సంఘటితం.. సంఘర్షణ.. సిద్ధంచేయడం | This Are main responsibilities before the new BJP state president | Sakshi
Sakshi News home page

సంఘటితం.. సంఘర్షణ.. సిద్ధంచేయడం

Jul 2 2025 6:20 AM | Updated on Jul 2 2025 6:20 AM

This Are main responsibilities before the new BJP state president

సమావేశంలో నవ్వులు చిందిస్తున్న కిషన్‌రెడ్డి, నూతన అధ్యక్షుడు రాంచందర్‌రావు

బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ముందున్న ప్రధాన బాధ్యతలివే

సాక్షి, హైదరాబాద్‌: ‘పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావుపై మూడు ప్రధాన బాధ్యతలున్నాయి. కార్యకర్తలను సంఘటితం చేయడం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సంఘర్షణ చేయడం.. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేలా పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయడం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యాఖ్యానించారు. 

మంగళవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రకటన, సన్మాన కార్యక్రమంలో ఎన్‌.రామంచందర్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శోభ కరంద్లాజే ప్రకటించి ఆయకు నియామకపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనతోపాటు ఏడాదిన్నర కాంగ్రెస్‌ పాలనపైనా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. 

ఈ రెండింటికీ ప్రత్యామ్నాయమైన బీజేపీకి అధికారం ఇవ్వాలనే యోచనలో ప్రజలు ఉన్నారని.. ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని కేడర్‌కు సూచించారు. ‘తెలంగాణలో ఇప్పుడు బీజేపీకి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయండి. 

రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరచండి. అలా చేస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు కాంగ్రెస్‌కు ఏటీఎంలుగా తయారయ్యాయి. ఇక్కడి ప్రజాధనాన్ని లూటీ చేసి పార్టీ పెద్దలకు కట్టబెడుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే రోజులు ఎంతో దూరం లేవు’అని పేర్కొన్నారు. 

11 ఏళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి రూ. 12 లక్షల కోట్లు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని కొందరు తెలివితక్కువగా మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ. 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని.. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. 

బీఆర్‌ఎస్‌ పాలనంతా దోచుకోవడంతోనే గడిచిపోయిందని.. ఇప్పుడున్న రేవంత్‌ ప్రభుత్వం కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా అందరూ ఐకమత్యంగా పనిచేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాలుగుసార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని.. తన హయంలో ఏమైనా లోటుపాట్లు జరిగితే క్షమించాలని కోరారు. 

బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ లోపాయికారీ ఒప్పందం: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ 
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. అందుకే ఫోన్‌ ట్యాపింగ్, ఈ–కార్‌ రేస్‌ కేసుల్లో ఎలాంటి చర్యలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ రెండు పారీ్టలను నమ్మని ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వాలని చూస్తున్నారన్నారు. 

సౌమ్యుడిగా కనిపించినా సమస్య వస్తే టఫ్‌గా ఉంటా:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు 
రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ సామాన్య కార్యకర్తలాగే కష్టపడి పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు తెలిపారు. అయితే తాను సౌమ్యుడిగా కనిపించినా సమస్య వచి్చనప్పుడు చాలా టఫ్‌గా వ్యవహరిస్తానన్నారు. సిద్ధాంతం కోసం పోరాడతానని, గతంలో 14సార్లు జైలుకు వెళ్లి వచ్చానని.. విద్యార్థుల కోసం లాఠీచార్జిలో తన చెయ్యి, కాలు దెబ్బతిన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తానన్నారు. 

బీజేపీలో ఉమ్మడి నాయకత్వం ఉంటుందని.. అందరి అభిప్రాయంతోనే తాను నిర్ణయాలు తీసుకుంటానని రాంచందర్‌రావు తెలిపారు. ఇప్పుడు అందరి లక్ష్యం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీలోని కొత్త వాళ్లు, పాత వాళ్లు కలిసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ వాట్సాప్‌ యూనివర్సిటీతో, కాంగ్రెస్‌ ఫేక్‌ న్యూస్‌లతో ట్రోలింగ్‌ చేస్తోందని, అలాంటి వాటికి జడిసేది లేదన్నారు. పేరులేని పేపర్లతో సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం చేసే వారిపై క్రిమినల్‌ కేసులు వేసి జైలుకు పంపిస్తానని హెచ్చరించారు.

జాతీయ కౌన్సిల్‌ సభ్యులు... 
రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక అనంతరం జాతీయ కౌన్సిల్‌కు ఎన్నికైన వారి పేర్లను ప్రకటించారు. వారిలో కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్, మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ఎంపీలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, గోడం నగేశ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, పి.సుధాకర్‌రెడ్డి, ఎం.ధర్మారావు, చింతా సాంబమూర్తి, కె.గీతామూర్తి, పద్మజారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఏవీఎన్‌ రెడ్డి, బంగారు శ్రుతి, అరుణజ్యోతి, బండారు రాధిక, జి.ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్, మర్రి శశిధర్‌రెడ్డి, పాయల్‌ శంకర్‌ ఉన్నారు. మరికొందరు నామినేషన్‌ వేసినప్పటికీ పేర్లను తర్వాత ప్రకటిస్తామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement