అన్నకు తోడుగా ఉంటానంటివి కదా చిన్నా.. | Tragedy Road Accident In Rangapur National Highway | Sakshi
Sakshi News home page

అన్నకు తోడుగా ఉంటానంటివి కదా చిన్నా..

Oct 25 2026 9:19 AM | Updated on Oct 25 2026 10:15 AM

Tragedy Road Accident In Rangapur National Highway

రోదిస్తున్న అరవింద్‌ తల్లి జీవిత

కరీంనగర్‌:  వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరి వయసు 21 ఏళ్లు. ఒకే కాలనీలో ఉంటారు. దేవీ నవరాత్రోత్సవాల్లో మాలాధారణ చేశారు. రోజు దుర్గమ్మకు పూజలు చేస్తూ మండపంలో భజన చేశారు. గురువారం రాత్రి అమ్మవారిని నిమజ్జనం చేశారు. తమ మాల వితరణ చేసేందుకు శుక్రవారం ఉదయం కారులో ఏడుగురు మిత్రులు కలిసి విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్లి మొక్కులు అప్పగించారు. రాత్రి తిరుగు ప్రయాణమవగా శనివారం వేకువజామున హుజూరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణ స్నేహితులు ప్రాణాలు విడిచారు. దీంతో రామగుండంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో విషాదం నెలకొంది. 

అన్నకు తోడుగా ఉంటానంటివి కదా చిన్నా.. 
‘మూడేళ్లుగా దుర్గమ్మ మాలాధారణ చేసుకుంటివి.. డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్‌ కంపెనీలో ఈయేడు ఉద్యోగం చూసుకొని అన్నకు తోడుగా ఉంటానని చెప్పితివి కదురా కొడుకా’ అంటూ బట్టారి జీవిత తన కుమారుడి మృతదేహంపై పడి రోదించడంతో అక్కడున్నవారు కంటతడి పెట్టారు. బట్టారి సీతారాములు–జీవిత దంపతులకు ముగ్గురు కుమారులు కాగా సీతారాములు ఐదేళ్ల క్రితమే మృతిచెందాడు. వీరి పెద్ద కుమారుడు చక్రాధర్‌ పెద్దపల్లి కోర్టు ఉద్యోగి. రెండో కుమారుడు అరవింద్‌ (మృతుడు), మూడో కుమారుడు తేజ ఇంటరీ్మడియట్‌ చేస్తున్నాడు. వీరి కుటుంబాన్ని పెద్ద కుమారుడు పోషిస్తున్నాడు. కుటుంబ సమస్యలను గుర్తించి డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగం చేస్తానని చెప్పి కానరాని లోకాలకు వెళ్లాడని అరవింద్‌ సోదరులు గుండెలవిసేలా రోదించారు. చివరగా శుక్రవారం రాత్రి 11.30లకు ఫోన్‌ చేసి రెండు గంటల్లోగా ఇంటికి చేరుకుంటామని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ విలపించారు. 


రోదిస్తున్న సాయినాథ్‌ తల్లి కవిత 

ఇంటికి రాకుండానే వెళ్లిపోయావా కొడుకా..
‘పదిహేనేళ్ల నుంచి దుర్గమ్మ మాలాధారణ చేస్తివి.. ఎంతో నిష్టగా నవరాత్రుల్లో పాల్గొంటివి.. నాకు పని దొరికితే దుర్గమ్మను దర్శించుకుంటానని మొక్కితివి.. ఎన్టీపీసీలో పని దొరికే.. మొక్కు తీర్చుకునేందుకు విజయవాడ దుర్గమ్మ చెంతకు వెళ్లితివి.. ఇంటికి రాకుండానే ప్రాణాలు వదిలితివి కదురా కొడుకా’ అంటూ మచ్చ సాయినాథ్‌(21) తల్లి కవిత రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన మచ్చ రాజేశ్‌–కవిత దంపతులకు సాయినాథ్, హర్ష కుమారులు. 

రాజేశ్‌ సెంట్రింగ్‌ పనులు చేస్తుండగా, కవిత వంద రోజుల పనికి వెళుతూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నారు. సాయినాథ్‌ ఐటీఐ (ఎలక్ట్రిషియన్‌) పూర్తి చేసి రెండునెలల క్రితం ఎన్టీపీసీలో అప్రెంటీస్‌ చేస్తున్నాడు. పదిహేనేళ్లుగా (ఆరేళ్ల వయసు నుంచి) దుర్గాదేవి మాలాధారణ చేసుకుంటున్నాడు. పదహారోసారి దుర్గమ్మకు మొక్కులు అప్పగించి మాల వితరణ చేసి ఇంటికి వస్తున్న క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి ఫోన్‌ చేసి‘ఇప్పుడే దాబా హోటల్‌లో తిని కారెక్కినం అమ్మా’ అంటూ మాట్లాడిన గంటల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి ఒక్కసారిగా నిశ్చేషు్టలయ్యారు.

పలువురి పరామర్శ
మచ్చ సాయినాథ్, బట్టారి అరవింద్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా శనివారం వారి కుటుంబసభ్యులను కార్పొరేటర్లు దారంగుల కుమార్, ఇసంపెల్లి అంజులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అయోధ్యసింగ్‌ఠాకూర్, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కౌశికహరి, మాజీ కార్పొరేటర్‌ కౌశిక లత, ఉపాధ్యాయులు ఠాకూర్‌ బల్వన్‌సింగ్, ఠాకూర్‌రాంసింగ్, రజిని పరామర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement