అన్న వచ్చిండంటే.. తమ్ముళ్లకు పండగే.. | BRS Leaders Hopes To District President Post | Sakshi
Sakshi News home page

అన్న వచ్చిండంటే.. తమ్ముళ్లకు పండగే..

Apr 6 2025 11:13 AM | Updated on Apr 6 2025 11:13 AM

BRS Leaders Hopes To District President Post

 బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు 

 గులాబీ తమ్ముళ్లకు వేసవి టూర్‌ ఆఫర్‌ 

 

పాపన్నపేట(మెదక్‌): మెతుకుసీమ గులాబీ దళంలో పట్టు సాధించడానికి ‘కంఠప్ప’ పావులు కదుపుతున్నాడు. మెదక్‌ అసెంబ్లీ టికెట్‌పై కన్నేసిన ఆయన మొదట జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకుంటున్నాడు. ఈనెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెడతారన్న సంకేతాల మేరకు ఆయన గులాబీ సైనికులను మచ్చి క చేసుకునే పనిలో పడ్డాడు. ఈక్రమంలో పాపన్నపేట మండల నాయకులకు వేసవి టూర్‌ ఆఫర్‌ చేశాడు. త్వరలోనే విహారయాత్రకు తరలివెళ్లేందుకు తమ్ముళ్లు తెగ ఆరాట పడుతున్నారు.

అక్కను మరిచి.. అన్న పంచన చేరి
ఇంత వరకు అక్క మాట జవ దాటని వీర విధేయులు సైతం.. కంఠప్ప పంచన చేరుతున్నారు. పాపన్నపేట మండలంలోని బీఆర్‌ఎస్‌ పార్టీలో ముఖ్యులైన పంచ పాండవులు. గ్రూపు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడల్లా వెంట తిరిగిన తమ్ముళ్లకు సాయంత్రం ఆయన విందు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నాడు. ఈనెల 1న గాంధారిపల్లిలో భారీ విందు ఏర్పాటు చేసి తమ్ముళ్లను ఖుషీ చేశాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ సంపాదించగలిగతే కాంగ్రెస్‌లో ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తన మాజీ అనుచరులు తనకు మద్దతు ఇస్తారన్న నమ్మకం ఆయనలో కనిపిస్తుంది. ఎమ్మెల్యే టికెట్‌ కోసం గత ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన భారీగా ఖర్చు చేస్తున్నాడు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించడానికి తన వంతు ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు. పరాజయ భారంతో అక్క కొంత కాలం మౌన దీక్ష పాటించింది. అయితే ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పట్టు వదలని విక్రమార్కుడిలా తన కంటూ బలమైన కేడర్‌ను తయారు చేసుకునే పనిలో పడ్డాడు. ఈ పరిణామాన్ని సునిశితంగా గమనిస్తున్న అక్క పార్టీ అధ్యక్ష పదవిని బీసీకి కట్ట బెట్టాలనే డిమాండ్‌తో కంఠప్పకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏడుపాయల జాతరలో రథోత్సవానికి ఇద్దరు నాయకులు కలసి వస్తారని, పార్టీవర్గాలు సమాచారం ఇచ్చాయి. 

ఈ మేరకు ఒక వర్గం నాగ్సాన్‌పల్లిలో.. మరోవర్గం లక్ష్మీనగర్‌లో సేద దీరాయి. కానీ ఏం జరిగిందో ఏమో గాని మొదట అక్క కొంత మంది నాయకులతో కలసి విడిగా ఏడుపాయలకు వచ్చారు. ఆమె వెళ్లిన కొంత సేపటికి అన్న వెంట అధిక సంఖ్యలో గులాబీ నాయకులు తరలివచ్చారు. ఒకే పార్టీలో నెలకొంటున్న వర్గ విభేదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. ఈ ఇద్దరు పార్టీ నాయకులు ఎక్కడా ఎదురు పడకుండా చూసుకుంటున్నారు. ఒక వేళ కనిపించినా ఎడముఖం.. పెడముఖం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్తున్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement