
కఠిన చర్యలకు వీలుగా న్యాయ, సాంకేతిక పరిష్కారాలు వెతకండి
కేంద్ర ప్రభుత్వానికి సూచించిన పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ: కృత్రిమమేథ(ఏఐ)తో సృష్టించిన నకిలీ వార్తలు సమాజంపై పెను దుష్ప్రభావం చూపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పరిష్కార కొరడాతో ముందుకు రావాలని ప్రసార, సమాచార సాంకేతికతపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉద్భోదించింది. ఏఐతో సృష్టించిన నకిలీ వార్తల విస్తృతి కట్టడికి ఏఐతో అడ్డుకట్టవేయాలని ఈ మేరకు ఏఐను పూర్తిస్తాయిలో వినియోగించుకోవాలని సంబంధిత ముసాయిదా నివేదికలో స్టాండింగ్ కమిటీ సూచించింది.
‘తప్పుడు సమాచారం ఎక్కడ ఉందో తెల్సుకునేందుకు సాంకేతికతను ఉపయోగించాలి. కానీ ప్రస్తుత సమాజంలో తప్పుడు సమాచారానికి సాంకేతికతనే సృష్టికర్తగా మారిన దురవస్థ దాపురించింది’అని ముసాయిదా ఆవేదన వ్యక్తంచేసింది. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సారథ్యంలోని స్టాండింగ్ కమిటీ ఇటీవలే తన నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది.
‘ఏఐతో నకిలీ వార్తలను తామరతుంపరగా సృష్టించి అన్ని సామాజిక మాధ్యమాల్లోకి వెదజల్లుతున్న సృష్టికర్తల ఆచూకీ కనిపెట్టి వాళ్ల భరతం పట్టాలి. ఈ క్రతువులో కేంద్ర సమాచార, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలు కలసికట్టుగా పనిచేయాలి. ఏఐ నకిలీ వార్తలను రూపొందిస్తున్న వ్యక్తులు, సంస్థలను చట్టం ముందు నిలబెట్టేలా పటిష్టమైన న్యాయ, సాంకేతిక పరిష్కారాలను కనుగొనాలి’అని సూచించింది.
శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి
‘‘మంత్రిత్వశాఖల మధ్య అంతర్గత సహకారం ఉంటే ఏఐ కంటెంట్ సృష్టికర్తలకు ఏఐ జనిత వీడియోలు, సమాచారంపై లైసెన్సుల జారీపై మరింత పట్టు సాధించగలరు. ఏఐ వీడియోలు, కంటెంట్‌పై ఇది ఏఐ జనితం అనే లేబుల్‌ను కచ్చితంగా ముద్రించాలనే నిబంధనను తు.చ. తప్పకుండా అమలుచేయాలి’ అని సూచించింది. నకిలీ సమాచారం జాడ కనిపెట్టడం, కట్టడిచేయడం, తొలగించడం వంటి విధుల్లో ఏఐ, మెషీన్ లెర్నింగ్ సాంకేతికతలను విరివిగా వాడాల్సిన తరుణమిది అని నివేదిక అభిప్రాయపడింది. ఏఐ నకిలీ వార్తలను సృష్టించడం, ప్రచారంచేయడం వంటి నేరాలకు కఠిన శిక్షలను అమలుచేసేలా నేరశిక్షాస్మృతిలో సవరణలు చేయడం, జరిమానా మొత్తాలను పెంచడం వంటివి చేయాలని సూచించింది.