GHMC: పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్లో కోత

Biometric Attendance Confusing: Cuts in Sanitation Workers Wages in GHMC - Sakshi

గందరగోళంగా మారిన బయోమెట్రిక్‌ హాజరు

నిర్లక్ష్య వైఖరిలో అధికార యంత్రాంగం

న్యాయం చేయాలంటూ కార్మికుల ఆందోళన 

సికింద్రాబాద్‌ జోన్‌లోని అయిదు సర్కిళ్లలో 3,228 మంది కార్మికులున్నారు. వీరిలో 1,683 మంది వేతనాల్లో కోత విధించారు. అంటే దాదాపు సగం మందికి జీతాల్లో కోత పడింది. కొన్ని సర్కిళ్లలో దాదాపు 70 శాతం మందికి వేతనాల్లో కోత విధించారు. కార్మికులకు రూ. 14వేల పైచిలుకు వేతనానికి రూ.1500 నుంచి రూ.8000 వరకు వేతనాల్లో కోత పడింది. నగరాన్ని పరిశుభ్రం చేసే 20వేల మందికి పైగా బల్దియా పారిశుద్ధ్య కార్మికుల కన్నీటి వెతలకు ఇది ఓ ఉదాహరణ.

బయోమెట్రిక్‌ మెషిన్లలో సాంకేతిక లోపాలున్నా, సరిచేయాల్సిన కాంట్రాక్టు ఏజెన్సీ పనిచేయకున్నా దానిపై చర్యలు తీసుకోవడం మానిన అధికార యంత్రాంగం కార్మికుల కడుపు కొట్టింది. జీహెచ్‌ఎంసీలో దాదాపు నాలుగైదేళ్లుగా బయోమెట్రిక్‌ హాజరు నిర్వహిస్తున్నారు. మెషిన్లు పనిచేయని సందర్బాల్లో మాన్యువల్‌ హాజరు నమోదు చేసి వేతనాలిచ్చేవారు. మార్చి– ఏప్రిల్‌ నెలల్లో బయోమెట్రిక్‌ హాజరున్న రోజులకు మాత్రమే వేతనాలిచ్చారు. సమయంలో తేడా వచ్చినా కోత విధించారు.

పారిశుద్ధ్య కార్మికుల సాధారణ పనివేళలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. వేసవి సందర్భంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందని దీన్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు అమలుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విషయం కార్మికులకు ముందస్తుగా తెలియజేయలేదు. ఉదయం 5 నుంచి 6 గంటల లోపున హాజరైన వారికి హాజరు నమోదుచేయాల్సి ఉండగా, 5.30 గంటలు దాటితే వేయడం లేదని కొందరు కార్మికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.    
– సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్, యాకుత్‌పురా, గచ్చిబౌలి, వెంగళ్రావునగర్, అంబర్‌పేట  

సాంకేతిక సమస్యలు పరిష్కరించేదెవరు? 
బయోమెట్రిక్‌ హాజరు నమోదుకు వేల రూపాయల వ్యయమయ్యే మెషిన్లను కొనుగోలు చేయకుండా జీహెచ్‌ఎంసీ ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్టుకిచ్చి దానికి  లక్షల రూపాయలు చెల్లిస్తోంది. సాంకేతిక లోపాలు తలెత్తినా, మెషిన్లు సక్రమంగా పనిచేయకున్నా ఏజెన్సీ బాధ్యత వహించాల్సి ఉండగా ఆ పనిచేయడం లేదు.  కార్మికుల హాజరు నమోదు చేసే గ్రూప్‌లోని లీడర్‌(ఎస్‌ఎఫ్‌ఏ) సొంత జేబులోంచి ఖర్చు చేసుకోవాల్సి వస్తోందని కార్మికులు చెబుతున్నారు.బయోమెట్రిక్‌ మెషిన్లను సరిగ్గా వినియోగించడం రానందున కూడా ఆబ్సెంట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. వినియోగంపై తగిన అవగాహన కల్పించాల్సిన అధికారులు కాంట్రాక్టు  ఏజెన్సీకిచ్చి చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
 
తిలాపాపం .. తలా పిడికెడు 
► ఎస్‌ఎఫ్‌ఏలకు పైస్థాయిలోని వైద్యాధికారులు, ఇతరత్రా అధికారులకు నడుమ ఉండే అవినాభావ సంబంధాలు సైతం అక్రమాలకు దారి చూపుతున్నాయి. ఫంక్షన్లు చేసినప్పుడు టీలు, బిస్కెట్లు, పూలదండలు, శాలువాల నుంచి ఇతరత్రా వన్నీ తెమ్మని అధికారులు ఎస్‌ఎఫ్‌ఏలను పురమాయిస్తారు. వారి ఈ వైఖరి తెలిసిన ఎస్‌ఎఫ్‌ఏలు సైతం సమయానికి కార్మికులు రాకున్నా, అసలు రాకున్నా బయోమెట్రిక్‌ పనిచేయడం లేదని హాజరు నమోదు చేస్తారు. ఆ మేరకు కార్మికుల వేతనాల్లో వాటాలు పొందుతారు.  

► దీన్ని ఆసరా చేసుకొని చాలామంది విధులకు రాకుండానే వేతనాలు పొందుతున్నారని తెలుస్తోంది. అలాంటి వారిలో ఎస్‌ఎఫ్‌ఏల కుటుంబసభ్యులు సైతం ఉంటారు. దీన్ని సక్రమంగా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అందరినీ ఒకేగాటన కట్టి ఇష్టానుసారం వేతనాల్లో కోత విధించడంపై కార్మికులు మండిపడుతున్నారు. వేతనాల్లో కోతలపై వివరణ కోసం సంబంధిత అడిషనల్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేదు. పనిచేసిన వారికి వేతనాలివ్వాలని సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సంబంధిత అడిషనల్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. (క్లిక్‌: 111 జీవో ఎత్తివేతతో జరిగేది ఇదే?)

బయోమెట్రిక్‌ ఓ చీటింగ్‌  
బయోమెట్రిక్‌లో లోపాలున్నాయని అధికారులు అబద్ధాలు  చెబుతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. అంతా చీటింగ్‌ నడుస్తుందని అనుమానంగా ఉంది. మూడు రోజులో, నాలుగు రోజులో మెషిన్‌ పని చేయకుంటే.. ఆలస్యమైతే అన్ని రోజులకు మాత్రమే వేతనాల్లో కోత విధించాలి. కానీ, వేలకు వేలు ఎలా? పూర్తిస్థాయిలో విచారణ జరిపి మా జీతం మొత్తం తిరిగి ఇచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. 
– చెన్నమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు  

చర్యలు తీసుకుంటాం.. 
బయోమెట్రిక్‌ మెషిన్లలో లోపాల కారణంగా జీతాల్లో కోత పడింది. విధులకు హాజరైనప్పటికీ వేతనాలందని వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటాం.   
– కె.వి. శివప్రసాద్‌ మలక్‌పేట్‌ సర్కిల్‌ ఏఎంహెచ్‌ఓ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top