రూ.314 ఇంజెక్షన్‌ రూ.50 వేలకు! 

Black Fungus Rs 314 injection for Rs 50,000 - Sakshi

బ్లాక్‌మార్కెట్‌లో బ్లాక్‌ ఫంగస్‌ ఔషధం  

ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటివరకు కోవిడ్‌ చికిత్సలో కీలకంగా వాడే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించిన కేటుగాళ్లు తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు వాడే ఔషధాలను కూడా అదే బాట పట్టిస్తున్నారు. అయితే ఈ దందా వెనుక ఏకంగా వైద్యులు కూడా ఉండటం జోరుగా సాగుతున్న బ్లాక్‌ మార్కెట్‌ పరిస్థితికి అద్దం పడుతోంది. ముఠా సమాచారాన్ని అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఐదుగురు నిందితుల్ని వలపన్ని పట్టుకుని అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి ఐదు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలను ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు మీడియాకు వెల్లడించారు. ఇటీవల బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగుతుండటంతో దీనికి వాడే ఇంజెక్షన్లకూ డిమాండ్‌ వచ్చింది. దీన్ని గమనించిన లంగర్‌హౌస్‌కు చెందిన డాక్టర్‌ బి.రామచరణ్,  మలక్‌పేటకు చెందిన డాక్టర్‌ గాలి సాయినాథ్, గాజులరామారం ప్రాంతానికి చెందిన బి.సురేశ్, బాలానగర్‌ వాసి కె.శ్రీకాంత్, కూకట్‌పల్లికి చెందిన జి.సాయి వర్ధన్‌గౌడ్‌ ఓ ముఠాగా ఏర్పడి నగరంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న చిల్లగొల్ల రవితేజ చౌదరి ద్వారా ఆంపోటెరిసీన్‌ బీ ఇంజెక్షన్లను అక్రమంగా సమీకరించారు.

ఒక్కో ఇంజెక్షన్‌ ధర రూ. 314 ఉండగా దీన్ని రూ.50 వేలకు అమ్మేందుకు ప్రయత్నించారు. దీనిపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్‌ తమ బృందాలతో బుధవారం లంగర్‌హౌస్‌ ప్రాంతంలో వలపన్ని మొత్తం ఐదుగురిని పట్టుకుని అరెస్టు చేశారు. మరో వైద్యుడు రవితేజ పరారీలో ఉన్నారు. కాగా, వీరిలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top