తిప్పలు ఉండవిక
వేసవి ప్రణాళిక..
తాగునీటి సమస్యలపై స్పెషల్ డ్రైవ్
● 508 పంచాయతీల్లో 921 బోరుమోటార్ల గుర్తింపు ● నివేదికను అందజేసిన అధికారులు ● వచ్చే నెల 15లోగా మరమ్మతులు చేసేందుకు ప్రణాళిక
వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రజలు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో ముందస్తుగా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి 20 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 508 గ్రామ పంచాయతీలలో 921 బోరుమోటార్లను గుర్తించారు. వీటి మరమ్మతులకు చర్యలు చేపట్టనున్నారు. – సాక్షి, సిద్దిపేట
జిల్లాలో 1,515 ఓవర్‌హెడ్ ట్యాంక్‌లున్నాయి. 2,793.43 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా 2,06,303 గృహాలకు నల్లాల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. మరమ్మతులను చేపట్టేందుకు గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీఓలు విస్తృతంగా పర్యటించారు. తాగునీటికి సంబంధించి ప్రజలు ఎదుర్కొనే అవకాశం ఉన్న 921 చోట్ల పనులను గుర్తించారు. అందులో హ్యాడ్ పంప్‌లు 126, సింగిల్ ఫేజ్ మోటార్లు 547, త్రీఫేజ్ మోటార్లు 230, బావులు 18 ఉన్నాయి. ఈ పనుల కోసం ప్రభుత్వానికి రూ 2.5కోట్ల నిధులు అవసరం ఉంటుందని నివేదికను అందజేశారు. అలాగే పలు చోట్ల కొత్తగా పైప్‌లైన్లు వేయనున్నారు.
నివేదిక అందజేత
గత ఏడాది తాగునీటి కోసం తలెత్తిన సమస్యలు, ఈ ఏడాది వేసవి కాలంలో సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి నివేదికను కలెక్టర్‌కు, రాష్ట్ర మిషన్ భగీరథ అధికారులకు పంపించారు. అందులో పలు చోట్ల రూ.లక్షల వ్యయంతో కూడిన పనులకు బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. మిగతా చిన్న చిన్న మరమ్మతులు పంచాయతీ ఫండ్ నుంచి చేయించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
సమాచారం అందించాం
గ్రామ పంచాయతీలకు ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. అలాగే జీపీ ఫండ్ సైతం అందుబాటులో ఉంది. వాటితో పనులు చేపట్టాలని మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. దీంతో డీపీఓకు సమాచారం అందించాం. త్వరలో పనులను ప్రారంభించి వచ్చే నెల15లోగా పూర్తి చేస్తాం. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– నర్సింహులు, ఈఈ, మిషన్ భగీరథ
పెండింగ్ డబ్బులు ఇప్పించాలంటున్న కార్యదర్శులు
గత సంవత్సరం గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. దీంతో పంచాయతీ కార్యదర్శులే తమ సొంత డబ్బులను పెట్టి తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలలో భాగంగా పలు మరమ్మతులు చేపించారు. వాటి డబ్బులు ఇప్పటి వరకు రాలేదని పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి చేసిన పనులకు సంబంధించి డబ్బులు ఇప్పించాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.


