చేసుకుంటూ.. వీటిపై తమకు ఉన్న మక్కువను చూపుతున్నారు. 
(చదవండి: వరంగల్‌లో విషాదం.. బాలుడిని చంపేసిన ‘చాక్లెట్‌’)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top