జగిత్యాల జిల్లాలో నవ వధువు కిడ్నాప్‌ | bride Kidnap in Jagtial | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం.. నవ వధువు కిడ్నాప్‌

Nov 9 2020 8:08 PM | Updated on Nov 9 2020 8:19 PM

bride Kidnap in Jagtial - Sakshi

సాక్షి, జగిత్యాల : నవ వదువు కిడ్నాప్‌ జగిత్యాలలో కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి నవవధువును కిడ్నాప్‌ చేశారు. ఈ సంఘటన జిల్లాలోని  సమీప పొరండ్లలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేశ్, సారంగాపూర్‌ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన కొంపల సమత ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 7న మల్యాల మండలం ఒబులాపూర్‌ వీరభద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అదే రోజు తమకు రక్షణ కావాలంటూ నూతన జంట సారంగాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. దంపతులు రాకేశ్‌–సమత పొరండ్ల గ్రామంలో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం సమత సోదరుడు సాయికుమార్‌తోపాటు మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బుర్రల ప్రవీణ్‌ కారులో పొరండ్ల గ్రామానికి వచ్చి మరో నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి రాకేశ్, అతని కుటుంబ సభ్యులపై దాడిచేసి సమతను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. దీంతో భర్త వేముల రాకేశ్‌ జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై సతీశ్‌ కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement