
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యతని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి సమస్యకూ తప్పకుండా పరిష్కారం కనుగొంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది.
ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు తదితరులు ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారని.. ఇందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
‘కొన్నేళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో అన్నీ ఒకేసారి చేయలేకపోయాం. ఇక ఎక్కువ కాలం పెండింగ్‌లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలనేదే ప్రభుత్వ ఆలోచన’అని భట్టి ఉద్యోగ సంఘాలకు వివరించారు. గత ప్రభుత్వ పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని.. అయినా ఉద్యోగులకు సాధ్యమైన మేర మేలు చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టామని భట్టి చెప్పారు.
ఇప్పటికే ప్రతినెలా మొదటి తారీఖున జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నామని.. ప్రభుత్వ ఆదాయం.. ఖర్చు, చేయాల్సిన పనులను బేరీజు వేసుకుంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం ముందుకు వెళ్తున్నారని భట్టి వివరించారు.
ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఆసుపత్రుల ఖర్చులకు సంబంధించిన సమస్యలపై ఇప్పటికే కేబినెట్ సహచరులం అంతర్గతంగా పలుమార్లు చర్చించుకున్నామని.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదన్నారు.
గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో త్రిసభ్య కమిటీ నివేదిక, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదిక రూపొందించి నివేదిక ఇస్తామన్నారు. ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్, సభ్యులు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.