పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం | Sakshi
Sakshi News home page

పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం

Published Sun, Feb 25 2024 2:23 AM

Bhatti Vikramarka and Ministers urge swift completion of Yadadri Thermal Power Project - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విద్యుత్‌ ప్లాంట్‌కు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు అంచనా వ్యయాలు పెంచడంతో బడ్జెట్‌ భారీగా పెరిగిందని, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయకపోతే మోయలేని భారంగా పరిణమిస్తుందన్నారు. 

ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వ సహకారం 
ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉన్న స్కిల్డ్, అన్‌ స్కిల్డ్‌ నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఆలోచించాలన్నారు. బీహెచ్‌ఈఎల్‌ పేరున్న ప్రభుత్వ రంగ సంస్థ అని యాదాద్రి పనులు త్వరగా పూర్తి చేయకపోతే ఆ సంస్థకు చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని సంస్థ అధికారులు, ఇంజనీర్లు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. 

సెప్టెంబర్ నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్‌ 
ఈ ఏడాది సెప్టెంబర్లో రెండు యూనిట్ల ద్వారా 1,600 మెగావాట్ల విద్యుత్‌ పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తామని అధికారులు వివరించారు. 2025 మార్చి నాటికి మొత్తం ఐదు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి తెస్తామని అధికారులు మంత్రులకు చెప్పుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో జీరో పర్సంట్‌ ధూళి బయటికి వెళ్లకుండా నిర్మాణం జరుగుతుందని అధికారులు వివరించారు. అలాగే స్థానికంగా వినియోగించే నీటిని తిరిగి శుద్ధి చేసి ప్రాజెక్టు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు. 

రుణాలపై ఆరా.. 
ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలు, వాటి వడ్డీ రేట్ల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. కమర్షియల్‌ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఉంటే దానిని తగ్గించాలని కోరే అవకాశం ఉందని చెప్పా రు. స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సబ్‌ కాంట్రాక్టులు, ఇతర చిన్నచిన్న పనుల్లో స్థానికులకు అవకాశం కల్పించడం ద్వారా చేయూతనివ్వాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను కోరారు. ప్రస్తుతం పవర్‌ ప్లాంట్‌లో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వీడియో ప్రజెంటేషన్‌ రూపంలో మంత్రుల బృందానికి వివరించారు. సమావేశంలో విద్యుత్‌ శాఖ సీఎండీ సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీ, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ అజయ్, పవర్‌ ప్లాంట్‌ సీఈ సమ్మయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement