గిరిజన గురుకుల పరిధిలో లా కాలేజీ

Bar Council Of India Nod To Set Up Law College In TSWREIS - Sakshi

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి

పటాన్‌చెరు ఎస్టీ గురుకులంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు 

2020–21 విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలో న్యాయ కళాశాల ఏర్పాటుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతులు లభించాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు గిరిజన గురుకులంలో కో ఎడ్యుకేషన్‌ లా కాలేజీ (రెసిడెన్షియల్‌) ఏర్పాటుకు గతేడాది గిరిజన గురుకుల సొసైటీ ప్రతిపాదనలు పంపింది. కోవిడ్‌–19 నేపథ్యంలో అనుమతులకు ఆలస్యం అవుతుందని అధికారులు భావించారు. కానీ లాసెట్‌ పరీక్ష, ఫలితాల ప్రకటన, కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆలస్యం కావడం అడ్మిషన్ల ప్రక్రియకు కలసివచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు అవకాశం దక్కింది. ప్రస్తుతం లాసెట్‌–20 తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి కాగా రెండో విడత కౌన్సెలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా గిరిజన న్యాయ కళాశాలకు వచ్చిన అనుమతులను ఉన్నత విద్యా మండలి, సెట్‌ కన్వీనర్లకు సమరి్పంచడంతో ఈ కాలేజీలో సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. 

65 శాతం సీట్లు గిరిజనులకే.. 
గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా ప్రారంభం కానున్న న్యాయ కళాశాలలో 65 శాతం సీట్లు గిరిజనులకే కేటాయిస్తారు, గిరిజన విద్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన తర్వాత ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉంటాయి. ఇందులో గిరిజనులకు 39, ఎస్సీలకు 6, బీసీలకు 7, అగ్రవర్ణాలకు 2, స్పోర్ట్స్‌ కోటా 2, ఎన్‌సీసీ 2, ఎక్స్‌ సరీ్వస్‌ మెన్‌ 1, వికలాంగులకు 1 కేటాయిస్తారు. 

శుభ పరిణామం: మంత్రి సత్యవతి రాథోడ్‌ 
గిరిజన గురుకుల సొసైటీ పరిధిలో న్యాయ కళాశాల ప్రారంభించడం శుభ పరిణామం. కేజీ టూ పీజీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకులాలను నిర్వహిస్తోంది. ఇటీవలే నర్సంపేటలో దేశంలోనే తొలిసారిగా గిరిజన సైనిక్‌ స్కూల్‌ ప్రారంభించాం. బీఈడీ, మరో రెండు పీజీ కోర్సులకు అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ–20 వల్ల అనుమతులు రావడంలో ఆలస్యం అవుతోంది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top