Telangana Minister Srinivas Goud And Andhra Pradesh MP TG Venkatesh War - Sakshi
Sakshi News home page

పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో మాటామాట 

Published Thu, Nov 18 2021 4:29 AM

Argument Between Telangana Minister Srinivas Goud And Andhra Pradesh MP TG Venkatesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మీ ఆస్తులు హైదరాబాద్‌లో ఉంటాయి.. కానీ, హైదరాబాద్, తెలంగాణ గురించి మాట్లాడితే వినే ఓపిక లేదా’ ‘మీటింగ్‌కు–మీరు మాట్లాడే విషయానికి ఏమైనా సంబం ధం ఉందా? ఎజెండా ఏంటో దానిపైనే మాట్లాడాలి.. అనవసర విషయాల ప్రస్తావనెందుకు’ తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ – ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ టీజీ వెంకటేశ్‌ మధ్య జరిగిన వాదన ఇది.

ఓ కీలక సమావేశంలో పలువురు ఎంపీలు, అధి కారుల సమక్షంలో ఇద్దరి మధ్య మాటామాట చోటుచేసుకుంది. ఓ దశలో నువ్వెంత అంటే నువ్వెంత అన్న దాకా వెళ్లింది. చివరకు తెలంగాణ ఉద్యమ సమయ ప్రస్తావన కూడా చోటు చేసుకుంది. ఇతర ఎంపీల జోక్యం చేసుకోవటంతో వివా దం సద్దుమణిగినా.. ఆ సమావేశంలో మరి కొంత సేపు ఉండాల్సి ఉన్నప్పటికీ అర్ధాంతరంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిష్క్రమించారు.  

ఇదీ విషయం...: రవాణా, సాంస్కృతిక–పర్యాటక శాఖల పార్లమెం టరీ స్థాయీ సంఘం బుధవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఆ కమిటీ పరిధిలోని శాఖల పనితీరును పరిశీలిస్తూ, కేంద్రం నుంచి ఉండాల్సిన సహకారం, ప్రాజెక్టులకు బ్యాం కుల రుణాలు.. తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది. మాదాపూర్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో ఈ కమిటీ చైర్మన్, ఎంపీ టీజీ వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

సమావేశం దాదాపు గంటన్నర ఆలస్యంగా మొదలైంది. తొలుత పర్యాటక, సాంస్కృతిక శాఖపై చర్చ ప్రారంభమైంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభిస్తూ, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, పనుల గురించి మాట్లాడారు. సమావేశం బాగా ఆలస్యమైనందున ఎక్కువ సమయం తీసుకోవద్దని టీజీ వెంకటేశ్‌ రెండు పర్యాయాలు మం త్రికి సూచించారు.

దీనికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. సమావేశంలో అలా గట్టిగా మాట్లాడటం కరెక్టు కాదని చెప్పి ఎం పీలు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఆ వెంటనే శ్రీనివాస్‌గౌడ్‌ సభ నుంచి నిష్క్రమించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 27 మంది ఎంపీలు, స్థానిక అధికారుల సమక్షంలో ఇది జరగడం గమనార్హం.    
 

Advertisement
Advertisement