కాయిర్‌ జియో టెక్స్‌టైల్‌ టెక్నాలజీతో బీటీ రోడ్డు..! | Sakshi
Sakshi News home page

కాయిర్‌ జియో టెక్స్‌టైల్‌ టెక్నాలజీతో బీటీ రోడ్డు..!

Published Tue, Sep 26 2023 1:51 AM

BT Road With Coir Jio Textile Technology - Sakshi

సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో సరికొత్త మార్పులు, ప్రయోగాలకు సిద్దిపేట కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణంలో మరో కొత్త విధానానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కాయిర్‌ జియో టెక్స్‌టైల్‌ (కొబ్బరినార) సాంకేతికతతో తొలిసారిగా రోడ్డు నిర్మించడంతో.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

సాధారణంగా రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు ముందుగా నేలను చదును చేస్తారు. ఆ తర్వాత వివిధ సైజుల్లో ఉన్న కంకరను పొరలు పొరలుగా పోసి రోలర్‌ సాయంతో తొక్కిస్తారు. ఆ మార్గం గట్టిపడిందని నిర్ధారించుకున్న తర్వాత బ్లాక్‌టేప్‌ (బీటీ) మిశ్రమంతో రోడ్డును నిర్మిస్తారు. లేదంటే నేరుగా సిమెంట్‌ రోడ్డును నిర్మించడం ఇప్పటివరకు చూశాం. అయితే, ఇటీవల సిద్దిపేటలో కొత్తగా కొబ్బరినారతో రోడ్డును నిర్మించారు.

కాయిర్‌ జియో టెక్స్‌టైల్‌ టెక్నాలజీతో హుస్నాబాద్‌లో ఉమ్మాపూర్‌ నుంచి పోతారం(ఎస్‌) వరకు నాగారం మీదుగా 3.5 కి.మీ. నిడివితో బీటీ రోడ్డు వేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన కింద రూ.2.31 కోట్లు కేటాయించారు. అయితే నేషనల్‌ రూరల్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌ఆర్‌ఆర్‌డీ) సూచనలతో కాయిర్‌ జియో టెక్స్‌టైల్‌ టెక్నాలజీతో ఈ రోడ్డు నిర్మించారు. ఈ విధానంలో తాగి పడేసిన కొబ్బరి బొండాల నుంచి నారును వేరు చేశారు. దీన్ని ఒక మిషన్‌లో వేసి జాలీ మాదిరిగా అల్లారు.

ముందుగా నేలను చదునుగా చేసి రోలర్‌తో తొక్కించిన తర్వాత కొబ్బరి నారతో చేసిన జాలీని పరిచారు. దీనిపై 5 అంగుళాల సన్న కంకరను ఒక పొరగా వేసి.. దానిపై 6 అంగుళాల మందంతో కంకరను మరో పొరగా పోసి రోలర్‌తో తొక్కించారు. అనంతరం పై నుంచి బ్లాక్‌టేప్‌ డాంబర్‌ వేసి రోడ్డును వేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వేసిన ఈ రోడ్డును పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఇటీవల పరిశీలించారు. ఇలాంటి రోడ్ల నిర్మాణానికి డబ్బు ఆదా అవుతుందని, నాణ్యత కూడా బాగా ఉంటుందని ఆయన చెప్పారు.

ఖర్చు తక్కువ..
సాధారణ రోడ్ల నిర్మాణంలో 9 అంగుళాలు, 6 అంగుళాల మందంతో కూడిన కంకరను వినియోగిస్తారు. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా రోడ్డు వాడకంలోకి వచ్చాక వాహనాల బరువుతో కలిగే ఒత్తిడి వల్ల 9 అంగుళాల మందమున్న కంకర స్థానభ్రంశం చెంది రోడ్డు కుంగిపోతుంది. ఇలా వచి్చన పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిలుస్తుంది. దీని వల్ల బ్లాక్‌టేప్‌లో ఉండే పటుత్వం తగ్గుతుంది.

ఫలితంగా రోడ్డులో గుంతలు ఏర్పడతాయి. అదీగాక, 15 అంగుళాల ఎత్తుతో రోడ్డు నిర్మించడం వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల కంటే రోడ్డు ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుంది. రోడ్డు నిర్మాణంలో కొబ్బరి పీచు వాడితే నిర్మాణ వ్యయం ప్రతీ కిలోమీటరుకు రూ.2 లక్షల వరకు తక్కువ అవుతుంది. దీంతోపాటు వృథాగా ఉంటూ దోమల పెరుగుదలకు కారణమయ్యే కొబ్బరి బొండాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

రోడ్డుపై వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా హుస్నాబాద్‌లో కాయిర్‌ జియో టెక్స్‌టైల్‌ టెక్నాలజీతో రోడ్డు నిర్మించాం. రోడ్డు పైన పడే వర్షపు నీరు భూమిలోకి వెళ్లకుండా కొబ్బరి పీచులోకి ఇంకుతుంది. తర్వాత ఈ నీరు బయటకు రావడం వల్ల రోడ్డు చాలా రోజులు మన్నికగా ఉంటుంది. గుంతలు పడే అవకాశాలు తక్కువ. ఇదే విధంగా మరిన్ని రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం చెప్పింది.  

–సదాశివరెడ్డి, డీఈ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌

 
Advertisement
 
Advertisement