సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ సబ్ డివిజన్‌కు గ్రహణం పట్టింది. ఏసీపీ పోస్టు ఖాళీ అయ్యి ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు ఇక్కడ పూర్తిస్థాయి అధికారిని నియమించకపోవడం పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్న విమర్శలున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన యువ ఐపీఎస్ అధికారి నగ్రాలె శుభమ్ ప్రకాశ్.. 2026 ఏప్రిల్‌లో నిజామాబాద్ అదనపు డీసీపీగా బదిలీపై వెళ్లారు. అప్పటినుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రస్తుతం హనుమకొండ ఏసీపీకి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆయన తన సొంత డివిజన్‌ను చూసుకుంటూ ఇక్కడికి పూర్తి సమయం కేటాయించలేకపోతుండడంతో ఇన్‌చార్జ్ పాలన అంతంతమాత్రంగానే సాగుతోంది. ఫలితంగా వరంగల్ పోలీసు డివిజన్ కిందికి వచ్చే మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్, మిల్స్‌కాలనీ ఠాణాల్లో నేర ఘటనలపై పర్యవేక్షణ కరువైందన్న విమర్శలున్నాయి.
రాజకీయ వైషమ్యాలు.. గ్రూపుల తగాదాలు
ఏసీపీ బాధ్యతలు చేపట్టేందుకు సీనియర్ ర్యాంకర్ అధికారులు, సీఐలుగా పనిచేసి పదోన్నతి పొందిన వారు పెద్దగా ఆసక్తి చూపకపోవడానికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని రాజకీయ వైషమ్యాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక్కడ అధికార పార్టీలోనే అంతర్గతంగా గ్రూపులు ఉండడం, ఒకవర్గం చెప్పినట్లు వింటే మరోవర్గం ఒత్తిడి తేవడం వంటి పరిణామాలతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న తప్పు జరిగినా నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తుండడంతో ఈ రాజకీయ చదరంగంలో తాము బలికాకూడదనే ఉద్దేశంతో సమర్థులైన అధికారులు సైతం ఈ పోస్టుకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
మూడు ఠాణాల పరిధిలో కరువైన పర్యవేక్షణ
వరంగల్ డివిజన్ పరిధిలోని మూడు కీలక పోలీసు స్టేషన్లయిన ఇంతేజార్‌గంజ్, మట్టెవాడ, మిల్స్ కాలనీలపై ఏసీపీ స్థాయి పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. ఆయా స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్య కలాపాలు, శాంతిభద్రతల సమస్యలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌లో నిఘా కరువవడంతో ఓ వ్యక్తి పీఎస్ లోపలే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోగా, మరో వ్యక్తి స్టేషన్ సమీపంలోనే డీజిల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించడం సంచలనం సృష్టించింది.
కరీమాబాద్ ప్రాంతం బీరన్నకుంటల్లో బర్త్‌డే సందర్భంగా యువకులు తల్వార్ తిప్పుతూ బైక్‌పై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. అంతకుముందే ఇక్కడి ఓ ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ సస్పెండ్ చేశారు. అలాగే, ఇంతేజార్‌గంజ్ పరిధిలో యువతను, మైనర్లను టార్గెట్ చేస్తూ వారికి గంజాయి అలవాటు చేసి వ్యభిచార ఊబిలోకి దించుతున్న అంతర్రాష్ట్ర ముఠాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. మట్టెవాడ ఠాణా పరిధిలో ఇంట్లో పని మనుషులుగా కుదిరి ఓ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిని హత్యచేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలా ఏదో రూపంలో ఘటనలు జరుగుతుండడంతో వాటిపై పర్యవేక్షణకు ఏసీపీ అవసరం కనిపిస్తోంది.
క్రైమ్ రేటు కట్టడికి అవసరమే..
నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. కీలక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ముఖ్యంగా కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. వరంగల్ మోడ్రన్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కీలకమైన రైల్వే స్టేషన్ ఉంది. బంగారు దుకాణాలు, బట్టల దుకాణాల హోల్‌సేల్ వ్యాపారం ఉంది. భూ కబ్జాల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వాటిన్నింటిని దృష్టిలో ఉంచుకొని క్రైమ్ రేటును కట్టడి చేసేందుకు వరంగల్ ఏసీపీ పోస్టు భర్తీ ఎంతో కీలకం కానుంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వరంగల్ వాసులు కోరుతున్నారు.


