నా భర్తకు ఏమైనా జరిగితే ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత | The AP government is responsible for anything that happens to my husband says kvr wife | Sakshi
Sakshi News home page

నా భర్తకు ఏమైనా జరిగితే ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత

Jul 3 2026 3:03 AM | Updated on Jul 3 2026 3:03 AM

The AP government is responsible for anything that happens to my husband says kvr wife

జర్నలిస్టు కేవీఆర్‌ భార్య విజయలక్ష్మి  

చైతన్యపురి (హైదరాబాద్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బొబ్బిలి సర్కిల్‌ పోలీసులు తీసుకెళ్లిన తన భర్త, జర్నలిస్టు కోశిక వెంకట్రామిరెడ్డి (కేవీఆర్‌)ని క్షేమంగా పంపించాలని ఆయన భార్య విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. కేవీఆర్‌కు ఏమైనా జరిగితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. కర్మన్‌ఘాట్‌ మాధవనగర్‌ కాలనీలో నివసిస్తున్న కేవీఆర్‌ను నాన్‌బెయిలబుల్‌ వారంట్‌ ఎగ్జిక్యూషన్‌ పేరుతో మంగళవారం రాత్రి ఏపీ పోలీసులు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కేవీఆర్‌ భార్య విజయలక్ష్మిపై అనుచితంగా ప్రవర్తించడంతో ఏపీ పోలీసులపై సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే క్రిమినల్‌ కేసు నమోదు అయింది.

గురువారం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. వృత్తి ధర్మంలో భాగంగా ప్రజల తరఫున ప్రశ్నించటం నేరమా అని ప్రశ్నించారు. దేశద్రోహం కేసు పెట్టటానికి ఆంధ్రాలో ఏమైనా బాంబులు పెట్టాడా అని అన్నారు. కేవీఆర్‌ను తీసుకెళ్లేటప్పుడు పోలీసులు ప్రొసీజర్‌ ఫాలో కాలేదని, ఆయన చేతులో ఉన్న తన ఫోన్‌కూడా తీసుకెళ్లారని ఆమె తెలిపారు. సంచలనంగా మారిన సాయికృష్ణ కేసును మరిపించటానికి ఈ కేసును ముందుకు తీసుకొచ్చారని విమర్శించారు. తనపై అనుచితంగా ప్రవర్తించిన ఏపీ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. 

జర్నలిస్టు కేవీఆర్‌కు రిమాండ్‌ 
బొబ్బిలి: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు ను ఎండగడుతూ వార్తలు అప్‌లోడ్‌ చేస్తున్న తె లంగాణ జర్నలిస్ట్‌ కె.వెంకటరామిరెడ్డి (కేవీఆర్‌) కు విజయనగరం జిల్లా బొబ్బిలి సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. బా డంగికి చెందిన టీడీపీ నాయకుడు కండి రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సరూర్‌నగర్‌లో కేవీఆర్‌ను అరెస్ట్‌ చేశారు. 

నిజానికి కేవీఆర్‌ను బుధవారమే బొబ్బిలి కోర్టులో హాజరుపర్చాల్సి ఉండగా.. టీడీపీ నాయకుల ప్రోద్భలంతో అతనిని పోలీసులు బెయిల్‌పై విడుదల చేసేందుకు వీల్లేకుండా.. తెలంగాణ లోని పోలీసులు వచ్చే వరకూ పోలీసు స్టేషన్‌కు, కోర్టుకు తిప్పేలా చర్యలు తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో కేవీఆర్‌ను బొబ్బిలి సబ్‌జైలుకు తరలించారు. శుక్రవారం ఇక్కడి నుంచి సెంట్రల్‌ జైలుకు తరలించనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement