breaking news
District president post
-
అన్న వచ్చిండంటే.. తమ్ముళ్లకు పండగే..
పాపన్నపేట(మెదక్): మెతుకుసీమ గులాబీ దళంలో పట్టు సాధించడానికి ‘కంఠప్ప’ పావులు కదుపుతున్నాడు. మెదక్ అసెంబ్లీ టికెట్‌పై కన్నేసిన ఆయన మొదట జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకుంటున్నాడు. ఈనెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెడతారన్న సంకేతాల మేరకు ఆయన గులాబీ సైనికులను మచ్చి క చేసుకునే పనిలో పడ్డాడు. ఈక్రమంలో పాపన్నపేట మండల నాయకులకు వేసవి టూర్ ఆఫర్ చేశాడు. త్వరలోనే విహారయాత్రకు తరలివెళ్లేందుకు తమ్ముళ్లు తెగ ఆరాట పడుతున్నారు.అక్కను మరిచి.. అన్న పంచన చేరిఇంత వరకు అక్క మాట జవ దాటని వీర విధేయులు సైతం.. కంఠప్ప పంచన చేరుతున్నారు. పాపన్నపేట మండలంలోని బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యులైన పంచ పాండవులు. గ్రూపు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడల్లా వెంట తిరిగిన తమ్ముళ్లకు సాయంత్రం ఆయన విందు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నాడు. ఈనెల 1న గాంధారిపల్లిలో భారీ విందు ఏర్పాటు చేసి తమ్ముళ్లను ఖుషీ చేశాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ సంపాదించగలిగతే కాంగ్రెస్‌లో ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తన మాజీ అనుచరులు తనకు మద్దతు ఇస్తారన్న నమ్మకం ఆయనలో కనిపిస్తుంది. ఎమ్మెల్యే టికెట్ కోసం గత ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన భారీగా ఖర్చు చేస్తున్నాడు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి తన వంతు ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు. పరాజయ భారంతో అక్క కొంత కాలం మౌన దీక్ష పాటించింది. అయితే ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పట్టు వదలని విక్రమార్కుడిలా తన కంటూ బలమైన కేడర్‌ను తయారు చేసుకునే పనిలో పడ్డాడు. ఈ పరిణామాన్ని సునిశితంగా గమనిస్తున్న అక్క పార్టీ అధ్యక్ష పదవిని బీసీకి కట్ట బెట్టాలనే డిమాండ్‌తో కంఠప్పకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏడుపాయల జాతరలో రథోత్సవానికి ఇద్దరు నాయకులు కలసి వస్తారని, పార్టీవర్గాలు సమాచారం ఇచ్చాయి. ఈ మేరకు ఒక వర్గం నాగ్సాన్పల్లిలో.. మరోవర్గం లక్ష్మీనగర్‌లో సేద దీరాయి. కానీ ఏం జరిగిందో ఏమో గాని మొదట అక్క కొంత మంది నాయకులతో కలసి విడిగా ఏడుపాయలకు వచ్చారు. ఆమె వెళ్లిన కొంత సేపటికి అన్న వెంట అధిక సంఖ్యలో గులాబీ నాయకులు తరలివచ్చారు. ఒకే పార్టీలో నెలకొంటున్న వర్గ విభేదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. ఈ ఇద్దరు పార్టీ నాయకులు ఎక్కడా ఎదురు పడకుండా చూసుకుంటున్నారు. ఒక వేళ కనిపించినా ఎడముఖం.. పెడముఖం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్తున్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
కమలంలో మూడు ముక్కలాట
జిల్లా అధ్యక్ష పదవి కోసం తెర వెనుక కుమ్ములాట రెండు వర్గాలు, మూడు గ్రూపులుగా పోటాపోటీ సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఓ మంత్రి... ఓ ఎంపీ ఉన్నప్పటికీ జిల్లా రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేని భారతీయ జనతాపార్టీ శ్రేణులు పార్టీ సారథ్య పదవి కోసం మాత్రం తీవ్రస్థాయిలో పోటీపడుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం తెర వెనుక కుమ్ములాటలకు దిగుతున్నారు. సామాజికవర్గాలవారీగా నేతలు చీలి తమ వర్గానికే అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడిగా భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ వరుసగా ఆరేళ్ల నుంచి వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం ఇటీవలే పూర్తి కావడంతో ఇప్పుడు సరికొత్త కమిటీని భర్తీ చేయాల్సి వచ్చింది. సరిగ్గా ఈ నేపథ్యమే పార్టీలో గ్రూపు, వర్గ రాజకీయాలకు తెరలేపింది. రెండు సామాజిక వర్గాలు ఆ పదవి కోసం పోటీపడుతుండగా, పార్టీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోయారు. జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్ష పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఉండటంతో అదే వర్గానికి బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న డిమాండ్ ఓ వర్గం నుంచి బలంగా వినిపిస్తోంది. ఆరేళ్లుగా బలమైన సామాజికవర్గానికి చెందిన శ్రీనివాసవర్మ కొనసాగడంతో ఈసారి తమకే అవకాశం ఇవ్వాలని మరో వర్గానికి చెందిన నేతలు పట్టుబడుతున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ విభజనతో నవ్యాంధ్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కోస్తా జిల్లాల్లో కులసమీకరణలు మారిపోయాయని ఆ వర్గం నేతలు లెక్కలు వేస్తున్నారు. కచ్చితంగా పశ్చిమలో తమ వర్గానికి చెందిన నేతకే జిల్లా సారధ్య పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని పదవులూ ఆ వర్గానికేనా? వాస్తవానికి ఇప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న వర్గానికి చెందిన వారికే రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ కోటాలో కూడా ఆ వర్గానికే చెందిన సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. జిల్లా అధ్యక్ష పదవికి కూడా అదే వర్గానికి కట్టబెడితే ఎలా అని పార్టీలో మరో వర్గం ఎదురు దాడిచేస్తోంది. పశ్చిమ పార్టీలో సామాజిక న్యాయం పాటించాలంటే తమ వర్గానికే మరోసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఎవరిది పైచేయి అవుతుందో! జిల్లాలో ప్రస్తుతం పార్టీ నేతలు మూడుగ్రూపులుగా విడిపోయారనేది పార్టీ కార్యకర్తలే అంగీకరించే వాస్తవం. ఎంపీ గోకరాజు గంగరాజు, మంత్రి మాణిక్యాలరావు పైకి ఒకే వర్గంలో ఉన్నట్టు కనిపిస్తున్నా.. ఇటీవలకాలంలో వీరిద్దరికీ దూరం పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపీ గంగరాజు తన సోదరుడు, మాజీ డీసీసీ అధ్యక్షుడు గోకరాజు రామరాజుకి ఈసారి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని అప్పగించాలని చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే మంత్రి మాణిక్యాలరావు తమ వర్గానికి చెందిన పాలకొల్లులోని మరోనేత పేరును సిఫార్సు చేస్తున్నటు చెబుతున్నారు. ఈ రెండువర్గాల ప్రతిపాదనలు ఇలా ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు భూపతిరాజు ఇటీవలే పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అండతో మరోసారి తనకే అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కానిపక్షంలో తన వర్గానికి చెందిన నేతకు వచ్చేలా పావులు కదుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపే శక్తి లేనప్పటికీ కేవలం కేంద్రంలో అధికారంలో ఉండటం వల్లనే బీజేపీ నాయకులు జిల్లా సారధ్య పదవి కోసం ఎగబడుతున్నారన్న వాదనలు ఎవరు ఔనన్నా కాదన్నా వాస్తవం. -
విడిపోయిన ఉమా, మోత్కుపల్లి వర్గాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అదే పట్టు.. అదే పంతం... తమ వారికే పట్టం కట్టాలంటే .. తమ వారికే పగ్గాలివ్వాలని రెండు వర్గాల వాదనలు... ఎట్టి పరిస్థితుల్లో పాత అధ్యక్షుడిని తప్పించాలని ఒకరు.. ఇప్పుడెందుకు తప్పించడం, కొనసాగించాలని మరొకరు... నియోజకవర్గ ఇన్చార్జులది ఒక మాట... మండల పార్టీ నాయకులది మరో మాట... కొందరు ఉంచాలంటారు.. మరికొందరు తీసేయాలంటారు.. తమ నాయకుడికే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని కార్యకర్తల నినాదాలు... వద్దు వద్దు.. నినాదాలు చేయవద్దని సర్దుబాటు చేసే యత్నాలు... మాట్లాడుకుందాంరండని నియోజకవర్గాల వారీగా నేతలతో హైదరాబాద్ నుంచి వచ్చిన పరిశీలకుల మంతనాలు.. అక్కడా కుదరని ఏకాభిప్రాయం.. చివరకు నిర్ణయాధికార బంతి పార్టీ అధినేత చంద్రబాబు కోర్టులోకి... స్థూలంగా ఇదీ జిల్లా అధ్యక్ష ఎన్నిక కోసం శనివారం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగిన తీరు... ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి వర్గాలుగా రెండు గ్రూపులుగా చీలిపోయిన పార్టీ నేతలు జిల్లా అధ్యక్ష పదవిని తమ గ్రూపుకివ్వాలంటే తమ గ్రూపుకివ్వాలని పరిశీలకుల వద్ద పట్టుబట్టడంతో ఏమీ తేల్చకుండానే పరిశీలకులు వెళ్లిపో వాల్సి వచ్చింది. బిల్యాను ఉంచాల్సిందేనని మోత్కుపల్లి నర్సింహులు వర్గం... ఆయనను తప్పించాలని ఉమా మాధవరెడ్డి వర్గం భీష్మించడంతో చంద్రబాబుకు మీ అభిప్రాయాలు చెబుతామని, ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పి సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. విడివిడి భేటీలు.. వేర్వేరు అభిప్రాయాలు పార్టీ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా నాయకులంతా శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సీతక్కలు పార్టీ నుంచి పరిశీలకులుగా హాజరయ్యారు. జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గాల ఇంచార్జులు, మండల, గ్రామ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో భాగంగా పార్టీ నేతల ప్రసంగాలు అయిపోయిన తర్వాత పరిశీలకులు నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేశారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నాయకులు మండలాల వారీగా తమ అభిప్రాయాలను చెప్పారు. నియోజకవర్గాల ఇన్చార్జులతో పాటు మండల, మున్సిపల్ అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎవరుండాలనే దానిపై అభిప్రాయాలు వెలిబుచ్చారు. అందులో సూర్యాపేట, ఆలేరు, దేవరకొండ, కోదాడ నియోజకవర్గాల ఇన్చార్జులు బిల్యానాయక్‌ను కొనసాగించాలని చెప్పగా, మిగిలిన నియోజకవర్గాల నేతలు మాత్రం బిల్యాను తప్పించాలని కొందరు, ఉమా మాధవరెడ్డి చెప్పిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని మరికొందరు నేతలు చెప్పుకొచ్చారు. ఇక నియోజకవర్గాల ఇన్చార్జుల మాట అటుంచితే, మండల పార్టీల నేతలు కూడా తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పారు. కొందరు కంచర్ల భూపాల్‌రెడ్డి పేరు, మరికొందరు బిల్యానాయక్ పేరు చెప్పగా, ఇంకొందరు తటస్థంగా ఉంటామని, మరికొందరు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇష్టమేనని చెప్పినట్టు తెలిసింది. అయితే, నియోజకవర్గ ఇన్చార్జుల అభిప్రాయంతో కూడా కొందరు మండల పార్టీల నేతలు విభేదించి వేరే పేర్లు చెప్పడంతో ఏం చేయాలో పరిశీలకులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఉమా మాధవరెడ్డితో కలిసి స్వామిగౌడ్, కాశీనాథ్, రజనీ కుమారి, బంటు వెంకటేశ్వర్లు, నెల్లూరి దుర్గాప్రసాద్, కంచర్ల భూపాల్‌రెడ్డి, సందీప్‌రెడ్డి తదితరులు పరిశీలకులతో సమావేశమయ్యారు. బిల్యాను తప్పించాల్సిందేనని, ఎవరిని అధ్యక్ష పదవిలో ఉంచాలన్నది తర్వాత వెల్లడిస్తామని వారు పరిశీలకులతో చెప్పినట్టు సమాచారం. మోత్కుపల్లి వర్గం తరఫున పటేల్ రమేశ్‌రెడ్డి, శోభారాణి, బిల్యానాయక్, బొల్లం మల్లయ్య యాదవ్, మాదగోని శ్రీనివాసగౌడ్, అయిలయ్య యాదవ్‌లు కూడా పరిశీలకులను కలిసి తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అధ్యక్షుడిగా బిల్యాను ఉంచాలని, ప్రధాన కార్యదర్శిగా అయిలయ్య యాదవ్‌ను ఎన్నుకోవాలని సూచించారు. వీరి వాదనలు విన్న పరిశీలకులు అందరి అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబుకు వివరిస్తామని, ఆయన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. కంచర్ల లేదా బిల్యాలలో ఒకరికి ఛాన్స్ మొత్తంమీద ఏకాభిప్రాయం... కాదు కాదు కనీసం నియోజకవర్గం మొత్తంమీద ఒకేమాట చెప్పే పరిస్థితి లేకుండా ముగిసిన సమావేశం జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను మిగిల్చింది. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం కోసం అందరూ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో కంచర్ల భూపాల్‌రెడ్డి, బిల్యానాయక్లలో ఒకరికి అవకాశం ఉంటుందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నాయి. అయితే, వీరిద్దరూ పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జుల హోదాలో ఉన్నందున రెండు సార్లు పార్టీ ప్రధాన కార్యద ర్శిగా పనిచేసిన నెల్లూరు దుర్గాప్రసాద్ పేరును కూడా ఉమా మాధవరెడ్డి ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేదంటే మరో నేత పేరయినా అమె చెప్పవచ్చని తెలుస్తోంది. మోత్కుపల్లి వర్గం మాత్రం బిల్యాను తప్పించాలంటే పటేల్ రమేశ్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబట్టనుంది. లేదంటే బొల్లం మల్లయ్య, శ్రీనివాస్‌గౌడ్‌ల పేర్లను కూడా తెరపైకి తేనున్నట్టు సమాచారం. జిల్లా పార్టీ అధ్యక్షపదవికి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు జిల్లా టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆద్యంతం... అభిప్రాయ భేదాలు ఈ సమావేశంలో మాట్లాడిన నేతలంతా మాటల తూటాలు పేల్చారు. అందరం కలిసి పనిచేద్దామంటూనే కయ్యాలకు కాలుదువ్వే వ్యాఖ్యలు చేశారు. గ్రూపు గొడవలు మానేయాలని, అందరం పార్టీని కుటుంబంగా భావించి పనిచేయాలని చెప్పిన నాయకులే... తెలుగుదేశం పార్టీ ఓటమికి వేరే పార్టీలేవీ కారణం కాదని, సొంత పార్టీలోని నేతల కారణంగానే పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికయినా విభేదాలు వీడకపోతే పార్టీ అభివృద్ధి చెందదని కొందరు చెపితే... మరికొందరేమో తమకు ఫలానా వారితో విభేదాలున్నాయని బహిరంగంగానే చెప్పడం గమనార్హం. ఒక నాయకుడు మాట్లాడుతూ తమకు పదవి కావాలంటే తమకు కావాలని పట్టుపట్టడం మంచిది కాదని, పార్టీ అధినేత నిర్ణయం మేరకు నడుచుకోవాలని చెపితే, మరొక నాయకుడు మాట్లాడుతూ తనకు పదవిని నిర్వహించే సత్తా ఉందని, ఒకసారి నాకు అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించడం గమనార్హం. చివరకు ఒక నేత మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం తాను అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించడం ఆ పార్టీలోని వర్గవిభేదాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అయి తే, జిల్లా పార్టీ సమావేశానికి పార్టీ కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు గైర్హాజరు కావడం చర్చనీయాంశమయింది. బంధువు లు చనిపోయిన కారణంగా మోత్కుపల్లి స మావేశానికి రాలేదని ఆయన వర్గీయులు చె పితే, కావాలనే సమావేశానికి దూరంగా ఉ న్నా రని కొందరువ్యాఖ్యానించడం గమనార్హం.