
ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం
పాత పరిచయాలు, వివాహేతర సంబంధాలతో భర్తలను కడతేరుస్తున్న భార్యల ఉదంతాలు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుండడం చూస్తున్నదే. పెళ్లై నెల తిరగకుండానే నవవధువులు సైతం ఈ జాబితాలో చేరిపోతున్నారు. తాజాగా తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
క్రైమ్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను హత్య చేసింది ఓ భార్య. ఆపై అత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది దొరికిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ప్రయత్నించగా.. బంధువుల జోక్యంతో ఈ వ్యవహారం బయటపడింది.
బాచుపల్లిలో నివాసం ఉంటున్న అంజిలప్ప ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని భార్య రాధ కన్నీరు మున్నీరు అయ్యింది. ఆపై స్వగ్రామం నారాయణపేటకు మృతదేహాన్ని తీసుకెళ్లింది. అయితే గొంతుపై ఉన్న మరకలను చూసి బంధువులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఆమెను గట్టిగా విచారించగా.. ఆమె అసలు విషయం చెప్పింది.

గత కొంతకాలంగా రాధ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతోంది. అయితే అలాంటివి వద్దని, అతనితో ఫోన్ మాట్లాడొద్దని భర్త ఆమెను మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న రాధ.. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతును నులిమి హత్య చేసింది. పోలీసుల విచారణలో అంజిలప్పను తానే హత్య చేసినట్లు రాధ అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.