పరిహారం ఇస్తేనే..పండ్ల మార్కెట్‌ నిర్మాణ పనులు సాగనిస్తాం | BJP Chief Ramchander Rao Sensational Comments On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

పరిహారం ఇస్తేనే..పండ్ల మార్కెట్‌ నిర్మాణ పనులు సాగనిస్తాం

Jun 8 2026 5:30 AM | Updated on Jun 8 2026 5:30 AM

BJP Chief Ramchander Rao Sensational Comments On CM Revanth Reddy

సమావేశంలో మాట్లాడుతున్న ఎన్‌.రాంచందర్‌రావు

రైతుల నుంచి భూములు లాక్కొని కోహెడ మార్కెట్‌ నిర్మిస్తున్నారు

పాలమూరులో కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్‌రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడారు

మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వరకు కోహెడలో ఫ్రూట్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు జరగనివ్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోహెడలో 239 ఎకరాల్లో ప్రతిపాదించిన ఫ్రూట్‌ మార్కెట్‌ ప్రాజెక్టు భూములు రైతులవని, వారి నుంచి భూములను సేకరించి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుందన్నారు.

ఇప్పటికే అక్కడ ఫ్రూట్‌ మార్కెట్‌ అందుబాటులో ఉందని, అయినా, రైతుల భూములను సేకరించి, వాటిని ఇతర ప్రయోజనాల కోసం వినియోగించే ప్రయత్నం జరుగుతోందని, ఈ భూసేకరణను రైతులు మొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, వారి భూములను స్వాధీనం చేసుకోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఆయా రైతులను అరెస్టు చేశారని, సాయంత్రం వారిని విడుదల చేశారని తెలిపారు. పాలమూరు జిల్లాలో కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్థాయికి తగినవి కాదన్నారు.

సీఎంతోపాటు కాంగ్రెస్‌ నాయకులు తమ భాషను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బీజేపీ తలచుకుంటే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించిన నిధులు, ప్రాజెక్టులు, జాతీయ సంస్థలపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం ఉంటే తేదీ, సమయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సెక్రటేరియట్‌ గేట్‌ వద్ద అయినా చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైట్‌ పేపర్‌ విడుదల చేస్తే, తాము కూడా వివరాలను ప్రజల ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement